తెలుగు రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన కేంద్రం..1000 కోట్లు కోత!

Update: 2020-04-21 09:30 GMT
దేశం మొత్తం ఇప్పుడు కరోనా మహమ్మారి పై పోరాటం చేస్తుంది. దేశంలో  కరోనా వ్యాప్తి చెందకుండా ఇప్పటికే లాక్ డౌన్ ను విధించింది. దీనితో కేంద్రానికి - రాష్ట్రాలకు రాబడి భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏప్రిల్ నెలలో చెల్లించాల్సిన సెంట్రల్ ట్యాక్స్ - డ్యూటీస్‌ లో రాష్ట్రాల వాటాను ఆయా రాష్ట్రాలకు బదిలీ చేసింది. మొత్తంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని  రాష్ట్రాలకు కలిపి రూ.46,038 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే , లాక్ డౌన్ కారణంగా రాబడి పై ప్రభావం పడటంతో ఏప్రిల్ నెలకు గాను రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాలో కేంద్ర ఆర్థిక శాఖ 29.5 శాతం మొత్తాన్ని తగ్గించింది.

15వ ఆర్థిక సంఘం మధ్యంతర నివేదిక ఆధారంగా ఈ ఏప్రిల్ నుండి రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల వాటాను కేంద్రం బడ్జెట్‌ లో తెలిపింది. దీనితో  ఆ మొత్తం పూర్తిగా వస్తుందని భావించాయి. కానీ కరోనా ప్రభావంతో లాక్ డౌన్ అమల్లో ఉండటంతో భారీగా కోత పడింది. మాములుగా కేంద్ర పన్నుల వాటాగా  కేంద్రం నుండి ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్రానికి  రూ.1,195 కోట్ల నిధులు రావాలి. కానీ రూ.982 కోట్లు మాత్రమే ఇచ్చింది. అలాగే  ఆంధ్రప్రదేశ్‌ కు రూ.2,686 కోట్లు రావాల్సి ఉండగా రూ.1,892 కోట్లు మాత్రమే ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి రూ.212 కోట్లు - ఏపీకి రూ.794 కోట్లు కోత పడింది. మొత్తంగా రెండు రాష్ట్రాలకు రూ.1,000 కోట్లు కోత విధించింది.

ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లో తెలంగాణకు పన్నుల వాటాగా రూ.16,726 కోట్లు అందుతుందని బడ్జెట్‌ లో కేంద్రం తెలిపింది. ఈ లెక్కన రూ.1,393 కోట్లు అందాల్సి ఉంది. ఏపీకి రూ.32,237 కోట్లు అందుతుందని తెలిపింది. కానీ రూ.1,892 కోట్లు మాత్రమే  ఇచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలకు పన్నులు - పన్నేతర రాబడులు పడిపోయాయి. దీంతో కేంద్రం నుండి వచ్చే నిధులపై రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ, లాక్ డౌన్ ప్రభావం కేంద్ర నిధులపై కూడా భారీగానే పడింది. 28 రాష్ట్రాలకు ఏప్రిల్ నెలకు గాను రూ.65,348 కోట్లు ఇవ్వాల్సి ఉండగా - కేంద్ర ఆర్థిక శాఖ రూ.46,036 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మొత్తంగా రూ.19,312 కోట్ల కోత విధించింది.
Tags:    

Similar News