థూ.. వెధవ రాజకీయంతో కడుపు కొడుతున్నారే

Update: 2015-08-19 04:35 GMT
కోట్లాది మంది ప్రజానీకం అభిమతానికి వ్యతిరేకంగా పాలకుల ఇష్టానికి తగినట్లుగా ఏపీని రెండు ముక్కలు చేసేసిన వైనం భారత రాజకీయ చరిత్రలో చీకటి కోణంగా మిగిలిపోవటం ఖాయం. కేవలం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అంతకు బరి తెగించారన్న విషయాన్ని మర్చిపోకూడదు. చేసే పని వివాదరహితంగా చేసే దానికన్నా.. ఎవరో తరుముకొస్తున్నట్లుగా.. ఎన్నికల వేళ ఫలితం పొందేందుకు వీలుగా విభజన చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి రెండు ప్రాంతాల్లోని ప్రజలు తగిన రీతిలో సమాధానం ఇచ్చారు.

ఒక రాజకీయ పార్టీకి అధికారంలోకి రాకుండా చేసినంత మాత్రాన ప్రజలకు కష్టాలు రాకుండా ఉంటాయా? అంటే లేదనే చెప్పాలి. తమ రాజకీయ స్వార్థం కోసం ఇష్టారాజ్యంగా విభజన చేసేసిన కాంగ్రెస్ పుణ్యమా అని.. విభజన జరిగిన నాటి నుంచి నేటి వరకూ నిత్యం ఏదో ఒక పంచాయితీ తలెత్తటం తెలిసిందే.

విభజన చేసే సమయంలో అంశాల పట్ల అవగాహన లేకుండా ముక్కలు చేసేసిన నాటి కేంద్రం.. దానికి వత్తాసుగా నిలిచిన నాటి విపక్షం తమ సీట్లు మార్చుకున్నాయి. ఆసక్తికరంగా ఈ రెండు ఇప్పుడు మౌనం దాలుస్తున్నాయి.

ఏపీకి జరిగిన అన్యాయం సంగతే చూద్దాం. విభజన కారణంగా కొండంత లోటును నెత్తి మీద వేసుకొని నడుస్తున్న ఏపీకి సాయంగా ఉంటామని నాటి అధికారపక్షం హామీ ఇస్తే.. వారి కంటే మిన్నగా తాము చూసుకుంటామని నాటి విపక్షం బీరాలు పలికింది. ఎన్నికల అనంతరం ఇద్దరి స్థాయిలు.. స్థానాలు రివర్స్ అయ్యాయి. విపక్షం అధికారపక్షంగా మారితే.. అధికారపక్షం విపక్షంగా మారిపోయింది.

ఆశ్చర్యకరంగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హామీ అమలు గురించి నోటి మాటలు తప్పించి.. కాంగ్రెస్ చేతల్లో చేసి చూపింది లేదు. ఎందుకంటే.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఘోరీ కట్టేసి.. మళ్లీ పైకి లేవకుండా కట్టేయటమే. దీంతో.. ఏపీ మీద కాంగ్రెస్ కు మోజు పోయింది. తాము ఎంత ప్రయత్నించినా ఏపీలో బతికి బట్టకట్టటం అన్నది లేదన్న కారణంతో.. ఏపీ గురించి తాము ఎందుకు మాట్లాడాలన్నట్లుగా కాంగ్రెస్ వైఖరి ఉంది.

ఇక.. అధికారపక్షమైన బీజేపీ తీరు ఇంచుమించు ఇదే తీరులో ఉండటం గమనార్హం. అరకొర మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భావించిన ఎన్డీయే పక్ష అంచనాలకు భిన్నంగా.. భారీ మెజార్టీతో.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తాను బీజేపీ ఒక్కటే సొంతం చేసుకోవటం.. ఏపీలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపించకపోవటంతో.. ఏపీ మీద కమలనాథుల మోజు తగ్గిపోయింది.

విభజన సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని తీర్చే పని చేస్తే.. తమకు వచ్చే రాజకీయ లబ్థి లేకపోవగా.. తన మిత్రుడు మరింత బలోపేతం కావటం మోడీ అండ్ కోకు సుతారమూ ఇష్టం లేదు. ఏదో ఒక విధంగా ఏపీలో పాగా వేయాలన్న ఆలోచన తప్పించి.. అధికారం అందుకునే అవకాశం లేకపోతే.. పూచిక పుల్ల చందాన పక్కకు పెట్టేయటం మోడీ అండ్ కోకు పెద్ద విషయం కాదు.

అదే సమయంలో.. ఊరిస్తున్న బీహార్ రాష్ట్ర అధికారంపై కమలనాథుల కన్ను పడింది. కాస్త కష్టపడితే.. బీహార్ పీఠాన్ని సొంతంగా చేజిక్కించుకోవచ్చన్న ఆశ.. మోడీ నోట నుంచి రూ.1.25 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించేలా చేసింది. ఇంత భారీ మొత్తంతో పాటు.. గతంలో ఇచ్చిన రూ.40వేల కోట్ల హామీలు కూడా నెరవేరుస్తామని ఘనంగా ప్రకటించారు. అంటే.. ఒక్క బీహార్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నజరానా ఏకంగా రూ.1.65లక్షల కోట్లు.

పట్టుమని పదివేల కోట్ల న్యాయమైన సాయం ఏపీకి అందించేందుకు కిందామీదా పడే మోడీ సర్కారు ఏకంగా రూ.1.65లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన వైనం చూస్తే.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కాక తప్పదు. నాడు తెలంగాణలో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలన్న తపనతో కాంగ్రెస్.. రాష్ట్ర విభజనకు విపరీతమైన వేగాన్ని ప్రదర్శించింది ఏపీకి ఎనలేని నష్టాన్ని చేయటమే కాదు.. దశాబ్దాల తరబడి లేవకుండా చేసేంది.

ఇప్పుడు మోడీ సర్కారు.. ఎంత చేసినా ప్రయోజనం తమ ఖాతాలో పడదన్న ఉద్దేశంతో ఏపీని పట్టించుకోవటమే మానేశారు. ఏపీకి పెట్టే ఖర్చు.. బీహార్ లాంటి రాష్ట్రం మీద పెట్టుబడిగా పెడితే.. రాష్ట్రంలో అధికారం అనే లాభం పొందచ్చన్న రాజనీతితో భారీ ప్యాకేజీని ప్రకటించేస్తున్నారు.

కాంగ్రెస్ కావొచ్చు.. బీజేపీ కావొచ్చు.. రెండూ పార్టీలు ఒక్కటే. వారి ఆలోచనలు.. విధానాలు ఒక్కటే. నాయకుల రూపంలో ఉన్న వారి ముఖాలు వేరు అయినా.. మనసులు మాత్రం ఒక్కటేనన్న విషయం తాజా చర్యతో అర్థమవుతుంది. న్యాయమైన కోర్కెల కంటే కూడా.. తమకు ప్రయోజనం చేకూర్చే అంశాల మీదనే వారికి మమకారమని.. అందుకోసం లక్షలాది కోట్ల రూపాయిలు విరజిమ్మేందుకైనా సిద్ధవుతున్నారు. థూ.. ఇదేనా రాజకీయం అంటే. ప్రయోజనాలు తప్పించి.. ప్రజలు పట్టరా..?
Tags:    

Similar News