సిగ్గుసిగ్గు : బాబు బొంకులను లెక్కతీశారు..!

Update: 2016-08-19 05:08 GMT
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రకటించిన దాదాపు రెండు వేల కోట్ల రూపాయల సాయం విషయంలో ప్రజలేమీ పెద్దగా సంతోషించడం లేదు. ఇది తాము సాదించేసినట్లుగా తెదేపా నాయకులు - తాము ఇచ్చేసినట్టుగా భాజపా నాయకులు చంకలు గుద్దుకోవచ్చు గానీ.. 'ఇదంతా ఏ మూలకు' అనే భావనే ప్రజల్లో కనిపిస్తోంది. అయితే అదే సమయంలో.. కేంద్రం ఇచ్చిన సాయం గురించి వస్తున్న వార్తలను లోతుగా పరిశీలిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం పరువుపోయేలా ఉన్నదని - సిగ్గు పడాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మోడీ సర్కారు తేల్చిన లెక్కలను బట్టి, చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నది మొత్తం అబద్ధాలే అని వారు ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా ఉన్నదని అంతా అనుకుంటున్నారు.

విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆడిట్‌ లెక్కల ప్రకారం 16079 కోట్లు రెవెన్యూలోటుగా కేంద్రానికి నివేదికలు పంపారు. గతంలో కేంద్రం 2803 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు 1176 కోట్లు ఇచ్చింది. మొత్తం సుమారు 4వేల కోట్లు ఈ ఖాతాలో ఇప్పటికి ఇచ్చినట్టు లెక్క.

అయితే ఘోరమైన సంగతి ఏంటంటే.. మన రాష్ట్రం నుంచి ఆడిట్‌ లెక్కల ప్రకారం మనం 16వేల కోట్ల లోటు ఉన్నట్లు పంపితే.. కేంద్రం దానిని తిరిగి లెక్కించి.. కేవలం 6 వేల కోట్లు మాత్రమే లోటు అని లెక్క తేల్చారట. ఆ మేరకు రాష్ట్రానికి ఇంకో 2 వేల కోట్లు తప్ప.. లోటు కింద రూపాయి కూడా రాదు. ఇక్కడ మనం సిగ్గు పడాల్సిన విషయం ఏంటంటే.. మనం పంపిన లెక్కలను కాదని, వారు 16వేలను కాస్తా 6 వేలు చేసేయడం అంటే.. మనం చెప్పినవన్నీ అబద్ధాలు అని వారు తేల్చినట్లే కదా! చంద్రబాబునాయుడు ప్రభుత్వం మొత్తం అబద్ధపు లెక్కలు పంపిస్తున్నదని.. మోడీ సర్కారు ప్రపంచానికి చాటుతున్నట్లుగా ఈ కేంద్ర సాయం ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు.
Tags:    

Similar News