వైజాగ్ స్టీల్ : అమ్ముడు పోకుంటే మూసేస్తామ‌న్న కేంద్రం.. వ్యూహాత్మ‌క‌మేనా?

Update: 2021-03-10 08:30 GMT
'ఆంధ్రుల హ‌క్కు-విశాఖ ఉక్కు’ నినాదాలు మిన్నంటుతున్నాయి. స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణకు ప్రాణాలైనా అర్పిస్తాం అంటూ కార్మికులు ఉద్య‌మిస్తున్నారు. తొలుత ఫ్యాక్టరీ కార్మికుల నుంచి మొద‌లైన ఆందోళ‌న రోజురోజుకూ ఉధృత‌మ‌వుతోంది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లూ వ్య‌తిరేకిస్తుండ‌డంతో.. రాజ‌కీయ పార్టీలు కూడా ఏక‌తాటిపైకి వ‌చ్చాయి. దీంతో.. ఉద్య‌మం తార‌స్థాయికి చేరే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రం బెదిరింపుల‌తో కూడిన వ్యూహాల‌ను అమ‌లు చేస్తోందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

తాజాగా.. ఉక్కు ఫ్యాక్ట‌రీల ప్రైవేటీక‌ర‌ణ అంశంపై రాజ్యస‌భ‌లో ఆర్థిక స‌హామంత్రి అనురాగ్‌ ఠాకూర్ లిఖిత పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు. అది కూడా బీజేపీ ఎంపీ అడిగిన ప్ర‌శ్న‌కు కావ‌డం గ‌మ‌నార్హం. దేశంలో వ‌చ్చే ఐదేళ్ల‌లో 5 ఉక్కు ఫ్యాక్టరీల‌ను ప్రైవేటీక‌రించ‌డానికి కేంద్ర ఆర్థిక వ్య‌వ‌హారాల కేబినెట్ క‌మిటీ అనుమ‌తి ఇచ్చింద‌ని మంత్రి ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ రంగ వాణిజ్య ప‌రిశ్ర‌మ‌ల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కూ ప్రైవేటీక‌రిస్తామ‌ని చెప్పారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కోస‌మే ఈ నూత‌న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల విధానాన్ని తీసుకున్నామ‌ని చెప్ప‌డం విశేషం. ప్ర‌భుత్వ రంగంలోని సంస్థ‌లు, బ్యాంకులు, బీమా సంస్థ‌ల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని మంత్రి వెల్ల‌డించారు.

ఇటీవ‌ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ కూడా ప్రైవేటీక‌ర‌ణ అంశంపై మ‌రోసారి స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. విశాఖ స్టీల్స్ లో వంద శాతం వాటా కేంద్రానిదేన‌ని, రాష్ట్రానికి సంబంధం లేద‌ని ప్ర‌క‌టించారు ఆర్థిక మంత్రి. మొత్తం పెట్టుబ‌డులు కేంద్రానివే కాబ‌ట్టి.. ప్రైవేటీక‌ర‌ణ‌పై నిర్ణ‌యం కూడా కేంద్రానిదే అని తేల్చిచెప్పారు. ఇప్పుడు.. రాజ్య‌స‌భ‌లో ఆర్థిక స‌హాయ మంత్రి కూడా ప్రైవేటీక‌ర‌ణే త‌మ ప్ర‌భుత్వ విధానమ‌ని స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ ప్రైవేటీక‌ర‌ణ జ‌ర‌గ‌క‌పోతే.. ఆ సంస్థ‌ల‌ను మూసేస్తామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి. త‌ద్వారా.. అవ‌కాశం ఉంటే అమ్మేయ‌డం.. లేదంటే మూసేయ‌డమే అని ప్ర‌క‌టించారు.

అయితే.. కేంద్రం వ్యూహాత్మ‌కంగానే ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న చేసింద‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. ప్రైవేటీక‌రించ‌క‌పోతే.. మూసేస్తాం అన‌డం ద్వారా.. ఫ్యాక్టరీ మ‌నుగ‌డ సాగించ‌ద‌నే విష‌యాన్ని అర్థం చేయించాల‌ని చూస్తోంద‌ని అంటున్నారు. మాన‌సికంగా కార్మికుల‌ను సిద్ధం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు. ఖ‌చ్చితంగా ఫ్యాక్టరీ ఉండ‌న‌ప్పుడు.. మూసేయ‌డం ఎందుకు? అమ్ముకుంటే అయిపోతుంది క‌దా అని ప్ర‌జ‌లు అనివార్యంగా ప్రైవేటీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తు పల‌కాల‌నే ఉద్దేశంతోనే ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అంటున్నారు.

కాగా.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై కార్మిక సంఘాల నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మ‌డానికే బీజేపీ స‌ర్కారును ఎన్నుకున్నామా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఉపాధి చూపించాల్సింది పోయి.. ఉన్న ఉపాధిని కూల‌దోస్తారా? అని నిల‌దీస్తున్నారు. ప్రైవేటు పెట్టుబ‌డి దారుల‌కు ప్ర‌జ‌ల సంప‌ద‌ను దోచిపెట్ట‌డానికే న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని ఆరోపిస్తున్నారు. మ‌రి, కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం నేప‌థ్యంలో ఉద్య‌మం ఏ రూపం తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News