పోల‌వ‌రంలో మ‌రో ట్విస్ట్‌...318 కోట్లు విడుద‌ల‌

Update: 2017-12-11 14:13 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ట్విస్టులు కొన‌సాగుతున్నాయి. జాతీయ హోదా ద‌క్కిన ప్రాజెక్టును రాష్ట్రం నిర్మించ‌డం - ఈ క్రమంలో కేంద్రం కొర్రీలు పెట్ట‌డం అదే స‌మ‌యంలో రాష్ట్రం గంభీర ప్ర‌క‌ట‌న‌లు...వంటి ట్విస్టుల ప‌రంప‌ర‌లో పోలవరం నిర్మాణంలో కొత్త అంశాలు తెరపైకి వచ్చాయి. టెండర్ల ప్రక్రియకు బదులుగా కన్సార్టియం ప్రతిపాదనను తెస్తున్నారు. కన్సార్టియం ద్వారా ఇతర కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో పనులు చేపట్టనున్నారు. టెండర్లపై కేంద్రం అభ్యంతరాలతో కన్సార్టియం ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ఈ ప‌రిణామంపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. కేంద్ర ప్రతిపాదన ఏదైనా తమకు అంగీకారమేనని ఆయ‌న తెలిపారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోల‌వ‌రం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద డయాఫ్రం వాల్‌ - స్పిల్‌ వే - దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను చంద్రబాబు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ప్రతి సోమవారం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అందిస్తున్నామన్నారు. ప్రతి వారం అందించే వివరాలనే శ్వేతపత్రంగా భావించాలన్నారు. పునరావాస ప్యాకేజీ వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54వేల కోట్లకు చేరుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మే నెలలోపు డయాఫ్రం వాల్‌ - కాఫర్‌ డ్యామ్‌ పనులు పూర్తవుతాయన్నారు. ప్రాజెక్టు పూర్తికి త్రిసభ్య కమిటీ చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నామన్నారు. కాంక్రీటు పనుల వేగవంతానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణమైతే గ్రావెటీ ద్వారా నీరందిస్తామన్నారు.ఏపీలో ప్రతీ రైతుకూ పోలవరం ఓ కల అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ఏపీకి జీవనాడి అని - పోలవరం పూర్తయితే కరవు పోతుందన్నారు.

ఇదిలాఉండ‌గా...కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టుకు రూ.318.22కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్టిన ఖర్చులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. పీఎంకేఎస్ వై కింద పోలవరం ప్రాజెక్టుకు నిధులను నాబార్డ్ అందజేస్తోంది. పోల‌వ‌రంపై ప‌లు సందిగ్ధ‌త‌లు నెల‌కొన్న స‌మ‌యంలో ఈ చ‌ర్య ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News