గులాబీ ఎంపీలు మొత్తానికి సాధించారు!

Update: 2018-01-03 04:10 GMT
తెలుగు రాష్ట్రం విభజన అయిన తర్వాత.. రెండు రాష్ట్రాలకు హక్కుగా దక్కవలసిన విషయాల్లో కేంద్రం ఏ రీతిగా అలసత్వం ప్రదర్శిస్తూ వచ్చిందో అందరూ గమనిస్తూనే ఉన్నారు. అనాథలా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయడంలో గానీ - ఇటు నిధులు సమృద్ధిగానే ఉన్నా.. విభజనానంతర హక్కులు- ఏర్పాట్ల విషయంలో... చట్టం అనుమతించిన వసతులను కోరుకుంటున్న తెలంగాణ కోరికలు తీర్చడంలో గానీ.. కేంద్రం మితిమీరిన జాప్యం ప్రదర్శించింది. పదేళ్లపాటూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాదులో ఉండడానికి అవకాశం ఉన్నప్పటికీ.. రెండేళ్లకే ఏపీ రాజధాని మొత్తం అమరావతికి తరలిపోయింది. అయినా.. హైకోర్టు విభజన వంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా కేంద్రం మీనమేషాలు లెక్కించింది. ఈ విషయంలో కేంద్రంతో మడమ తిప్పకుండా పోరాడిన గులాబీ ఎంపీలు ఎట్టకేలకు సాధించారు.. సఫలం అయ్యారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి వారికి కొత్త హైకోర్టు కూడా ప్రారంభం కానుంది.

హైకోర్టు విభజన అనేది చిన్న సాంకేతికమైన ఏర్పాటు. నిజానికి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత..  న్యాయ వ్యవస్థ మీద - న్యాయమూర్తుల మీద ఎవ్వరూ నిందలు వేయకుండా ఉండే పరిస్థితి కల్పించడానికి హైకోర్టు విభజన అనే నిర్ణయాన్ని సత్వరం తీసుకుని ఉంటే చాలా బాగుండేది. అయితే అకారణంగా కేంద్రం ఈ విషయంలో జాప్యం చేసింది.

హైకోర్టు విభజన అనే అంశం మీద తెలంగాణ ఉద్యమ సమయంలోనే దీన్ని ఒక తీవ్రమైన సమస్యగా అప్పటి ఉద్యమ కారులు హైలైట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకోవడానికి న్యాయవాదుల పోరు కూడా కీలకం అయింది. దానికి తగినట్లుగానే... రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. హైకోర్టు విభజన విషయంలో సత్వర నిర్ణయం రాకపోవడం వారికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. పర్యవసానంగా న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేయడం, వ్యవస్థ మీద సందేహాలు రేకెత్తించడం వంటివి కూడా చోటు చేసుకున్నాయి. మొత్తానికి ఈ విషయంలో తెలంగాణ సర్కారు మొత్తం హైకోర్టు విభజన గురించి కేంద్రంతో గట్టిగానే పోరాడిందని చెప్పాలి. విభజన చట్టం చెప్పే అంశాల విషయంలో కేంద్రం సహజంగా ఉదాసీనత ప్రదర్శిస్తూ వచ్చినా.. తెరాస ఎంపీలు మాత్రం ప్రతిసారీ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తుతూ , ప్రభుత్వ పెద్దలను తరచూ కలుస్తూ ఇదే విజ్ఞప్తిని వినిపిస్తూ మొత్తానికి ఎట్టకేలకు సాధించగలిగారు.

ఈ ఏడాది జూన్ 2న తెలంగాణకు సొంత హైకోర్టు ప్రారంభం కాబోతున్నదని దానికి సంబంధించి సన్నాహాలు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ఆ సమయంలోగా ఏపీ హైకోర్టు అమరావతికి తరలిపోవాల్సి ఉండగా.. వాటికి కూడా తాత్కాలిక భవనాల్ని ఏర్పాటు చేస్తాం అంటూ చంద్రబాబునాయుడు కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే.. ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయానికీ అమరావతిలో నిర్దిష్ట భవనం అంటూ లేకపోగా.. కేంద్రం నిధులతో నిర్మించవలసిన హైకోర్టు భవనం విషయంలో కూడా ఇప్పటికీ చంద్రబాబునాయుడు అద్దె భవనం - తాత్కాలిక భవనం ఏర్పాటు చేయిస్తాం అని అంటూండడం విమర్శలకు దారితీస్తోంది.
Tags:    

Similar News