సీఐఐ స‌ద‌స్సులో ఆ ముఖ్యులేం మాట్లాడారు?

Update: 2016-01-11 04:00 GMT
విశాఖలో ప్రారంభమైన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుపై ఇపుడు తెలుగు రాష్ర్టాలే కాకుండా దేశంలోని ఇత‌ర అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల చూపు ప‌డింది. స‌ద‌స్సు సంద‌ర్భంగా పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకోవ‌డం ఒక్క‌రోజే దాదాపు రెండు ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు రావ‌డం ఆస‌క్తిక‌రం. అయితే సీఐఐ సద‌స్సు సంద‌ర్భంగా స‌మావేశానికి కీల‌క అతిథులు అయిన కేంద్ర మంత్రుల‌తో పాటు ఏపీ రథ‌సార‌థి నారా చంద్ర‌బాబు నాయుడు ఏం మాట్లాడార‌నేది ఇపుడు అంద‌రికీ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యంగా మారింది.

స‌ద‌స్సును ఉద్దేశించి కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్ మాట్లాడుతూ....ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో పర్యావరణ హిత పవర్‌ ప్లాంట్లును త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు. రీసైక్లింగ్‌ వాటర్‌ తో నడిచే విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఎనర్జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ - వర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి రూ.4 వేల కోట్లతో పంపుసెట్లు కేటాయించనున్నట్లు ప్ర‌క‌టించారు. దేశంలో తాము చేపట్టే ప్రతీ కార్యక్రమం తెలుగు రాష్ట్రం నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు.

అనంత‌రం చంద్ర‌బాబు ప్రసంగిస్తూ రాష్ట్రంలో పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్‌ డెస్క్‌ ఏర్పాటుచేశామ‌ని ఈ సింగిల్ డెస్క్ 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనవసర నిబంధనలు తొలగించి అనుమతుల ప్రక్రియను సరళీకరణ చేస్తామని చెప్పారు. ఓడ రేవులు - రహదారులు - జల రవాణాను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ లో అపారమైన అవకాశాలున్నాయని, పెట్టుబడులు పెట్టాలని  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. 2022 నాటికి దేశంలోని మూడు అగ్ర రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంటుందని, 2049 నాటికి దేశంలోనే రాష్ట్రం అగ్ర స్థానంలో నిలుస్తుందని అన్నారు. వృద్ధిరేటులో దేశంతోనే పోటీపడుతున్నట్లు చెప్పారు. వరుసగా మూడేళ్లు అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తే రాష్ట్రాభివృద్ధికి చేయూతనిచ్చినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. వచ్చే ఏడాది కూడా విశాఖలో సదస్సు నిర్వహించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అంగీకరించారని అన్నారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... సీఐఐ స‌ద‌స్సును విశాఖ‌లో నిర్వ‌హించ‌డం, ఏపీ త‌ర‌ఫున తాను ప్రాతినిధ్యం వ‌హించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తున్నాన‌ని చెప్పారు. కొత్త రాష్ర్టంలో ప‌రిశ్ర‌మ‌లు పెట్టేందుకు తనవంతు ప్రోత్సాహం అందిస్తాన‌ని చెప్పారు.
Tags:    

Similar News