ముక్క లేక‌పోతే ముద్ద దిగ‌డం లేదంట‌.. కేంద్ర స‌ర్వే సంచ‌ల‌నం!

Update: 2022-06-21 08:30 GMT
భార‌తదేశంలో చికెన్, మ‌ట‌న్ లేకపోతే ముద్ద దిగ‌నివారి సంఖ్య పెరుగుతోంద‌ని కేంద్ర జాతీయ ఆరోగ్య కుటుంబ ఆరోగ్య స‌ర్వే తాజాగా తెలిపింది. దేశంలో ఎక్కువ శాతం మంది ప్ర‌జ‌లు వారానికి కనీసం ఒకసారి చేపలు, చికెన్, మాంసంలో ఏదో ఒక దానిని కచ్చితంగా తింటున్నార‌ని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. ఈ మేర‌కు తాజాగా వివ‌రాలు ప్ర‌క‌టించింది. ఈ స‌ర్వేలో అనేక ఆసక్తిక‌ర అంశాలు వెలుగుచూశాయి.

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న మ‌హిళ‌లు, పురుషుల నుంచి వివరాలు సేకరించారు. ఆ సర్వే ప్రకారం.. దేశంలో శాకాహారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. శాకాహార పురుషుల సంఖ్య 21.6 శాతం నుంచి 16.6 శాతానికి త‌గ్గిపోయింది.

అంటే మాంసాహారులు 5 శాతం పెరిగారు. మహిళల్లో మాంసాహారుల సంఖ్య స్వల్పంగా 0.6 శాతం మాత్ర‌మే పెరిగింది. దేశ‌వ్యాప్తంగా 83.4 శాతం మంది పురుషులు, 70.6 శాతం మంది మహిళ‌లు మాంసాహారం తీసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 97.4 శాతం మంది పురుషులు, 95 శాతం మంది మహిళలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సంఖ్య పురుషుల్లో స్వల్పంగా, మహిళల్లో బాగా పెరిగింది.
2015–16లో 78.2 శాతం మంది పురుషులు మాంసాహారం తీసుకుంటే ఇది 2019–21 నాటికి 80 శాతానికి చేరుకుంది.

అదే మహిళల్లో 71.2 శాతం నుంచి 83.6 శాతానికి పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పురుషుల్లో 74.6 శాతం నుంచి 73.8 శాతానికి తగ్గితే.. మహిళల్లో మాత్రం 57.7 శాతం నుంచి 72.4 శాతానికి అనూహ్యంగా పెరిగినట్లు సర్వే వెల్లడించింది.

పురుషుల్లో మాంసాహారం తినేవారిలో లక్షద్వీప్‌లో అత్యధికంగా 98.4 శాతం ఉన్నారు. రాజస్థాన్‌లో అత్యల్పంగా 14.1 శాతం మంది మాత్ర‌మే ఉన్నారు. మాంసాహారం తీసుకునేవారిలో లక్షద్వీప్‌ తర్వాత అత్య‌ధికంగా అండమాన్‌ – నికోబార్‌ దీవుల్లో 96.1 శాతం, గోవా 93.8 శాతం, కేరళ 90.1 శాతం, పుదుచ్చేరి 89.9 శాతం మాంసాహారులు ఉన్నారు.
Tags:    

Similar News