శివాజీతో చ‌ల‌సానికి సంబంధ‌మే లేద‌ట‌!

Update: 2019-05-17 17:16 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం త‌న‌దైన శైలి పోరాటం సాగించ‌డ‌మే కాకుండా అప్ప‌టిక‌ప్పుడు ప్లేట్ ఫిరాయించేసి అధికార పార్టీ టీడీపీ పక్షాన చేరిపోయిన సినీ న‌టుడు శివాజీ ఇప్పుడు చాలా మందినే ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏదో సినిమా న‌టుడు క‌దా... ఆయ‌న వ‌స్తే... కాస్తంత జ‌నం వ‌స్తారు - ఉద్య‌మానికి ఓ మోస్త‌రు మ‌ద్ద‌తు అయినా దొరుకుతుంది క‌దా అని ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధనే ల‌క్ష్యంగా ఏర్పాటైన ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నేత‌లు శివాజీని భుజానికెత్తుకున్నారు. శివాజీ స‌ల‌హాలు తీసుకున్నారు. ఆయ‌న‌తోనే క‌లిసి ఉద్య‌మాలు చేశారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వద్ద‌ని - ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చినా చాల‌ని... హోదా డిమాండ్ ను జీవ‌శ్చ‌వంలా మార్చిన టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించినా కూడా శివాజీకి స‌మితి పెద్ద పీటే వేశారు.

ఇప్పుడు ప‌రిస్థితి అంతా ఒక్క‌సారిగా మారిపోయింది. టీవీ 9 వివాదంలో ఆ ఛానెల్ మాజీ సీఈఓ ర‌విప్ర‌కాశ్ తో చేతులు క‌లిపి కుట్ర ప‌న్నిన వ్య‌వ‌హారంలో శివాజీ అడ్డంగా బుక్కైపోయారు. ఎక్క‌డ పోలీసులు అరెస్ట్ చేస్తారోన‌న్న భ‌యంతో ర‌విప్ర‌కాశ్ తో క‌లిసి శివాజీ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్ప‌టిదాకా త‌న‌కు ఏమాత్రం సంబంధం లేని బీజేపీ - వైసీపీల‌ను టార్గెట్ చేస్తూ... గ‌రుడ పురాణం వినిపించిన శివాజీ ఇప్పుడు పెద్ద చిక్కుల్లోనే ప‌డ్డారు. ఈ క్ర‌మంలో శివాజీతో స్నేహం ఎక్క‌డ త‌మ మెడ‌కు చుట్టుకుంటుందోన‌న్న భ‌యం స‌మితి నేత‌ల‌ను ప్ర‌త్యేకించి సాధ‌న స‌మితి అధ్యక్షుడు చ‌ల‌సాని శ్రీ‌నివాస్ కు ప‌ట్టుకున్న‌ట్టుంది. టీవీ 9 వివాదం రోజుకో మ‌లుపు తిరుగుతుండ‌టం - వ‌రుస‌గా బ‌య‌ట‌కు వ‌స్తున్న ఆధారాల‌తో ర‌విప్ర‌కాశ్ తో పాటు శివాజీ కూడా వివాదంలో నిండా మునిగిపోయిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో... ఇక ఎంత‌మాత్రం సైలెంట్ గా ఉండ‌టం స‌రికాద‌ని కూడా చ‌ల‌సాని ఆలోచించిన‌ట్టున్నారు. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం మీడియా ముందుకు వ‌చ్చిన చ‌లసాని.... త‌న‌తో గానీ - స‌మితితో గానీ శివాజీకి ఎలంటి బంధం లేద‌ని తేల్చేశారు. స‌మితిలో శివాజీ అస‌లు స‌భ్యుడే కాద‌ని కూడా ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. హోదా కోసం ఉద్య‌మిస్తున్న వారిలాగే శివాజీని ప‌రిగ‌ణించామ‌ని, స‌మితి భేటీల‌కు కూడా ఆయ‌న‌ను ఆ కోణంలోనే అనుమ‌తించామ‌ని, అంతే త‌ప్పించిన స‌మితికి శివాజీతో ఎలాంటి సంబంధం లేద‌ని చ‌ల‌సాని చెప్పుకొచ్చారు. అయినా హోదా కోసం ఉద్య‌మించిన ప్ర‌తి ఒక్క‌రిని కూడా స‌మితి ఆహ్వానించింద‌ని, ఆ కోవ‌లోనే శివాజీ స‌ల‌హాలు కూడా తీసుకుంద‌ని తెలిపారు. మొత్తంగా వివాదం దెబ్బ‌తో శివాజీతో త‌మ‌కు సంబంధం లేద‌ని చ‌ల‌సాని చెప్పార‌న్న మాట‌.


Tags:    

Similar News