ఎంపీ శివప్రసాద్ పై వేటు తప్పదా?

Update: 2017-04-16 07:10 GMT
చంద్రబాబుపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఆ పార్టీ సీనియర్ లీడర్ - ఎంపీ  డాక్టర్ శివప్రసాద్‌ పై వేటు వేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయనపై వేటు వేస్తే  దళితుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తే ప్రమాదాన్నీ పరిశీలిస్తోంది.  ముఖ్యంగా దళితులకు అన్యాయం జరుగుతోందంటూ గళమెత్తిన శివప్రసాద్ పైనే వేటేస్తే అది నిజంగానే ఆయన చేసిన ఆరోపణలకు బలం చేకూర్చినట్లు అవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. దీంతో చంద్రబాబు ఈ విషయంలో ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నట్లుగా తెలుస్తోంది.
    
తెలుగుదేశం పార్టీ - ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతోందని బహిరంగ సభ సాక్షిగా బాంబు పేల్చిన శివప్రసాద్ వ్యవహార శైలి పార్టీని కుదిపేసింది. సీనియర్లు - మంత్రులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక దశలో ఆయనపై చర్య తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన వ్యాఖ్యలను బాబు తీవ్రంగానే పరిగణించారు. ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ శివప్రసాద్ ఏమాత్రం తగ్గకపోగా మీడియా ఎదుట మరింత అసంతృప్తి వ్యక్తం చేయడంతో, ఈ వ్యవహారాన్ని అటు ఆయన కూడా ప్రతిష్ఠగానే తీసుకున్నట్లు స్పష్టమైంది. తాను దళితుల గురించి మాట్లాడితే మఠం భూములను తెరపైకి తేవడం, దాన్ని పత్రికలో రాయించడమేమిటని ఆయన నిలదీశారు. పార్టీ - కార్యకర్తల సమస్యలను ప్రస్తావించేందుకు బాబును అనేకసార్లు కలిసే ప్రయత్నం చేసినా పట్టించుకోకుండా ఐఎఎస్ సతీష్‌ చంద్రతో మాట్లాడుకోమని వెళ్లిపోయారన్న విషయాన్ని ప్రస్తావించారు.
    
కాగా ఆదివారం శివప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమేరకు పార్టీ సీనియర్లు - మంత్రి అమర్‌ నాథ్‌ రెడ్డి ఆయనతో చర్చలు జరిపినట్లు వివరించారు. కాగా శివప్రసాద్‌ పై వేటు విషయమై నాయకత్వం ఆచితూచి వ్యవహరించాలని పలువురు నేతలు సూచిస్తున్నారు.  ఒకవేళ ఆయనపై వేటువేస్తే పార్టీ దళితులను అవమానిస్తోందనే ప్రచారం తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. కేబినెట్ విస్తరణ సమయంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి - చింతమనేని ప్రభాకర్ - కాపు వర్గానికి చెందిన బొండా ఉమామహేశ్వరరావుతో పాటు ఆర్టీఏ కమిషనర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన విజయవాడ ఎంపి కేశినేని నానిపై చర్యలు తీసుకోకుండా దళితుడైన శివప్రసాద్‌ పై వేటు వేస్తే అది నష్టం కలిగిస్తుందని చంద్రబాబుకు సీనియర్ మంత్రులు చెప్పినట్లుగా తెలుస్తోంది. వేసిందన్న అప్రతిష్ఠ మూటకట్టుకోవలసి వస్తుందని విశ్లేషిస్తున్నారు.  మరోవైపు శివప్రసాద్ వైసీపీలో చేరుతారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆయన ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చెందిన దళిత సంఘాలతో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.  దీంతో ఎలాగూ పార్టీని వీడుతారు కాబట్టి ముందే వేటు వేద్దామని చంద్రబాబు తన పార్టీ నేతలతో అన్నట్లుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News