పవర్ పోయాక కానీ బాబుకు పవన్ విలువ తెలిసిందట

Update: 2021-08-20 09:30 GMT
మితిమీరిన ఆత్మవిశ్వాసం కళ్లను కప్పేస్తుంది. వాస్తవాన్ని అంగీకరించేందుకు మనసు ఒప్పుకోదు. సన్నిహితులు.. శ్రేయోభిలాషులు ఎంత మొత్తుకున్నా.. ఆ క్షణంలో వారు చెప్పినవేవీ తలకెక్కనట్లుగా ఉంటాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే..బీజేపీ.. జనసేనతో కటీఫ్ చెప్పేందుకు టీడీపీ సిద్ధమైనప్పుడు బాబును చాలామంది హెచ్చరించారు. వారి అవసరం లేదని.. సొంతంగా గెలుపు ఖాయమని తేల్చారు. అందుకు దన్నుగా తనకున్న రిపోర్టుల్ని చూపించేవారు. కలిసి ఉంటే కలదు అధికారమని చెప్పినా.. వినని బాబు.. దారుణ పరాభవం ఎదురయ్యాక కానీ ఆయన కళ్లు తెరుచుకోలేదని చెబుతారు.

తప్పు జరిగిందని.. నివేదికల్ని నమ్మి మోసపోవటంతో పాటు.. తనను ఓడించేందుకు చేసిన ప్రయత్నాలు ఏమేమిటన్న విషయాల్ని తెలుసుకున్న ఆయన షాక్ తిన్నట్లు చెబుతారు. దేశంలో మరే ముఖ్యమంత్రిని ఓడించేందుకు జరగనంత గ్రౌండ్ వర్కు తనను ఓటమిపాలు చేసేందుకు కుట్ర చేశారన్న మాట ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు చెబుతారు. జనసేనతో పేచీ పెట్టుకోకుండా కలిసి పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న మాట కొందరి నోటి నుంచి వచ్చినప్పుడు అవునన్న రీతిలో ఆయన స్పందన ఉందని చెబుతారు.

జగన్ గెలుపు.. ఆయన పార్టీకి పెరిగి బలం ముందు తాము పోరాడే పరిస్థితి లేదన్న విషయంలో చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జనసేన కూడా టీడీపీ వైపు చూడటం మంచిదన్న భావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీతో పోలిస్తే బాబుతో మిత్రత్వం సరైనదన్న భావనకు పవన్ వచ్చినట్లు చెబుతారు. ‘బాబును పూర్తిగా నమ్మలేం. అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీరు ఒకలా ఉంటుంది. పవర్ లేనప్పుడు ఆయన మరోలా మాట్లాడతారు. ఆయనిచ్చే హామీలు సమయానికి తగ్గట్లు మారతాయి. కాకుంటే.. బీజేపీ అగ్ర నేతలతో పోలిస్తే.. చంద్రబాబే స్నేహధర్మాన్ని అంతో ఇంతో పాటిస్తారు’ అంటూ తన సన్నిహితుల వద్ద పవన్ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక సమయంలో బీజేపీ అనుసరించిన వైఖరి జనసేన అధినేతను బాగా హర్ట్ చేసిందని చెబుతారు. తమ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న రీతిలో వ్యవహరించటం సరికాదని.. దీర్ఘకాలంలో బీజేపీతో కలిసి నడవటం సాధ్యం కాదన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు విశాఖ ఉక్కు విషయంలో మోడీ సర్కారు తీరుపైనా పవన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తానేం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నానని.. సరైన సమయంలో తాను స్పందిస్తానని చెప్పినట్లుగా సమాచారం.

రానున్న రోజుల్లో టీడీపీతో కలిసి పని చేసే విషయంలోనూ పవన్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. అందుకు చాలా సమయం ఉన్నందున తొందరపడకూడదన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. జనసేనతో కలిసి పని చేయటానికి చంద్రబాబు సుముఖంగా ఉండటమే కాదు.. ఆ సంకేతాల్ని ఇప్పటికే పవన్ కు పంపటం.. అందుకు సానుకూలత వ్యక్తమైనట్లు సమాచారం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కలవటం ఏ మాత్రం మంచిది కాదని.. ఎన్నికలకు కాస్త ముందు వరకు ఇప్పటి మాదిరే మౌనంగా ఉండాలని.. సమయం చూసుకొని తమ నిర్ణయాన్ని వెల్లడించాలని రెండు పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవర్ పోయిన తర్వాత కానీ బాబుకు పవన్ విలువ తెలియలేదా? అని వ్యాఖ్యానిస్తున్నారు. మరో వైపు.. బాబుకు పవన్ దగ్గర అవుతున్న విషయాన్ని బీజేపీ అధినాయకత్వం గుర్తించిందని.. వారెలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News