ఏపీలో ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-12-15 08:30 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తమ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నాయి.

ఇప్పటికే టీడీపీ, జనసేన వంటి పార్టీలు ముందస్తు ఎన్నికలు తధ్యమని నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో చురుగ్గా తమ పార్టీ కార్యకలాపాలను సాగిస్తున్నాయి.

 చంద్రబాబు, నారా లోకేష్‌ సైతం బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఓవైపు నియోజకవర్గాల సమీక్షలు, గట్టి అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నారు.

ఇక పవన్‌ కల్యాణ్‌ సైతం ఈ మధ్య కాలంలో యాక్టివ్‌గానే రాజకీయాల్లో ఉంటున్నారు. మరో కొద్ది రోజుల్లో బస్సు యాత్రకు సైతం ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలో ముందస్తు ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే మే లేదా అక్టోబర్‌ ల్లో జగన్‌ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతుందన్నారు.

వైసీపీ వచ్చే మే లేదా అక్టోబర్‌ నెలల్లోనే ముందస్తు ఎన్నికలకు జగన్‌ వెళ్తారని చంద్రబాబు తెలిపారు. పూర్తికాలం అధికారంలో ఉంటే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతుందని జగన్‌ భావిస్తున్నారని తెలిపారు. అందుకే ముందస్తు వ్యూహానికి పావులు కదుపుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి', 'బాదుడే బాదుడు' కార్యక్రమాలకు ప్రజల్లో వస్తున్న అనూహ్య స్పందన చూసి జగన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నూటికి వెయ్యి శాతం వైసీపీ ఓటమి ఖాయమని వెల్లడించారు. అన్ని వర్గాల వారూ 'ఇదేం ఖర్మ' అంటూ బయటకు వస్తున్నారని గుర్తు చేశారు. 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం'పై పార్టీ ముఖ్యనేతలు, నియోజకవర్గ బాధ్యులతో ఆన్‌లైన్‌ విధానంలో చంద్రబాబు తాజాగా సమీక్షించారు.

టీడీపీ హయాంలో 12 లక్షల ఇళ్లు నిర్మిస్తే... వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో అయిదిళ్లు మాత్రమే నిర్మించిందనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు. రోజురోజుకూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన జగన్‌రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది మే లేదా అక్టోబరులో ఎన్నికలకు వెళ్లాలా? 2024 వరకు ఆగాలా? అన్న దానిపై జగన్‌ మథనపడుతున్నారని వెల్లడించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో అర్హులకు కూడా సంక్షేమ పథకాలు, ఫించన్లు నిలిపేస్తున్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌ లో రెండు వారాలు గడిచిపోయినా ఇంతవరకు ప్రభుత్వోద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు. రైతులు ధాన్యం అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తలసరి ఆదాయంలో ఏపీ వెనకపడడానికి జగన్‌ వైఖరే కారణమని చంద్రబాబు దుయ్యబట్టారు.  జగన్‌రెడ్డి వైఫల్యాలు, దోపిడీ కారణంగా ఏ వర్గం ఎలా నష్టపోయిందనే విషయాలపై ప్రజాక్షేత్రంలో చర్చించాలని నేతలను కోరారు.

తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికే జీతాలు ఇస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాగానే ప్రజలందరికీ న్యాయం చేస్తామని తెలిపారు.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News