ఓటమిని కౌగిలించుకున్న బాబు... ?

Update: 2021-11-17 08:26 GMT
ఏపీలో ఏదో జరిగిపోతుంది అన్నది చంద్రబాబు మార్క్ భ్రమ. లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరెటు ఉంటారో తెలియన‌ట్లుగా చంద్రబాబు నేల విడిచి సాము చేశారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వ్యూహాలను వదిలేసి ఊహలలో గడిపేస్తూ పెద్ద నోరు చేసుకున్నారు. కుప్పంలో చివరికి భారీ ఓటమి పలకరించింది. నిజానికి ఈ ఓటమి ఏపీ జనాలకు అందరికీ తెలిసిందే.

చంద్రబాబుకు కూడా తెలుసేమో. కానీ ఆయన కోరి మరీ ఓటమిని కౌగిలించుకుని అతి పెద్ద మరక తన రాజకీయ జీవితంలో తగిలించుకున్నారు. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన ప్రతీ చిన్న దానికీ నానాయాగీ చేసి జనాల్లో పెడుతూ ఉంటారు. అది అనుకూల మీడియాలో భారీగా హైలెట్ అవుతుంది.

అయితే దాని వల్ల వచ్చిన లాభమేంటి అన్నది ఆయనకు ఇప్పటికీ అర్ధం కాకపోవడమే చిత్రం. కుప్పంలో పంచాయతీలూ పరిషత్తులూ పోయినపుడే లోకల్ బాడీస్ లో టీడీపీ సీన్ ఎలా ఉందో బాబుకు బోధపడాలి. అంతే కాదు అధికార పార్టీ దూకుడు కూడా బాగా అవగతం అయి ఉండాలి.

దాంతో కుప్పం మునిసిపాలిటీని దానిమానన వదిలేసి ఉండినా బాగుండేది. ప్రచారం చేయాల్సి వస్తే కొడుకుని పంపించి ఊరుకుంటే సరిపోయేది. ఆ మాత్రం దానికి బాబు కుప్పానికి వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టారు. మూడు రోజుల పాటు మకాం వేసి మనదే విజయం అంటూ బీరాలు పోయారు. మిష్టర్ జగన్ తేల్చుకుందామా అని కూడా రెచ్చిపోయారు.

చివరికి బాక్సులు ఓపెన్ చేస్తే వచ్చిన ఫలితం టీడీపీ బాస్ కి దిమ్మతిరిగేలా ఉంది. కుప్పంలో నిన్నటి పంచాయతీ నేటి మునిసిపాలిటీ. పాతిక వార్డులు. అతి చిన్న ఎన్నిక. దాన్ని ప్రెస్టేజిగా తీసుకుని చంద్రబాబు సరిగ్గా వైసీపీ ట్రాప్ లో చిక్కుకుపోయారు. దీని కంటే కూడా కుప్పం ఎన్నికను తాము బహిష్కరిస్తున్నామని చెప్పుకుని తప్పుకున్నా బాగుండేది. కానీ బాబు ఎందుకో బాగా అతికి పోయారు. ఇపుడు భారీ ఓటమి నిందను మోస్తున్నారు. ఇపుడు మాత్రం కుప్పం చిన్నది కాదు, అది టీడీపీ క్యాడర్ నైతిక స్థైర్యాన్నే కృంగదీసే అతి పెద్ద అనకొండ లాంటిదే.

ఇక మీదట వైసీపీ చేస్తే టార్చర్ కానీ కామెంట్స్ కానీ తట్టుకోవడం టీడీపీ పెద్దలకు కష్టమే కావచ్చు. కుప్పంలోనే సీన్ కాలింది మీరా మాట్లాడేది అంటే జవాబు ఏముంటుంది. కుప్పంలో అధికార పార్టీ జులుం చేసింది, దౌర్జన్యాలు చేసింది. మొత్తం పవర్ ని దుర్వినియోగం చేసింది అని టీడీపీ అధినాయకత్వం చెబితే చెప్పవచ్చు కాక. కానీ ఎన్ని ఉన్నా కూడా టీడీపీ ఫెయిల్యూర్ ని కళ్ళ ముందు నుంచి చెరిపేయలేరు కదా. ఇక్కడ పచ్చిగా ఒక మాట చెప్పుకోవాలి.

ఏపీలో వైసీపీ గ్రాఫ్ సంగతి పక్కన పెడితే టీడీపీ మాత్రం గత రెండున్నరేళ్ళుగా చూస్తే విపక్షంగా ఘోరంగా విఫలం అయింది. ఏ రకమైన వ్యూహాలు లేకుండా ఎంతసేపూ జగన్ని తిడుతూ జూమ్ మీటింగ్స్ పెడుతూ ఏపీని దాటి ఎక్కడో కూర్చుని చేసే రాజకీయ విన్యాసాలకు మాత్రం జనాలు ఓట్లు వేయరన్నది అర్ధమైపోతోంది. ఇంతకీ కుప్పంలో ఓడింది కూడా దానికేగా.

ఏడుసార్లు బాబుని గెలిపించిన కుప్పం ఈసారి పంచాయతీల నుంచి మున్సిపాలిటీల దాకా ఎందుకు ఓడించింది అంటే చంద్రబాబు అక్కడ ఒక ఎమ్మెల్యేగా తాను చేయాల్సింది చేయకపోవడమే. మొత్తానికి బాబుకు కుప్పం ఓటమి ఒక జీవిత కాలం తీరని ఆరని వేదన‌గానే చెప్పాలి.




Tags:    

Similar News