టీడీపీకి ఇప్పటికైనా అర్థమైందా ?

Update: 2021-10-09 06:21 GMT
‘గుజరాత్ లో ముంద్రా పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్ తో ఏపీకి ఎలాంటి సంబంధంలేదు’ .. ఇది తాజాగా దర్యాప్తు సంస్థలు చేసిన ప్రకటన. గుజరాత్ లో రు. 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడిన విషయం అందరికీ తెలిసిందే. హెరాయిన్ పట్టుబడిందని తెలియగానే వెంటనే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని చంద్రబాబునాయుడు అండ్ కో బురద చల్లటం మొదలుపెట్టేసింది. పట్టుబడ్డ హెరాయిన్ కు జగన్ కు లింకులు పెట్టడం కోసం ప్రతిరోజు కతలు చెబుతునే ఉంది.

ప్రతిరోజు కొందరు నేతలు టైం టేబుల్ వేసుకున్నట్లుగా మీడియా ముందుకు రావటం పట్టుబడ్డ హెరాయిన్ కు తాడేపల్లి ప్యాలెస్ కు లింకులుందని చెప్పటం, ఏపీని జగన్ డ్రగ్ రాష్ట్రంగా మార్చేశాడంటు నానా గోల చేస్తున్నారు. పట్టుబడ్డ హెరాయిన్ కు విజయవాడలోని ఆషీ ట్రేడర్స్ అడ్రస్ దొరికిన కారణంగానే టీడీపీ ఇంత గోల చేస్తోంది. ఎక్కడో గుజరాత్ డ్రగ్స్ పట్టుబడితే అది ఏపిలోకి వచ్చేసినట్లుగా అందుకు జగనే కారణమన్నట్లు ఫుల్లుగా బురద చల్లేస్తోంది. గుజరాత్ నుండి ఏపిలోకి హెరాయిన్ ఎలా వస్తోంది ? అందులో భాగస్తులు ఎవరో కూడా టీడీపీనే డిసైడ్ చేసేసింది.

ఇంతా చేసి అసలా హెరాయిన్ తో ఏపికి ఎలాంటి సంబంధం లేదని తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) దర్యాప్తు సంస్ధలు తేల్చేశాయి. గుజరాత్ నుండి హెరాయిన్ ఢిల్లీకి వెళ్ళబోతోందని తమ దర్యాప్తులో తేలినట్లు దర్యాప్తు సంస్ధలు నిర్ధారించాయి. మొత్తం హెరాయిన్ దందాకు ఢిల్లీలోని కుల్ దీప్ సింగ్ కింగ్ పిన్ గా దర్యాప్తు సంస్ధలు గుర్తించాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇంత తొందరగా హెరాయిన్ స్మగ్లింగ్ గుట్టును దర్యాప్తు సంస్ధలు తేల్చేయటం టీడీపీకి మింగుడు పడటంలేదు. దేశంలో ఎక్కడేమి జరిగినా దాన్ని వెంటనే ఏపీకి ముడేసి అందులోను జగన్ను పేరు లాగేసి బురదచల్లేయటమంటే చంద్రబాబు అండ్ కో కు మహాసరదా. తాము చేస్తున్న ఆరోపణలను, చేస్తున్న విమర్శలను జనాలు నమ్ముతారా లేదా అనే విషయాలను కూడా టీడీపీ నేతలు ఆలోచించట్లేదు.

విశాఖ అడవుల్లో గంజాయి పట్టుబడుతోందని ఇపుడు టీడీపీ నేతలు గోల చేస్తుండటమే విచిత్రంగా ఉంది. వైజాగ్ జిల్లాలో ప్రధానంగా ఏవోబీ ప్రాంతంలో గంజాయి సాగు, స్మగ్లింగ్ అన్నది దశాబ్దాలుగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అదేదో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మొదలైనట్లుగా ఉంటోంది టీడీపీ నేతల ఆరోపణలు. అందరికీ తెలిసిన విషయాలను కూడా ఎవరికీ తెలీదన్నట్లుగా జగన్ టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తుండమే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికైనా తాము చేస్తున్న ఆరోపణల్లో కాస్తైనా లాజిక్ ఉందో లేదో చూసుకోకపోతే చంద్రబాబు అండ్ కో కే నష్టం. మరిప్పటికైనా బుద్ధి వస్తుందో రాదో చూడాల్సిందే.
Tags:    

Similar News