ఏపీ ప్ర‌భుత్వానికి చంద్ర‌బాబు లేఖ‌.. విష‌యం ఏంటంటే!

Update: 2021-12-10 11:30 GMT
టీడీపీ అధినేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు.. చంద్ర‌బాబు.. ఏపీ ప్ర‌భుత్వానికి త‌ర‌చుగా లేఖ‌లు రాస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ఎత్తి చూపుతూ.. ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం.. చంద్ర‌బాబు త‌ర‌చుగా.. ప్ర‌భుత్వానికి లేఖ‌లు సంధిస్తున్నారు. అయితే.. ఈ ద‌ఫా.. ఆయ‌న `సాయం చేయండి ప్లీజ్‌`` అంటూ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అభ్య‌ర్థ‌న పెట్టారు.

దీనినే లేఖ రూపంలో సంధించారు. అయితే.. ఇదేమీ త‌న‌కోస‌మో.. త‌న పార్టీ నేతల కోస‌మో కాదు.. ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌మాదంలో అమ‌రుడైన లాన్స్ నాయ‌క్ సాయితేజ కుటుంబం కోసం కావ‌డం గ‌మ‌నార్హం.

దేశ సేవ చేస్తూ అమరుడైన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎర్రబల్లి పంచాయతీకి చెందిన లాన్స్‌ నాయక్‌ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం క‌ల్పించాలంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. దేశానికి సేవ చేయాల ని 20 ఏళ్ల వయసులోనే ఆర్మీలో చేరి, 29 ఏళ్లకే అమరుడైన లాన్స్‌ నాయక్‌ సాయితేజకు టీడీపీ త‌ర‌ఫున‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడలో పుట్టి పెరిగి సాధారణ సైనికుడిగా ఎంపికై కేవలం తొమ్మిదేళ్ల సర్వీసులో ఏకంగా త్రివిధ దళాదిపతి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో చేరే స్థాయికి చేరడం వెనుక అతని కృషి, పట్టుదల, కష్టం నేటి యువతకు ఆదర్శమ‌ని చంద్ర‌బాబు కొనియాడారు. గిరిజన కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు.

హెలికాప్టర్‌ ప్రమాదంలో వీరమరణం పొందిన సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందజేయడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సాయితేజ కుటుంబాన్ని తక్షణమే అన్నివిధాలా ఆదుకోవాలని కూడా చంద్ర‌బాబు విన్న‌వించారు. మ‌రి ప్ర‌భుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.




Tags:    

Similar News