ప‌రువు పోవ‌డం కొద్దిలో త‌ప్పిందంటున్న బాబు!

Update: 2017-01-29 07:02 GMT
సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగిసిన నేప‌థ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర భవిష్యత్, ముఖ్యంగా యువత బాగోగుల గురించి తాను ఆలోచిస్తుంటే, ప్రతిపక్ష నేత రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని జగన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలనుకోవడం సరికాదని చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్ర విభజన తాను కోరుకోలేదని బాబు తెలిపారు. హేతుబద్ధంగా విభజన జరగలేదని, రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి సోనియా గాంధీ శాడిజాన్ని ప్రదర్శించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విభజన నేపథ్యంలో జగన్‌ను జైలు నుంచి బయటకు తీసుకువచ్చి, ముఖ్యమంత్రిని చేయాలనుకున్నారని అయితే చివరకు ప్రజల తీర్పు ఎలా ఉందో అంతా చూశారని చంద‌బ్రాబు వ్యాఖ్యానించారు.

నేర చరిత్ర ఉన్న ప్రతిపక్ష నాయకుడు తనపై విమర్శలు చేయడం బాధాకరంగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను ఒక నెంబర్-1 కూలీగా పనిచేస్తున్నాను. నా కుమారునికి - మనవడికి ఉద్యోగాలు అక్కర్లేదు. నా భార్య ఒక సంస్థకు యజమానురాలు. ఆమె సంపాదన ఆమెకు చాలు. నాకు డబ్బుపై వ్యామోహం లేదు. ఇటువంటి నాపై జగన్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది’ అని చంద్రబాబు అన్నారు. విశాఖలోని భాగస్వామ్య సదస్సును భగ్నం చేయడానికి జగన్ ప్రయత్నించారని అదే జరిగి ఉంటే..50 దేశాల్లో మన పరువు పోయుండేద‌ని బాబు వ్యాఖ్యానించారు. అటువంటి వ్యక్తి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించబట్టి సదస్సు సజావుగా సాగిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు పనిచేస్తున్నారు, రాష్ట్ర విచ్ఛిన్నం కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారో యువత కూడా ఆలోచించాలని చంద్ర‌బాబు కోరారు. అలా వివ‌రాలు తెలుసుకుని భవిష్యత్‌లో తగిన తీర్పు ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు ఎంత బెదిరించినా, తాను భయపడనని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇక పెద్ద ఎత్తున ఒప్పందాలు కుద‌ర‌డంపై చంద్ర‌బాబు సంతోషం వ్య‌క్తం చేశారు. 'నా మీద నమ్మకంతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయను. భారీయెత్తున జరిగిన ఒప్పందాలు మాపై మరింత బాధ్యతను పెంచాయి’ అని  చంద్రబాబు నాయుడు అన్నారు.‘సీఐఐ ఇప్పటివరకూ దేశంలో అనేక సదస్సులు నిర్వహించింది. గత సదస్సుల్లో ఎన్నడూ జరగనన్ని ఒప్పందాలు, రానంత పెట్టుబడులు వచ్చాయి. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు ఒక చారిత్రాత్మక సదస్సుగా మిగిలిపోనుంది. ఆటోమొబైల్, పెట్రో కెమికల్, టెక్స్‌టైల్స్, ఐటి, ఆహారశుద్ధి రంగాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది’ అని ఆయన చెప్పారు. అలాగే అంతర్జాతీయ వాణిజ్యంపై కూడా చర్చలు జరగడం సంతోష‌క‌ర‌మ‌ని ఆయన చెప్పారు. 2030 నాటికి రాష్ట్రంలో స్థిరమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో ఒక్కసారి ఒప్పందం కుదుర్చుకుంటే పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, పరిశ్రమ స్థాపించే వరకూ వారిని వెన్నంటి ఉంటామని బాబు హామీ ఇచ్చారు. భారీ పరిశ్రమల స్థాపనకు కావల్సిన అనుమతులు, ఇతరత్రా వ్యవహారాలు చూసేందుకు ఒక అధికారిని ప్రత్యేకంగా వారి కోసం కేటాయిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఏ పరిశ్రమకైనా రాష్ట్రం నుంచి రావల్సిన అనుమతులను 14 రోజుల్లో ఇచ్చేస్తామని చెప్పారు. ఈరోజు తీసుకుంటున్న చర్యలు సంపదను సృష్టిస్తాయని, ఆ సంపద సగటు మనిషికి చేర్చడమే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. పారిశ్రామికవేత్తలు శాంతి, సుఖశాంతులతో వ్యాపారం చేసుకోవాలంటే, ఏపీ ఒక్కటే సరైన ప్రదేశమని సీఎం చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News