బాదుడుకు బ్రేక్ వేస్తే..భారీ మైలేజీ ప‌క్కా చంద్రుళ్లు!

Update: 2018-09-04 08:17 GMT
నిజంగానే నిజం. చంద్రుళ్లు ఆలోచించ‌టం లేదు కానీ.. ఇప్పుడున్న  బ్ర‌హ్మాండ‌మైన ఛాన్స్ మ‌రెప్ప‌టికీ రానిది. ఇప్పుడు కానీ రియాక్ట్ అయితే ఒక దెబ్బకు రెండు పిట్ట‌ల‌న్న‌ట్లుగా ఉంటుంది. ఇంత‌కీ విష‌యం చెప్ప‌కుండా ఏదేదో చెబుతున్నామ‌ని అనుకోవ‌ద్దు. పాయింట్ కి వ‌చ్చేస్తున్నాం.

సంక్షేమ ప‌థ‌కాలు ఎన్ని ప్ర‌క‌టించినా.. భారీగా అమ‌లు చేసినా.. వాటి ప‌రిధిలోకి రానోళ్లు ఎవ‌రైనా ఉన్నారన్నంత‌నే మ‌ధ్య‌త‌ర‌గ‌తి.. ఎగువ త‌ర‌గ‌తి వ‌ర్గాలు మేమున్నామంటూ వ‌స్తారు. ఇలాంటోళ్లు మాకిది కావాల‌ని నోరు తెరిచి అడ‌గ‌రు. కానీ.. జ‌రుగుతున్న‌దంతా గ‌మ‌నిస్తుంటారు. లోప‌ల లావాను దాచి పెట్టి.. ఎన్నిక‌ల వేళ త‌మ ప్ర‌తాపాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. రానున్న రోజుల్లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీ మాష్టారికి భారీ షాక్ ఇచ్చేందుకు ఈ వ‌ర్గం భారీగా ప్లాన్ చేస్తోంది. ఈ వ‌ర్గం పుణ్యంతోనే 2014 ఎన్నిక‌ల్లో మోడీ మాష్టారు భారీగా ప్ర‌యోజ‌నం పొందారు.

త‌న‌ను అభిమానించి.. ఆరాధించే వారిని ప‌ట్టించుకోకుండా ఉండ‌టం మోడీకి అల‌వాటే. ప‌వ‌ర్ వ‌చ్చే వ‌ర‌కూ నిత్యం త‌లిచే ఈ వ‌ర్గాల వారిని ప‌వ‌ర్ చేతికి వ‌చ్చిన నాటి నుంచి ప‌ట్టించుకున్న‌ది లేదు. ఈ వ‌ర్గం వారు కోరుకునేది రెండే రెండు.. ఒక‌టి పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌లు అందుబాటులో ఉండ‌టం.. ఏడాది బ‌డ్జెట్ లో వ్య‌క్తిగ‌త ప‌న్ను విష‌యంలో కాస్త పెద్ద మ‌న‌సు. ఈ రెండు విష‌యాల్లో మోడీ మాష్టారు వేసిన దెబ్బ అంతా ఇంతా కాదు. ఈ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఏమీ చేయ‌లేరు.

ఇక‌.. పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల విష‌యంలో కేంద్రంతో పాటు రాష్ట్రాలు ఏమైనా చేసే అవ‌కాశం ఉంటుంది. ఆ మ‌ధ్య‌న ముడిచ‌మురు ధ‌ర‌లు భారీగా త‌గ్గిన నేప‌థ్యంలో అద‌న‌పు ప‌న్ను వేశారు ఇద్ద‌రు చంద్రుళ్లు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో పోలిస్తే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌న్ను బాదుడు ఎక్కువ‌. గ‌డిచిన ప‌దిహేను రోజులుగా పెట్రోల్‌... డీజిల్ ధ‌ర‌లు అంత‌కంత‌కూ ప‌డుతున్నాయి. దీనికి తోడు రూపాయి విలువ అంత‌కంత‌కూ ప‌డిపోతూ.. కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరిగాయి. లీట‌రు పెట్రోల్ రూ.84 ట‌చ్ అయితే.. డీజిల్ దాదాపుగా రూ.77 వ‌ర‌కూ వ‌చ్చేశాయి. దీంతో.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి.. ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారిని ఇబ్బంది పెడుతోంది. గ‌డిచిన ఆర్నెల్ల కాలంలో పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల్లో భారీ మార్పు చేసుకున్న విష‌యం తెలిసిందే. దీనికి అంత‌ర్జాతీయ కార‌ణాలు.. డాల‌రుతో రూపాయి మార‌కం విలువ అంటూ చాంతాడంత లిస్టు చ‌దివే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

వీటిని ప‌క్క‌న పెట్టి.. స‌గ‌టు జీవికి ఊర‌ట ఇచ్చేలా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏమైనా చేయొచ్చా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. దీనికి స‌మాధానం వెతికితే.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ గా చెప్పాలి. రాష్ట్రస్థాయిలో విధించే ప‌న్నుల విష‌యంలో కాస్తంత వెసులుబాటు క‌ల్పించి.. త‌మ ఆదాయాల్ని కాస్తంత త‌గ్గించుకునేందుకు రెఢీ అయితే ప్ర‌జ‌ల మీద భారం ఇట్టే త‌గ్గుతుంది. అదే జ‌రిగితే.. మొన‌గాడు మోడీ లాంటోడు పెట్రోల్.. డీజిల్ ధ‌ర‌ల మీద ఏమీ చేయ‌కుంటే.. చంద్రుళ్లు మాత్రం అందుకు భిన్నంగా ప‌న్నుల్ని త‌గ్గించి ప్ర‌జ‌ల మీద ప‌డే భారాన్ని త‌గ్గిస్తే.. ఆ వెసులుబాటును ప్ర‌జ‌లు గుర్తించ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రింత మంచి అవ‌కాశాన్ని చంద్రుళ్లు ఇద్ద‌రూ ఉప‌యోగించుకుంటారా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్పాలి.
Tags:    

Similar News