"ఆయన ఓపెన్ అయిపోయారు.. మేము అవ్వలేదు”!... పవన్ వ్యాఖ్యలపై అనిత!

ఇదే సమయంలో... తాను హోంమంత్రిని అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పుకొచ్చారు.

Update: 2024-11-05 09:38 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అత్యాచార ఘటనలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే. పిఠాపురం పర్యటనలో ఉన్న ఆయన... రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

క్రిమినల్స్ కు కులం, మతం ఉండవనే విషయాలు పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి.. నేరానికి పాల్పడిన వ్యక్తిని కులం చూసి వదిలేయాలని ఏ చట్టం చెబుతోంది అని ప్రశ్నించిన పవన్... నిందితుల్లో తమ బంధువులున్నా సరే వాళ్లని మడతపెట్టి కొట్టాలని సూచించారు. శాంతిభద్రతలు చాలా ముఖ్యమని ఎస్పీలు, అధికారులు గుర్తుంచుకోవాలని అన్నారు.

ఇదే సమయంలో... తాను హోంమంత్రిని అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పుకొచ్చారు. దీంతో... ఏపీలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలా ఉందో పవన్ వ్యాఖ్యలను చూస్తే అర్ధం అవుతుందని.. హోంమంత్రి రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత స్పందించారు.

అవును... శాంతిభద్రతల విషయంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో.. ఈ విషయంలో టీడీపీ నేతలు, మంత్రులు ఒక్కొక్కరుగా ఇది రాజకీయాలకు, పార్టీలకు అతీతమైన స్పందన అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలను పాజిటివ్ గా తీసుకోవాలని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... పవన్ కల్యాణ్ ఓపెన్ అయిపోయారు.. మేము అవ్వలేదు అని అన్నారు హోంమంత్రి అనిత. పవన్ కల్యాణ్ మాట్లాడిన సందర్భం ఏమిటో ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. అనితను పవన్ ఏదో అనేశారనే అంతా అనుకుంటున్నారు కానీ.. ఏమన్నారనేది ఎవరికీ కనిపించడం లేదని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో.. ఏపీలో లా అండ్ ఆర్డర్ పై పవన్ చేసిన వ్యాఖ్యలను తాను చాలా పాజిటివ్ గా తీసుకున్నట్లు అనిత తెలిపారు. తాను చేస్తున్న పనికి పవన్ మరింత సపోర్ట్ చేసినట్లు అయ్యిందని.. తనను ఇంకా అగ్రసివ్ గా వెళ్లమని పవన్ సూచించినట్లు అయ్యిందని అనిత భావానువాదం చేశారు!

మరోపక్క... పవన్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందించారు. ఇందులో భాగంగా... పవన్ వ్యాఖ్యలను నిందలు మోపినట్లు చూడకుండా, నిర్మాణాత్మక హెచ్చరికగా చూడాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలు నిర్దిష్టమైన సంఘటనకు సంబంధించినవని.. దీనిపై హోంమంత్రి చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు.

Tags:    

Similar News