బాదుడుపై ఒక చంద్రుడు రియాక్ట్ అయ్యారు

Update: 2015-07-13 03:49 GMT
చేతిలో అధికారం ఉంటే.. తాము తీసుకునే నిర్ణ‌యాల‌ను పునఃస‌మీక్షించుకోవ‌టం లాంటి వాటికి ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉండే వారు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు. అయితే.. త‌న సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలు చూసిన చంద్ర‌బాబు మాత్రం.. తాజాగా ఒక తెలివైన ప‌ని చేశారు. గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా ఆర్టీసీ బ‌స్సుల్లో పుష్క‌రాల కోసం వినియోగించే బ‌స్సు ఛార్జీలను 50 నుంచి 63 శాతం వ‌ర‌కూ స‌ర్ ఛార్జ్ వేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే.

ఈ నిర్ణ‌యంపై సాధార‌ణ ప్ర‌జానీకం నుంచి తీవ్ర‌నిర‌న‌స‌న వ్య‌క్త‌మైంది. ఒకప‌క్క రంజాన్ సంద‌ర్భంగా మైనార్టీల‌కు రంజాన్ సంద‌ర్భంగా ఉచితంగా స‌రుకులు ఇచ్చి తోఫా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు.. మ‌రోవైపు పుష్క‌రాల సంద‌ర్భంగా స‌ర్ ఛార్జీ పేరిట బాదేస్తారా? అన్న విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి.

మీడియాలోనూ ఈ వ్య‌వ‌హారం ప్ర‌ముఖంగా రావ‌టంతో.. దీనిపై దృష్టి సారించిన చంద్ర‌బాబు వెంట‌నే స‌ర్ ఛార్జ్ నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు వ‌సూలు చేయ‌కుండా మామూలు ధ‌ర‌ల‌తోనే ఆర్టీసీ బ‌స్సుల్ని న‌డ‌పాల‌ని నిర్ణ‌యించారు.

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యాన్ని ఏపీ మంత్రులు శిద్దా రాఘ‌వ‌రావు.. నారాయ‌ణ వెల్ల‌డించారు. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యాన్ని చంద్ర‌బాబు తీసుకున్నార‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News