బాబు బుజ్జగించాడు..వాయిస్ మారిపోయింది

Update: 2017-05-03 10:44 GMT
మొన్నటి దాకా టీడీపీ ఎంపీ శివప్రసాద్ పార్టీ మీద.. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి మీద ఏ స్థాయిలో నిప్పులు చెరిగారో అందరికీ తెలుసు. ప్రస్తుత ప్రభుత్వం దళితుల హక్కుల్ని కాలరాస్తోందని.. దళితుల అభివృద్ధికి పాటు పడట్లేదని ఆయన మీడియా ముఖంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లాలో దళితుల భూముల కోసం పాటుపడుతున్న తనపై కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని కూడా ఆయన విమర్శించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఆయన స్వరం మార్చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అనంతరం ఆయన అధినేతకు అనుకూలంగా మాట్లాడారు.

చంద్రబాబుతో తనకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని.. దళితుల సమస్యలపై సీఎంతో గంటా 45 నిమిషాల పాటు మాట్లాడానని.. సమస్యల్ని పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని శివప్రసాద్ అన్నారు. మొన్నటిదాకా శివప్రసాద్ టీడీపీపై.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ తీరు చూస్తే ఆయన పార్టీ మారతారేమో అన్న ప్రచారం జరిగింది. ఐతే చంద్రబాబు స్వయంగా పిలిచి బుజ్జగించడంతో శివప్రసాద్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. శివప్రసాద్ కంటే ముందు ఆనం బ్రదర్స్ సైతం ఇలాగే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుండటం.. ప్రతిపక్ష నేత జగన్ రైతు దీక్షతో జనాల్లోకి వెళ్తుండటంతో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన అలజడి నెలకొనగా.. అదే సమయంలో కీలక నేతలు వ్యతిరేక స్వరం వినిపించడంతో చంద్రబాబు కొంత కలవరపడ్డారని.. అందుకే ఈ నేతల్ని పిలిచి స్వయంగా బుజ్జగించే పనిలో పడ్డారని అంటున్నారు. బాబే స్వయంగా నచ్చజెప్పడంతో ప్రస్తుతానికి వీళ్లు వెనక్కి తగ్గారు. స్వరం మార్చి ప్రభుత్వానికి అనుకూలంగా.. ప్రతిపక్ష నేతకు వ్యతిరేకంగా మాట్లాడారు. మరి ఈ స్టాండ్ ఎంత కాలం కొనసాగుతుందన్నది సందేహమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News