టైటిల్ అద్దిరిపోలా?:దోమ‌ల‌పై దండయాత్ర‌

Update: 2016-09-20 13:18 GMT
దండ‌యాత్ర‌..ఇది ద‌యాగాడి దండ‌యాత్ర అంటూ  ఓ సినిమాలో జూనియ‌ర్ ఎన్టీఆర్ తన ప్ర‌కోపాన్ని వెల్ల‌డిస్తూ డైలాగ్ వ‌దులుతాడు. అయితే పెద్ద విల‌నేం ఖ‌ర్మ చిన్న దోమ‌ను అయినా దండ‌యాత్ర రూపంలోనే మ‌ట్టుబెట్టాల‌నుకున్నారో ఏమో తెలియ‌దు కానీ... ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇదే త‌ర‌హా డైలాగ్‌ తో రంగంలోకి దిగారు. వ్యాధులు తీవ్రంగా ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి  చంద్ర‌బాబు తాజాగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా హితోప‌దేశం కూడా చేశారు. వ్యాధులకు ఎవరూ అతీతం కాదంటూ, ఇది నా పని కాదనే ఉదాసీనత తగదని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ప్రతి ఒకరు తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే  ఇళ్ల ముందు రహదార్లను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీఎం చంద్ర‌బాబు సూచించారు. బ్లీచింగ్ చల్లటం - ఫాగింగ్ చేయడం - యాంటీ లార్వా చర్యలను ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. కృష్ణా పుష్కరాలలో - పంటలు కాపాడటంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏవిధంగా ఉపయోగించుకున్నామో అంటువ్యాథుల నియంత్రణకు కూడా అదేవిధంగా వినియోగించాలన్నారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ‘దోమలపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రత’  కార్యక్రమంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొనాలని బాబు సూచించారు. రాష్ట్రం నుంచి మలేరియా - డెంగీ - చికన్ గన్యా - డయారియా - టైఫాయిడ్ - స్వైన్ ప్లూ తదితర 9 వ్యాధులను 100%  నిర్మూలించాలన్నారు. పారిశుద్ధ్యం మెరుగునకు 14వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలని సూచించారు.

ముఖ్యమంత్రిగా తాను పాల్గొంటాన‌ని చెప్పిన సీఎం చంద్ర‌బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి గ్రామ కార్యదర్శి వరకూ అంటు వ్యాధులపై యుద్ధంలో భాగస్వాములు కావాలన్నారు. ‘జన్మభూమి- మా ఊరు’ తరహాలో అంటు వ్యాధుల నివారణకు ప్రతి గ్రామానికి ఓ అధికారిని నియమిస్తామన్నారు. ప్రతి జిల్లాకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సమన్వయం చేస్తారని వివరించారు. ఈ నెల 24వ తేదీన శనివారం అంటువ్యాధులపై సామూహిక ప్రజా చైతన్య యాత్రలలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.  ప్రతి శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ - వనం -మనం - జలసంరక్షణతోపాటు ‘దోమలపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రత’ కార్యక్రమం తప్పనిసరిగా చేపట్టాలన్నారు. పాఠశాలలు - కళాశాలల్లో ఉదయాన్నే ప్రార్ధన తరువాత విద్యార్ధుల చేత అంటువ్యాదుల నియంత్రణ- పరిశుభ్రతపై డిబేట్ నిర్వహించాలని చంద్ర‌బాబు అన్నారు. ప్రతి ఒక్కరూ అయిదుగురిని చైతన్య పరచాలని - రాష్ట్రవ్యాప్తంగా 5 కోట్ల మందిలో అవగాహన పెంచాలని కోరారు. ఏ వ్యాధి ఎందువల్ల వస్తుంది - అందుకు చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు - డ్వాక్రా మహిళలు - జన్మభూమి- మా ఊరు కమిటీ సభ్యులు - ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు.
Tags:    

Similar News