అసెంబ్లీ సాక్షిగా త‌మ్ముళ్ల‌పై మండిప‌డిన‌ బాబు

Update: 2017-11-28 04:20 GMT

ఏపీ ముఖ్యమంత్రి - టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోపం న‌షాళానికి అంటింది. అది కూడా స‌హ‌జంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష మీద లేదంటే ఇంకొక‌రి మీద‌నో కాదు...సాక్షాత్తు తెలుగు త‌మ్ముళ్ల‌పైనే...బాబుకు బీపీ పెరిగిపోయింది. దీంతో ఆసెంబ్లీ వేదిక‌గానే త‌మ్ముళ్కు త‌లంటారు బాబు. సోమవారం ఉదయం సభకు హాజరైన సందర్భంలో చంద్రబాబు సభలో తగినంతమంది సభ్యులు - మంత్రులు లేని విషయాన్ని గమనించి, అందరినీ టీ బ్రేకులో వచ్చి కలవాలని ఆదేశించారు. ఆ సందర్భంలో బాబు వారిపై విరుచుకుపడినట్లు సమాచారం. `నాలుగురోజులు పాటు ఇచ్చిన సెలవులు మీకు సరిపోలేదా? ఇంకా హాలిడే మూడ్‌ లోనే ఉంటే ఎలా? మీలో ఎవరికీ సీరియస్‌ నెస్ లేదు. విపక్షం లేని సభను సమస్యల పరిష్కారానికి వేదికగా మార్చుకోవాలన్న శ్రద్ధ మీలో చాలామందికి కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలవని వారి రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. గుర్తుంచుకోండి’ అని హెచ్చరించారని స‌మాచారం.

పెళ్లిళ్లు - శుభకార్యాలున్నాయంటే నాలుగురోజులు సెలవులిస్తే అది కూడా సరిపోదన్నట్లు ఇవాళ కూడా సభకు చాలామంది రాకపోవడం బట్టి, మీలో సీరియస్‌ నెస్ తగ్గుతోందని చంద్ర‌బాబు మందలించారని స‌మాచారం. ఎవరెవరు రాలేదో గుర్తించి వారికి ఫోన్లు చేయాలని ఆదేశించారు. చాలామంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో నాయకులను సమన్వయం చేసుకోవడం లేదని, అది వారికే నష్టమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గెలవని వారి రాజకీయ జీవితం చాలా ఇబ్బందులపాలవుతుంది. నేను పదే పదే ఈ విషయం ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండని హెచ్చరించారు. అన్ని స్థానాలూ గెలవాల్సిందేనన్నారు. కాగా అమరావతిపై సభలో చర్చించే అంశంపై సమావేశంలో పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మనం ఇంత అభివృద్ధి చేస్తూ, అమరావతిని ఫోకస్ చేస్తున్నప్పుడు, రాజధాని కోసం ఏం చేస్తున్నామో, ఇప్పటివరకూ ఏం చేశామో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి, తప్పనిసరిగా సభలోనే చర్చిద్దామని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కాగా, డిసెంబర్ 1న పండుగ సందర్భంగా సెలవు ప్రకటిద్దామని, 2న సభ నిర్వహించి ముగిద్దామని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత సోమవారం పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో మంగళవారం సభలో మాట్లాడించాలని సమావేశంలో నిర్ణయించారు.

మ‌రోవైపు కాగా, గత కొన్నిరోజుల నుంచి సభలో హాజరుశాతం తగ్గుతుండటంపై వస్తున్న విమర్శలకు చీఫ్ విప్, విప్‌లే కారణమని పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. సభకు సభ్యులు ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది లాబీలో ఉంటున్నారు? ఎంతమంది బయట ఉంటున్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత వారిదేనని గుర్తుచేస్తున్నారు. మధ్యలో సభ్యుల నుంచి హాజరు తీసుకోవలసిన అవసరం ఉందని, ఈ పరిస్థితిపై లోకేష్ కూడా సీరియస్ అయి, రోజుకు 5 సార్లు హాజరుతీసుకోవాలని ఆదేశించవలసి వచ్చిందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ‘చీఫ్ విప్, విప్‌లకు ఉండే పనే అసెంబ్లీ సమావేశాలున్నప్పుడు. వారికి మిగిలిన రోజుల్లో ఏం పని ఉంటుంది? మెంబర్ల హాజరు తీసుకుని, వారిని సభలోనే ఉంచాల్సిన బాధ్యత కూడా నిర్వర్తించకపోతే ఇక వారికి ప్రొటోకాల్ పదవులిచ్చి ఉపయోగం ఏమిట’ని ఎమ్మెల్యేలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News