ముందు ఈ క‌న్ఫ్యూజ‌న్ నుంచి బ‌య‌ట‌కు రండి బాబు!

Update: 2019-07-04 05:27 GMT
టీడీపీ అధినేత క‌మ్ ఏపీ విప‌క్ష నేత చంద్ర‌బాబు ప‌రిస్థితి ఇప్పుడు మ‌హా ఇబ్బందిక‌రంగా ఉందా? అంటే అవున‌ని చెప్పాలి. ఆయ‌నున్న ఒత్తిడి ఎంత‌న్న‌ది ఆయ‌న మాట‌ల్లోనే క‌నిపిస్తోంది. ఓవైపు ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోవ‌టం ఎంతో.. మ‌రోవైపు వాస్త‌వాన్ని ఒప్పుకోలేని తీరు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్పాలి. త‌న‌ను తాను ఎక్కువ‌గా ఊహించుకోవ‌టం.. ప్ర‌జాస్పంద‌న‌ను య‌థాత‌ధంగా అంగీక‌రించ‌లేని ల‌క్ష‌ణ‌మే బాబును ప్ర‌జ‌ల నుంచి.. ప‌ద‌వి నుంచి దూరం చేసింద‌ని చెప్పాలి.

త‌న‌కున్న అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే తుది ఫ‌లితం వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం బాబులో ఎక్కువ‌. పేదోళ్ల‌కు ఫించ‌న్లు ప‌డేస్తే.. వారే ఓట్లు వేస్తారు. ఎన్నిక‌ల ముందు వేళ వ‌ర‌కూ ఊరించి.. ఆడోళ్ల‌కు బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బులు వేస్తేసే ఈవీఎంల‌లో సైకిల్ గుర్తును అదే ప‌నిగా నొక్కేస్తారన్న తెలివిత‌క్కువ అంచ‌నాల అత్యాశే.. బాబు ఓట‌మికి కార‌ణం. ప‌థ‌కాల్ని ప్రేమ‌తో.. పేద‌వారి ప‌రిస్థితుల్ని మార్చాల‌న్న నిజాయితీ కంటే కూడా ఓట్ల‌ పంట కోస‌మ‌న్నట్లుగా వ్య‌వ‌హ‌రించ‌ట‌మే బాబును భారీగా దెబ్బేసింద‌ని చెప్పాలి.

ఏపీలో టీడీపీ ఓట‌మి ఎందుక‌న్న విష‌యంపై నిజం తెలుసుకోవాలంటే అందుకోసం పెద్ద పెద్ద అధ్య‌య‌నాలు చేయాల్సిన అవ‌స‌రం లేదు. న‌లుగురు సామాన్యుల‌తో మాట్లాడితే విష‌యం ఇట్టే అర్థ‌మైపోతుంది. అంత చిన్న విష‌యం బాబుకు ఒక ప‌ట్టాన అర్థం కాన‌ట్లుగా మాట్లాడుతుంటారు. అలా అని ఆయ‌న‌కు నిజంగా తెలీదా?  అంటే తెలుసు. కానీ.. తెలీన‌ట్లుగా మాట్లాడే ఆయ‌న తీరు ఇప్పుడు కొత్త అయోమ‌యాన్ని సృష్టిస్తోంది. తాజాగా ఆయ‌న చేసిన ఒకే ప్ర‌సంగంలో ఆయ‌న మాట‌ల్ని చూస్తే.. ఈ క‌న్ఫ్యూజ‌న్ ఏంది బాబు? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.

ప్రాంతాల వారీగా.. రంగాల వారీగా తాను చేసిన అభివృద్ధి క‌ళ్ల‌కు క‌నిపిస్తోంద‌ని.. కానీ ప్ర‌జ‌లు ఏ విధంగా ఆలోచిస్తున్నారో త‌న‌కు అర్థం కావ‌టం లేద‌న్న బాబు.. 23 సీట్ల‌కు ప‌రిమిత‌మ‌య్యేలా తానేం త‌ప్పు చేశాన‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఓప‌క్క ఈ మాట చెప్పి మ‌రికాసేప‌టికే..  సంక్షేమ ప‌థ‌కాలు ఇచ్చాం క‌దా.. ప్ర‌జ‌లే ఓట్లు వేస్తార‌ని కొద్దిమంది నేత‌లు ఇంట్లో నిద్ర‌పోయారు. నేను ముఖ్య‌మంత్రిగా జాగ్ర‌త్త‌ప‌డి ఉంటే ప‌రిస్థితిగా వేరుగా ఉండేది.. ఇలాంటి స‌మావేశ‌మే ఉండేది కాద‌ని వాపోవ‌టం క‌నిపిస్తుంది.

ఈ మాట‌లు విన్న‌ప్పుడు బాబుకు ఓట‌మికి కార‌ణం బాగానే తెలుసు. కానీ.. అంత‌లోనే తెలీన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అది ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షించేందుకు కావొచ్చు.. సానుభూతిని పండించేందుకు కావొచ్చు. కానీ.. ఈ డ‌బుల్ టోన్ మాట‌ల్ని ప్ర‌జ‌లు గుర్తిస్తార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. క‌న్ఫ్యూజ‌న్ తో త‌ప్పు చేయ‌టం ఓకే.. కానీ.. ప్ర‌జ‌ల్ని క‌న్ఫ్యూజ‌న్ లో ప‌డేసి ల‌బ్థి పొందాల‌న్న ట్రిక్కులు వ‌ర్క్ వుట్ కావ‌న్న‌ది బాబు గుర్తిస్తే మంచిది.

Tags:    

Similar News