వైసీపీ దూకుడు బాబుకు బీపీ పెంచేస్తోంద‌ట‌

Update: 2018-02-08 04:42 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు అనూహ్య‌మైన రాజ‌కీయ స్థితిలో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు సాధించ‌డంలో వైఫ‌ల్యం ఓ వైపు...రాజ‌కీయంగా ఎదుర‌వుతున్న ఎదురుదాడి మ‌రోవైపు ప్ర‌ధానంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ దూకుడు పెంచ‌డం ఇంకోవైపు ఇలా చుట్టుముట్టిన స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న ఇర‌కాటంలో ప‌డుతున్నార‌ని అంటున్నారు. పోలవరం - అమరావతి నగర నిర్మాణం - రెవిన్యూ లోటు భర్తీ వంటి అతి పెద్ద సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయో తెలియని గందరగోళం మధ్య వైసీపీ సహా విపక్షాలు రాజకీయంగా ఒత్తిడి పెంచుతుండ‌టం స‌హ‌జంగానే టీడీపీ అధినేత‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోందని అంటున్నారు. ఇదే స‌మ‌యంలో కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో మ‌ద్ద‌తు ద‌క్క‌క‌పోవ‌డంతో...ఏక కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు కనిపించే రాజకీయ శత్రువు వైసీపీ - కలసిరాని మిత్రపక్షం బీజేపీతో పోరాడుతున్నారని అంటున్నారు.

విభజన హామీలు అమలు చేస్తామన్న బీజేపీతో జతకట్టి గెలిచిన బాబు ఇప్పుడు కేంద్రాన్ని నమ్మి జనం దృష్టిలో ముద్దాయిగా నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రధానంగా రెవిన్యూలోటు భర్తీ కింద 13 వేల కోట్లలో 9 వేల కోట్లు రావలసి ఉందని అధికారులు చెబుతున్నారు. రైల్వే జోన్ - విద్యాసంస్థలకు పూర్తిస్థాయి నిధులు - అమరావతి నగర నిర్మాణానికి రావలసిన రెండు వేల కోట్లు వంటి పెద్ద సమస్యలతోపాటు.. ఆంధ్ర- తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కొనసాగుతున్న విభజన సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ - ఇతర విపక్షాల రాజకీయ ఉద్యమాలతో బాబు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. అమరావతి నిర్మాణం - పోలవరం ప్రాజెక్టు వంటి కీలకాంశాలపై మరోవైపు కేంద్రంతో పోరాడుతున్నారు.  

అయితే తాజా ప‌రిణామాల ప్ర‌భావం త‌న‌పై ప‌డ‌కుండా సీఎం చంద్ర‌బాబు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని అంటున్నారు. బీజేపీ సహాయ నిరాకరణతో ప్రజల్లో వెల్లువెత్తుతోన్న ఆగ్రహం తెదేపా ఖాతాలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. మళ్లీ కేంద్ర బడ్జెట్‌ లో రాష్ట్రానికి అన్యాయం - విభజన హామీలపై అమలు కోసం రాజకీయ పరంగా కేంద్రంపై పార్లమెంటులో పోరాటానికి అమరావతి నుంచి దిశానిర్దేశం చేస్తుండ‌టం ఇందులో భాగ‌మ‌ని వివ‌రిస్తున్నారు. బీజేపీతో మైత్రి ఎంతవరకు కొనసాగుతుందో అర్థంకాని అయోమయ పరిస్థితి నెలకొనడంతో, సంక్షేమ బలంతోనే వచ్చే ఎన్నికల్లో పట్టుసాధించే ప్రణాళికా సిద్ధం చేస్తున్నారని చెప్తున్నారు.

Tags:    

Similar News