బిల్డప్‌ బాబు.. అంతా డాబు

Update: 2018-11-22 16:23 GMT
ఈ మధ్య కాలంలో జబర్దస్త్‌ కామెడీ షోలో సుడిగాలి సుధీర్‌ స్కిట్‌ ఒకటి బాగా పాపులర్‌ అయ్యింది. అందులో గెటప్‌ శ్రీను వేసిన బిల్డప్‌ బాబాయ్‌ క్యారెక్టర్‌ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ప్రస్తుతం ఏపీ చంద్రబాబు పరిస్థితి చూసిన ప్రజలు ఇలాగే నవ్వుకుంటున్నారు. ఆ స్కిట్‌ లో డైరెక్టుగా పెరుగిచ్చే గేదె తీసుకొస్తానని - ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ తన బంధువని ఇలా అనేక బిల్డప్‌ లు ఇస్తుంటాడు బిల్డప్‌ బాబాయ్‌. చంద్రబాబు నాయుడు కూడా కొద్ది రోజులుగా హైదరాబాద్‌ ను తానే నిర్మించానని - మోదీని తానే ప్రధానిని చేశానని - అలెగ్జాండర్‌ ను దేశానికి ప్రధాని చేశానని ఇలా అనేక రకాలుగా బిల్డప్‌ లు ఇస్తున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పే మాటల్లో కాస్తయినా విశ్వసనీయత ఉండాలి.. కానీ ప్రజల కళ్ల ముందు కనిపించే వాస్తవాలను సైతం వక్రీకరించి తానే ఇవన్నీ చేసుకుంటున్నానని చెప్పుకోవడంతో అటు నవ్వుకోవాలో.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితిని చూసి ఏడవాలో తెలియక ప్రజలు అయోమయంలో పడుతున్నారు.
                        
తెలుగుదేశం పార్టీ నాయకులు - కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తనను ప్రధాన మంత్రిగా ఎక్కడా చెప్పొద్దంటూ సెలవిచ్చారు. దీనిని బట్టి బాబు తనకు తానే ప్రధాన మంత్రి స్థాయిలో ఊహించుకుని బిల్డప్‌ ఇచేస్తున్నారని పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ తీసికట్టుగా మారుతోంది. ఒక వైపు చింతమనేని ప్రభాకర్‌ వంటి దుందుడుకు నేతల చర్యలు - మరో వైపు రాజధానిలో ఇసుక - భూమాఫియా వంటి అనేక అక్రమాలు - అవినీతి కార్యకలాపాలు - ఇంకో వైపు అగ్రిగోల్డ్‌ బాధితుల ఆకలి కేకలు.. అధికార పార్టీని గుక్క తిప్పుకోనివ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌ లో పార్టీ - ప్రజల సమస్యలను గాడిలో పెట్టాల్సిన బాబు.. దేశ రాజకీయాలంటూ రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. దీని వెనుక కేసుల భయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం తీరని నష్టం వాటిల్లుతుందని తెలుగుదేశం పార్టీ నేతలే బాహాటంగా అంటున్నారు.
               
బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల నాయకులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చిన బాబు.. ఇక దేశ స్థాయిలో తానే చక్రం తిప్పుతున్నట్లు బిల్డప్‌ ఇచ్చేసుకుంటున్నారని, ఇది ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకోవడమేని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే పార్టీ నేతల్లో ధైర్యం - ఆత్మవిశ్వాసం నింపేందుకు తనను తాను ప్రధాన మంత్రి అభ్యర్థిగా చెప్పుకుంటున్నారని ఆ పార్టీలోని కొందరు బాబు భజన పరులు చెబుతున్నా.. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌ లో తీవ్ర నష్టం చేకూర్చుతుందని మేధావులు అంటున్నారు.
               
ఒక వైపు రాష్ట్రంలో సాగులో ఉన్న పంటలకు నీళ్లు లేక - ఊళ్లలో పనుల్లేక రైతాంగం అల్లాడుతున్న దుర్భిక్ష పరిస్థితులు చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రతిపక్షాల నాయకులు నిలదీస్తుంటే.. సమాధానం చెప్పుకోలేక ఆ పార్టీ నేతలు నీళ్లు నములుతున్నారు. అదే సమయంలో ఆగర్భ శత్రువు లైన కాంగ్రెస్‌ పార్టీతో ఎన్నికల వరకు అడుగులు వేయలేక, బాబుకు ఎదురు చెప్పుకోలేక టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇవన్నీ పట్టించుకోని బాబు దేశం కోసం కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణిస్తున్నానని - దేశ రాజకీయాలను తానే శాసిస్తున్నానని చెబుతుండడం.. ఆ పార్టీ నేతలకే మింగుడు పడడం లేదు. తాజాగా తాను ప్రధాన మంత్రి అని ఎక్కడా చెప్పొద్దనడంతో తమ నేత చర్యలకు వారు అవాక్కవుతున్నారు. మరో వైపు ఇవన్నీ సునిశితంగా గమనిస్తున్న ప్రజలు.. రాష్ట్రం గురించి పట్టించుకోని చంద్రబాబును ఎన్నికల్లో తాము పట్టించుకోవాల్సిన పని లేదని భావిస్తున్నారు. గురువింద సామెతగా కష్టాల కొలిమిలో కన్నీరుగా మారుతున్న ప్రజల వేదనలు - రోదనలు చెవికెక్కని బాబు.. దేశాన్ని బాగు చేస్తాననడం హాస్యాస్పదమేనని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా నేల విడిచి సాము చేస్తే రానున్న ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఇస్తారని జోస్యం చెబుతున్నారు.
Tags:    

Similar News