బాబు మాట ఇదేనా?: పొత్తు అనివార్యం బ్రదర్

Update: 2018-07-16 04:13 GMT
ఎలాంటి తెలుగుదేశం ఎలా త‌యారైంద‌న్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు. రెండు క‌ళ్ల సిద్ధాంతాన్ని అదే ప‌నిగా వ‌ల్లె వేసి.. తెలంగాణ‌లో పార్టీని కాపాడుకోవ‌టానికి వీలుగా విభ‌జ‌న‌కు ఓకే చెప్పిన బాబు భారీ మూల్యాన్ని చెల్లించార‌నే చెప్పాలి. ఏ పార్టీని అయితే కాపాడుకునేందుకు రెండు క‌ళ్లు.. కొబ్బ‌రి చిప్ప‌ల సిద్ధాంతాన్ని వ‌ల్లె వేశారో.. అదేదీ తెలంగాణలో పార్టీ ఉనికిని కాపాడ‌లేక‌పోయింద‌ని మ‌ర్చిపోకూడ‌దు.

ఒక‌ళ్ల త‌ర్వాత మ‌రొక‌రు చొప్పున పార్టీకి హ్యాండిచ్చి వెళ్లిపోయిన నేప‌థ్యంలో నామ‌మాత్రం నేత‌ల‌తో బండిని లాగిస్తున్నారు చంద్ర‌బాబు. తెలంగాణ‌లో పార్టీని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఆయ‌న కిందామీదా ప‌డుతున్న‌ట్లు చెబుతున్నారు. అలా ఉండాలి.. ఇలా ఉండాలంటూ మాట‌లు చెప్ప‌ట‌మే కాదు.. అలా.. ఇలా ఉండ‌టానికి ఎలా ఉండాలి? అన్న విష‌యంపై బాబు ఏ మాత్రం క్లారిటీ ఇవ్వ‌టం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఇటీవ‌ల తెలంగాణ నేత‌ల‌తో జ‌రిపిన టెలీ కాన్ఫ‌రెన్స్ లో మాట్లాడిన బాబు.. తెలంగాణ‌లో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో పొత్తులు అనివార్య‌మ‌ని బాబు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌రింత ఇబ్బందిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఎవరితో పొత్తు ఉంటుంద‌న్న విష‌యాన్ని రివీల్ చేయ‌ని ఆయ‌న‌.. ఎవ‌రైనా త‌మ‌తో పొత్తు పెట్టుకునే స్థాయికి ఎద‌గాలంటూ త‌మ్ముళ్ల‌కు చెప్పిన వైనం చూస్తే.. తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తెలంగాణ‌లో పార్టీకి నేత‌లు లేకున్నా.. బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంద‌న్న విష‌యాన్ని బాబు మ‌ర్చిపోతున్నార‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉన్న‌ప్ప‌టికీ.. వారిని ఉత్తేజ‌ప‌రిచే నాయ‌క‌త్వం లేద‌న్న లోపాన్ని ప‌లువురు త‌మ్ముళ్లు ఎత్తి చూపిస్తున్నారు. తెలంగాణ‌లో పార్టీ ఎద‌గాలంటూ ప‌దే ప‌దే చెప్పే బాబు.. ఎలాంటి ప్ర‌య‌త్నాల‌తో ఆ ప‌రిస్థితికి చేరుకోవాల‌న్న విష‌యాన్ని మాత్రం చెప్ప‌టం లేదంటున్నారు. పార్టీని ఎవ‌రో వ‌చ్చి కాపాడుతార‌నే ఆలోచ‌న పెట్టుకోవ‌ద్దంటూ చెబుతున్న‌బాబు.. సొంతంగా త‌మ కార్యాచ‌ర‌ణ‌ను తామే సిద్ధం చేసుకోవాల‌ని తెలంగాణ నాయ‌క‌త్వానికి ఆయ‌న చెబుతున్నారు.

క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో స‌మ‌ర్థ‌వంత‌మైన స్ఫూర్తిని అందించాల్సిన అధినేత స్థానంలో ఉన్న బాబు.. అస‌లు విష‌యం చెప్ప‌కుండా ఉండ‌టంతో తెలంగాణ తెలుగు త‌మ్ముళ్ల‌కు ఏం చేయాలో పాలు పోని ప‌రిస్థితి. ఒక‌ప్పుడు అధికారం కోసం కోట్లాడే పార్టీల్లో ప్ర‌ముఖంగా ఉన్న టీడీపీ.. ఈ రోజు మ‌రేదైనా పార్టీ పొత్తు కోసం త‌మ‌ను సంప్ర‌దించే స్థాయికి ఎద‌గాల‌న్న ప‌రిస్థితుల్లోకి చేర‌టం చూస్తే.. తెలంగాణ‌లో బాబు పార్టీ ఎలా ఉంద‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News