అందరూ వదిలేసింది బాబు చేసి చూపించారు

Update: 2015-09-20 10:04 GMT
 ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనగానే అంతా ఒట్టిదే అనుకున్నారు... కృష్ణా - గోదావరిల అనుసంధానం అంటే అంతా నవ్వుకున్నారు. వాజపేయి వల్లే కాలేదు చంద్రబాబుతో ఎక్కడవుతుందని అనుకున్నారు. అంతేకాదు... పెట్టెలో రూపాయి లేని రాష్ట్రంలో పట్టిసీమ పూర్తవడం కలే అన్నారు. పోలవరం ఆలస్యమవుతుంది కాబట్టి అందాక ఏదో మాయ చేయడానికి దీన్ని తెరపైకి తెచ్చారని విమర్శలు చేశారు. కానీ... శంకుస్థాపన చేసిన 5 నెలల 21 రోజుల్లోనే పట్టిసీమ మొదటి పంపు నుంచి నీరొచ్చింది. నదుల అనుసంధానం అన్నది నిజమైంది. కాలువలకు గండిపడడం.... అనుకున్న సమయానికి పనులు పూర్తికాకపోవడం వంటి బాలారిష్టాలు వెంటాడుతుండొచ్చు కానీ చంద్రబాబు సంకల్పం.... రెండు వేర్వేరు నదులను ఎంతోకొంత స్థాయిలో కలిపే ప్రయత్నం చేయడం మాత్రం దేశంలో నదుల అనుసంధానంపై అనుమానాలున్న అందరికీ సమాధానంగా నిలిచింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండి... నిధులు పుష్కలంగా ఉంటే దేశవ్యాప్తంగా ఇది చేపట్టొచ్చు. అయితే... కావాల్సిందంతా చిత్తశుద్ధి... పక్కా ప్రణాళిక... మధ్యలో వదిలేయకుండా పూర్తయ్యేవరకు పట్టువీడని తత్వం.

పట్టిసీమతో దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం అనే మాట మరోసారి తెరపైకొచ్చింది. వాజ్‌ పేయి ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా నదుల అనుసంధానానికి ఓ ప్రణాళిక సిద్ధం చేశారు. అది ఆచరణకు నోచుకోలేదు. లాభనష్టాల పట్టిక ఆధారంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ ను ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం అనుసంధాన ప్రక్రియను వ్యతిరేకించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం దీనికి ప్రాధాన్యమిచ్చింది. ఓ వైపు పోలవరం ప్రాజెక్ట్‌ కాలువ పనులు పూర్తవుతున్న దశలోనే కుడికాలువకు సమాంతరంగా పట్టిసీమ వద్ద గోదావరిపై ఎత్తిపోతల పథక నిర్మాణాన్ని చేపట్టింది. గోదావరి నుంచి జలాల్ని ఎత్తిపోసి పైప్‌ ల ద్వారా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో విలీనం చేయడం ద్వారా దేశంలోనే మొట్టమొదటి నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

అయితే... దీనిపై విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి అంతా బూటకమంటున్నాయి. కానీ... బాలారిష్టాల వల్ల అలా అనిపిస్తోందని చెబుతూ నీటి పారుదల నిపుణులు చంద్రబాబుకు మద్దతుగా ఉంటున్నారు. చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రణాళిక చెప్పినట్లు ఇది సాధ్యం కాదని చెప్పిన అత్యంత అనుభవశీలి అయిన ఓ ఇంజినీరు... ఇప్పుడు పట్టిసీమ పూర్తయిన తరువాత ఆశ్చర్యపోయారట.

మరోవైపు పట్టిసీమకు ఆదిలోనే ఆటంకాలు ఎదరయ్యాయి. నిర్ణయించిన ముహూర్తానికి పనులు పూర్తికాలేదు. అంతకుముందు ఏర్పాటు చేసిన మోటార్లు, స్విచ్‌ బోర్డులు వరద నీటిలో మునిగిపోయాయి. పనులు పూర్తికాక పోవడంతో చంద్రబాబు పర్యటనా వాయిదావేసుకోవాల్సి వచ్చింది. తొలుత ఉదయం 9.30 గంటలకు స్విచ్‌ వేసేందుకొస్తానన్న చంద్రబాబు మధ్యాహ్నం 3.45గంటలకు గాని అక్కడికి రాలేని పరిస్థితి ఏర్పడింది. వచ్చినా హడావిడిగా పనులు ముగించి తిరుగు ప్రయాణం కట్టాల్సి వచ్చింది. ఈ దశలో అసలీ అనుసంధాన ప్రక్రియ సాధ్యాసా ధ్యాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. అన్ని రాష్ట్రాలూ ఇప్పుడు నదుల అనుసంధానంపై కన్నేశాయి.

ఒక నదిలో అధికంగా ఉన్న వరద నీటిని కాలువల ద్వారా మరో నదికి మళ్ళించి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సమస్థాయిలో నీటిని సాగు, తాగు అవసరాలకు అందించా లన్నది ఈ బృహత్‌ప్రణాళిక లక్ష్యం. గోదావరి నుంచి ఏటా వృధాగా సముద్రంలోకి తరలిపోతున్న నీటిని ఇబ్రహీం పట్నం వద్ద కృష్ణానదికి మళ్ళించి గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల మీదుగా రాయలసీమకు తరలించాలన్నది పట్టిసీమ ఎత్తిపోతల పథక లక్ష్యం.

ఎన్‌డీఏ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా 37నదుల అనుసంధానికి ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. 30అను బంధ కాలువలు, 3వేల రిజర్వాయర్లు నిర్మించాలని తలపోసింది. హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి దక్షిణ భారత్‌ వరకు వీటి ఏర్పాటుకు పథకాలు కూడా సిద్ధం చేసింది. ఇందుకోసం ప్రాథమికంగా రూ.5.60లక్షల కోట్లు వ్యయమవుతాయని అంచనాలేసింది. 2014-15బడ్జెట్‌ లో ఇందుకు రూ.100కోట్లే కేటాయించింది. దక్షిణ భారతంలోని గోదావరి - కృష్ణా - పెన్నా - కావేరిలను అనుసంధానించేం దుకు 16 కాలువల తవ్వకాన్ని ఇందులో ప్రతిపాదించింది. అయితే ఇదేదీ కార్యరూపం దాల్చలేదు.  దీనిపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకతలు వచ్చాయి. నదుల్లోని వరదనీటి ప్రవాహాన్ని సక్రమంగా అధ్యయనం చేయకుండా లక్షల కోట్ల విలువైన ఆర్థిక భారాన్ని దేశంపై మోపడం సరికాదని చాలామంది అభిప్రాయపడ్డారు. పట్టిసీమ సంగతి తెలుసకున్న తరువాత దేశవ్యాప్తంగా నదుల అనుసంధానంపై మళ్లీ ఆసక్తి పెరుగుతోంది. అన్ని నదుల విషయంలోనూ ఇది సాధ్యం కాకపోయినా.. కొన్ని చోట్లయినా సుసాధ్యం చేయొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు ఈ విషయంలో దేశం ఆలోచనను మార్చినట్లే ఉన్నారు.

- - గరుడ

Tags:    

Similar News