ఏపీ బ్యాంకుల్లో ఉన్న కొత్త నోట్ల లెక్క ఇదే..

Update: 2016-11-29 04:28 GMT
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోడీ పుణ్యమా అని ఏపీలో నోట్ల కొరత దారుణంగా ఉంది. ప్రజలు తమ దగ్గర ఉన్న పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నా..కొత్త నోట్లు మాత్రం బయటకు రాని పరిస్థితి. దీంతో.. కొత్త నోట్లు.. చిల్లర నోట్లకు తీవ్రమైన కొరతను ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు సమర్థత పైనా.. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో బ్యాంకర్లతో ఏపీ ముఖ్యమంత్రి ఒక సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో నెలకొన్న నోట్ల కొరతపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాల్ని తీర్చే విషయంలో బ్యాంకుల నిర్లక్ష్యాన్ని తప్పుపట్టిన ఆయన.. నోట్ల రద్దు నిర్ణయం తీసుకొని 20 రోజులు అయ్యాక కూడా ప్రజలకు నోట్ల సరఫరా సరిగా జరగకపోవటాన్ని ఆయన ప్రశ్నించారు.

బ్యాంకర్ల అసమర్థత కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని.. బ్యాంకు అధికారులు కొందరు ఉదాసీనతతో వ్యవహరిస్తున్నారని.. అలాంటి వారిని వదిలిపెట్టేది లేదని ఆయన మండిపడ్డారు. 20 రోజులు అయ్యాక కూడా బ్యాంకర్లసెంట్రల్ సర్వర్ నుంచి కచ్ఛితమైన సమాచారాన్ని రాకపోవటం ఏమిటని తీవ్రంగా ప్రశ్నించిన ఆయన.. కీలక సమయంలో బ్యాంకుల్ని సమన్వయం చేయాల్సిన ఆర్ బీఐ ఆ పని చేయటం లేదని ఫైర్ అవుతున్నారు.

అత్యవసర సమావేశాలకు లీడ్ బ్యాంకర్లే సక్రమంగా రావటం లేదన్న చంద్రబాబు.. సమావేశానికి వస్తున్న అధికారుల వద్దా సరైన సమాచారం ఉండటం లేదని తప్పు పట్టారు. సమాచారం లేకుండా సమావేశాలకు రావటం ఏమిటని ప్రశ్నించిన చంద్రబాబు..రూ400 కోట్ల చిన్ననోట్లు అవసరాన్ని ఆర్ బీఐకు తెలియజేస్తూ లేఖ రాయాలని.. ఆ మేరకు కరెన్సీని తెప్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఏపీ బ్యాంకర్ల వద్దఉన్న కొత్త.. చిల్లర కరెన్సీకి సంబంధించిన వివరాల్ని చంద్రబాబుకు వివరించారు. సోమవారం నాటికి ఏపీలోని బ్యాంకర్ల వద్ద ఉన్న కరెన్సీ లెక్కల్ని చూస్తే.. రూ.95 కోట్ల విలువైన 500 రూపాయిల నోట్లు.. రూ.62 కోట్లు విలువైన వంద రూపాయిల నోట్లు.. రూ.1320 కోట్ల విలువైన 2వేల రూపాయిల నోట్లు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్నఅవసరాల నేపథ్యంలో రూ.400 కోట్ల చిల్లర నోట్లతో పాటు.. మరో వెయ్యి కోట్ల కరెన్సీని తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. మరి.. బాబు మాటలు బ్యాంకర్ల మీద ఎంత ప్రభావం చూపిస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News