ఈ వన్ మ్యాన్ షో కక్కుర్తి ఏంటి బాబు..?

Update: 2015-07-20 05:38 GMT
నాయకుడు అన్న వాడు నడిపిస్తాడు. తన బాటలో మిగిలిన వారిని నడిచేలా చేస్తాడు. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు కాస్త భిన్నం. అధినాయకుడిగా.. అందరికి ఆదర్శంగా ఉండాల్సిన ఆయన ప్రచార కాంక్షతో వ్యవహరిస్తుంటారు. తాను మాత్రమే కనిపించేలా.. మరెవరికీ ప్రాధాన్యత దక్కకుండా ఉండేలా వ్యవహరించటంలో దిట్ట.

కోట్లాది మంది ప్రజలు మమేకం అయ్యే గోదావరి పుష్కరాల్లో ఆయన మాత్రమే కనిపిస్తారు. ఏపీ సర్కారు తరఫున పెద్ద ఎత్తున మంత్రులు.. నాయకులు.. అదికారులు ఉన్నప్పటికీ.. అన్నింటి బాబు మాత్రమే కనిపిస్తారు. అన్నీ తానే చేయాలని తపిస్తారు. ఒక ముఖ్యమంత్రిగా తన కింద మంత్రులంతా పని చేసేలా.. పేరు ప్రఖ్యాతులు అందరికి దక్కేలా తన వారిని ప్రోత్సహించటంలో బాబుకు పెద్దగా ఇష్టం ఉన్నట్లు కనిపించదు.

ఏ పనిని అయినా సరే.. తాను మాత్రమే చేయగలనని అనుకోవటం.. మిగిలిన వారికి బాధ్యతలు అప్పగించకపోవటం.. ఎవరైనా బాధ్యతగా పని చేసే ప్రయత్నం చేస్తే.. అధినేత అగ్రహానికి గురి కావటం లాంటి వాటితో ఎవరికి వారు తమకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారే తప్పించి.. దేన్లో భాగస్వామ్యం కారు. గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు.. దాదాపు 13 నెలల ముందు ప్రారంభమయ్యాయి. కోట్లాది మంది ప్రజలు సందర్శించే వీలున్న పుష్కరాలకు సంబంధించి నిర్మాణాత్మకంగా సమీక్షలు తరచూ జరిగాయా? అంటే లేదని చెప్పాలి.

పుష్కరాలు ముంచుకొచ్చిన తర్వాత మాత్రమే బాబు ఫోకస్ పనుల మీద పడ్డాయి. అంతంతమాత్రంగానే జరిగిన పనుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి.. అధికారుల మీద అసహనంతో అగ్రహం వ్యక్తం చేయటం లాంటివన్నీ చేసినట్లు కనిపిస్తాయి. పుష్కరాలు ముంగిట్లోకి వచ్చిన తర్వాత పనులు ఎలా జరిగాయన్న దాన్ని పరిశీలించేందుకు కళ్లు తెరిచే బదులు.. ముందు నుంచే వాటిపై దృష్టి పెడితే పనులు మరింత బాగా జరిగేవి.

పనుల విషయాన్ని పక్కన పెడితే.. బాబు మంత్రివర్గంలోని నారాయణ.. పీతల సుజాత ఇద్దరు తప్పించి.. గోదావరి పుష్కరాల్లో ఎవరూ పెద్దగా కనిపించరు. ఎక్కడ చూసినా చంద్రబాబు మాత్రమే కనిపిస్తారు. అది టెంట్లు సరిగా లేవన్న ఫిర్యాదు దగ్గర నుంచి.. బాబుగారు మీ కాన్వాయ్ సైజు తగ్గించుకోండన్న వినతులు వరకూ అన్నీ అందరి చేతా చెప్పించుకుంటారు.

ప్రతి పనిని తానే చేయాలని.. ప్రతి క్రెడిట్ తనకే దక్కాలన్న కక్కుర్తి చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తుంది. గోదావరి పుష్కరాలు ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణ.. మహారాష్ట్ర.. రాష్ట్రాల్లో కూడా సాగుతున్నాయి. కానీ.. మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి హడావుడి ఏపీలో మాత్రమే కనిపిస్తుంది. సరే.. ఇంత హడావుడి చేస్తున్నారు.. ఏర్పాట్లు ఏమైనా ఘనంగా సాగాయా? అంటే.. మొదటి రోజే 27 మందిని బలి తీసుకున్న ఘటన జరగనే జరిగిపోయింది. జరిగిన దాని గురించి మరింత ఫీలై.. ఆ తప్పును కవర్ చేసుకోవటానికి అన్నట్లుగా.. పగలు రాత్రి అన్న  తేడా లేకుండా.. పని చేస్తున్నట్లుగా కనిపిస్తున్న చంద్రబాబు కారణంగా ఏమైనా ప్రయోజనం కలిగిందా? అంటే..శూన్యమనే చెప్పాలి.

మరోవైపు తెలంగాణలో చూస్తే.. ఐదు జిల్లాల్లో గోదావరి పుష్కరాలు నిర్వహించటం.. ప్రతి జిల్లాలోనూ మంత్రులు రోడ్ల మీదకు వచ్చి పని చేయటం కనిపిస్తుంది. తెలంగాణ గోదావరి పుష్కర పనుల్లో ముఖ్యమంత్రి.. మంత్రులు కనిపిస్తే.. ఏపీ పుష్కరాల్లో మాత్రం ముఖ్యమంత్రి ఒక్కరే కనిపిస్తారు.

చుట్టూ మంది మార్బలాన్ని వేసుకొని.. హడావుడిగా తిరగటం.. ఆదేశాలు జారీ చేయటం తప్పించి.. పనులు జరుగుతున్నాయా? లేదా? అని క్రమపద్ధతిలో క్రాస్ చెక్ చేసే వారు కనిపించని దుస్థితి. ఎందుకంటే.. బాబు మాదిరే.. అందరూ ఆదేశాలు జారీ చేసేవారే తప్పించి.. పనులు చేసే వారు పెద్దగా కనిపించరు. పని చేసినా ప్రయోజనం ఎంతన్నది అందరికి తెలుసు కాబట్టి.. చాలామంది ఆసక్తి ప్రదర్శించరు కూడా. ప్రచార కాంక్షతో పాటు.. తాను మాత్రమే హైలెట్ కావాలన్న బాబు వన్ మ్యాన్ షో కక్కుర్తే గోదావరి పుష్కరాల్లో కనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఉండాల్సిన విశాల దృక్ఫదం బాబులో ఎంతమాత్రం కనిపించదు. ముందుండి నడిపించాల్సిన నాయకుడు.. సేవకుడి మాదిరి పని చేయటం కనిపిస్తుంది.

నాయకుడు సేవకుడిలా పని చేయటం మంచిదే. కానీ.. తను ఒక్కడు మాత్రమే కనిపించాలన్న కక్కుర్తితో.. ఎంతో మంది ఉన్నప్పటికీ..ఎవరూ లేని వాడిలా ఒక్కడిలా పని చేస్తూ.. ఫలితం కనిపించక తిట్లు తినటం మాత్రం చంద్రబాబుకే సాధ్యం.
Tags:    

Similar News