బాబు కొత్తింటి గృహ‌ప్ర‌వేశం అంత సీక్రెట్టా?

Update: 2017-04-10 04:40 GMT
అత్యంత అధునాత‌నంగా.. విలాస‌వంతంగా.. భారీగా.. హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ లో నిర్మించిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కొత్తింటి గృహ ప్ర‌వేశ కార్య‌క్ర‌మం ఆదివారం పూర్తి అయ్యింది. భారీగా మొహ‌రించిన పోలీసు బ‌ల‌గాలు.. నిఘా వ‌ర్గాల న‌డుమ గృహ‌ప్ర‌వేవ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేశారు. అంతేనా.. బాబు ఇంటికి వెళ్లే ర‌హ‌దారుల‌న్నీ ఏపీ పోలీసుల అధీనంలోకి వెళ్లిపోవ‌ట‌మే కాదు.. దాదాపు 26 వ‌ర‌కూ సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి.. వాటిని బాబు ఇంటితో అనుసంధానం చేశారు.

జూబ్లిహిల్స్‌ రోడ్ నెంబ‌రు 65లోని రెండు ప్లాట్ ల‌లో (1309, 1310) 2479 చ‌ద‌ర‌పు గ‌జాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ విలాస‌వంత‌మైన రాజమ‌హాల్ ను అత్యంత ఆధునాత‌నంగా నిర్మించిన‌ట్లుగా తెలుస్తోంది. దీని ఖ‌ర్చు ఎంతన్న విష‌యం బాబు అండ్ కో పెద‌వి విప్ప‌టం లేదు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం వంద కోట్ల‌కు పైగా ఈ ఇంటి కోసం ఖ‌ర్చు అయిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం.. అంత‌కుమించే ఖ‌ర్చు అయ్యింద‌న్న మాట‌ను వినిపిస్తున్నారు.

అతి ముఖ్య‌మైన కుటుంబ స‌భ్యులు.. కొద్దిమంది మిత్రుల న‌డుమ గృహప్ర‌వేశ కార్య‌క్ర‌మాన్నిఘ‌నంగా నిర్వ‌హించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ఇంట్లో విశాల‌మైన కాన్ఫ‌రెన్స్ హాళ్లు.. లైబ్ర‌ర‌రీ.. వీఐపీ లాంజ్ లు.. డైనింగ్ రూమ్ ల‌తో పాటు.. టెర్ర‌స్ పై అరుదైన విదేశీ జాతి మొక్క‌ల‌తో రూపొందించిన ప‌చ్చిక బ‌య‌లు ఆక‌ర్ష‌నీయంగా ఉంద‌న్న మాట వినిపిస్తోంది.బాబు కొత్తింటి గృహ‌ప్ర‌వేశానికి ఆయ‌న కుటుంబం.. ఆయ‌న వియ్యంకుడు క‌మ్ ప్ర‌ముఖ సినీన‌టుడు బాల‌కృష్ణ‌.. మ‌రో ముఖ్య‌మైన మూడు కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే ఈ వేడుక‌కు హాజ‌రైన‌ట్లుగా తెలుస్తోంది.

వాస్తుపూజ‌.. యజ్ఞం.. స‌త్య‌నారాయ‌ణ స్వామి వ‌త్రం లాంటి కార్య‌క్ర‌మాల్ని చంద్ర‌బాబు స్వ‌యంగాపూర్తి చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఆదివారం ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నాం వ‌ర‌కూ జ‌రిగిన పూజ‌ల్లో చంద్రబాబు పాల్గొన్న‌ట్లు చెబుతున్నారు. అనంత‌రం టి సుబ్బిరామిరెడ్డికి చెందిన పార్క్ హ‌య‌త్ హోట‌ల్ కు వెళ్లారు. అక్క‌డ టీవీ9 సీఈవో ర‌విప్ర‌కాశ్ తో గంట‌కు పైగా చ‌ర్చ‌లు జ‌రిపిన చంద్ర‌బాబు.. రాత్రి వేళ‌కు కొత్తింటికి వ‌చ్చి అక్క‌డ నిద్ర చేశారు.

గృహ‌ప్ర‌వేశం కార్య‌క్రమాన్నిక‌వ‌ర్ చేసేందుకు మీడియా పెద్ద ఎత్తున చేరుకున్నా.. పోలీసులు మాత్రం ఎవ‌రినీ అనుమ‌తించ‌లేదు. కొత్తింటి ఫోటోల్ని సెల్ ఫోన్ల‌లో తీసుకున్న వారివి కూడా డిలీట్ చేస్తూ అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించార‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది.

 ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విశేషం ఏమిటంటే.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఏ రాజ‌కీయ నేత కూడా బాబు కొత్తింటి వైపు క‌న్నెత్తి కూడా చూడ‌క‌పోవ‌టం. పిల‌వ‌క‌పోతే.. ఎవ‌రు ఎందుకు వెళ‌తారు? అయినా.. శుభ‌మా అని కొత్తిల్లు క‌ట్టించుకొని న‌లుగురికి అన్నం పెట్టి చేయి క‌డిగించాల్సింది పోయి.. అంత గుట్టుగా.. పోలీసుల ప‌హ‌రా న‌డుమ గృహ‌ప్ర‌వేశాన్ని పూర్తి చేయ‌టం ఏమిటో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News