బాబుకు అసలు మ్యాటర్ అర్ధమైందా... ?

Update: 2022-02-17 12:30 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు అపర చాణక్యుడు. ఆయనకు వ్యూహాలు అన్నీ తెలుసు. సంక్షోభాల నుంచి సవాళ్ళ నుంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం ఎలాగో తెలుసు. అలాంటి చంద్రబాబు గత మూడేళ్ళుగా విపక్షంలో ఉన్నారు. ఇదివరకు మారిదిగా పసుపు రధాన్ని జోరుగా నడిపించాలనుకున్నా కుదరడంలేదు. వారంలో అయిదు రోజుల పాటు ఏపీలోని మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఉంటూ క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తున్నా అనుకున్న ఫలితాలు మాత్రం రావడంలేదుట.

అందుకే బాబు ఇక మాటలతో కాదు అంటున్నారు. తాను ఇదివరకు బాబును కాను అని తమ్ముళ్ళకే  పదే పదే చెబుతున్నారు. పదవులు ఇచ్చినా పనిచేయని వారిని ఇక‌ఉపేక్షించే ప్రసక్తే లేదని కూడా ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. తెలుగుదేశానికి ఎన్నో అనుబంధ విభాగాలు ఉన్నాయి. అవన్నీ కూడా గతంలో ఫుల్ యాక్టివ్ గా ఉండేవి. తెలుగు యువత పోస్టు ఒకనాడు ఘనంగా వెలిగేది. దాన్ని చేపట్టిన వారిలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీయార్ తనయుడు నందమూరి హరిక్రిష్ణ వంటి ప్రముఖులు ఉన్నారు.

ఇక తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవి అంటేనే గ్లామర్ చాలా ఉంది. జయప్రద, రోజా వంటి వారు దాన్ని చేపట్టారు. తెలుగు రైతు పదవిని ప్రముఖ నాయకులు, రూరల్ బేస్ నుంచి వచ్చిన వారు చేపట్టి గడగడలాడించేవారు. తెలుగు విద్యార్ధి వంటి విభానాలు అయితే యువతరాన్ని ఉత్తేజపరచేవి. మరి ఇపుడు చూస్తే ఈ పదవుల్లో ఉన్న వారు పెద్దగా వెలగలేకపోతున్నారు అన్న చర్చ అయితే ఉంది.

తెలుగు మహిళా అధ్యక్షురాలిగా వంగలపూడి అనిత కొంతవరకూ ఓకే కానీ చాలా విభాగాలు మాత్రం అసలు  ఉన్నాయా లేవా అన్నది ఎవరికీ తెలియడంలేదు. దాంతో పాటు నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమిస్తే వారు కూడా గట్టిగా పనిచేయడంలేదు. కొందరు అయితే మీడియా ముందుకు వచ్చి గట్టిగా సౌండ్ చేస్తూ ఆ మీదట తమ సొంత పనుల్లో మునిగితేలుతున్నారని బాబుకు పక్కా  ఇన్ఫర్మేషన్ ఉంది.

అందుకే ఆయన కచ్చితంగా చెప్పేశారు. పదవులు అన్నవి అలంకారం కాదని కూడా తేల్చేశారు. పార్టీ కోసం పనిచేసే వారి జాబితా తన వద్ద ఉందని, అలా కాకుండా  సైలెంట్ ఉన్న వారి విషయంలో కఠినంగా ఉంటాను అని వార్నింగులే ఇస్తున్నారు. మొత్తానికి చూస్తే తాను ఎంత పరుగులు తీసినా అసలైన క్యాడర్ వెనకబడితే లాభం లేదని బాబుకు  అర్ధమైంది అంటున్నారు.

ఇక సార్వత్రిక ఎన్నికలకు గట్టిగా రెండేళ్ళ వ్వవధి మాత్రమే ఉన్న వేళ ముందు పార్టీని పరుగులు పెట్టిస్తేనే తప్ప అనుకున్న లక్ష్యాలను చేరుకోలేమని బాబు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చిన వందలాది పోస్టులతో పాటు అనుబంధ సంస్థల నాయకులు అంతా చురుకుగా పనిచేస్తే టీడీపీ మళ్ళీ ధీటుగా నిలుస్తుంది అంటున్నారు. బాబు ప్రయత్నం కూడా అదే అని చెబుతున్నారు.
Tags:    

Similar News