పన్ను వేసేందుకూ బాబుకు భయమేనా?

Update: 2015-04-11 04:36 GMT
తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే ఆంధ్రా వాహనాలకు ఎంట్రీ టాక్స్‌ విధిస్తూ కేసీఆర్‌ సర్కారు నిర్ణయం తీసుకోవటం.. దీనిపై ఏపీ వాహనాదారులు తీవ్ర ఆందోళనకు గురి కావటం తెలిసిందే. ఈ నిర్ణయం కారణంగా సీమాంధ్ర ఆపరేట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పలువురు డిమాండ్‌ చేశారు.

తెలంగాణ సర్కారు ఎంట్రీటాక్స్‌ విధించినప్పటికీ.. ఏపీ మాత్రం తన రాష్ట్రంలోకి ప్రవేశించే తెలంగాణ వాహనాలపై పన్ను విధించే విషయంలో మాత్రం పాత పద్ధతినే అనుసరిస్తోంది. తాము అనుసరిస్తున్న విధానం కారణంగా తెలంగాణ సర్కారుపై ఒత్తిడి పెరుగుతుందని భావించింది. అయితే.. ఇప్పుడు సీన్‌ కాస్తా రివర్స్‌ అయ్యింది.

హైదరాబాద్‌ నగరం ఉమ్మడి రాజధానిగా ఉంటున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలపై ఎంట్రీటాక్స్‌ విధించటం చట్టవిరుద్ధమంటూ ఒక వాదన మొదలై.. విషయం కోర్టుకు వెళ్లింది. అయితే.. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ.. పన్ను వసూలు చేయొచ్చని కాకుంటే.. వాటిని ఒక మొత్తంగా డిపాజిట్‌ చేయాలని.. తుది తీర్పు వెలువడే వరకూ అందులోని పైసా కూడా ఖర్చు చేయకూదని ఆదేశాలు జారీ చేసింది.

పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు మాదిరే ఏపీ కూడా ఎంట్రీటాక్స్‌ విధించాలన్న డిమాండ్‌ తెలుగు దేశం ప్రభుత్వంలో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు పలువురు ఇదే విషయాన్ని లేవనెత్తుతున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి కూడా ఎంట్రీ టాక్స్‌ అంశాన్ని తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

పన్ను వేయటం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పన్ను వేసినందున తమపై ఎలాంటి విమర్శ రాదని.. ఇదంతా తెలంగాణ ప్రభుత్వ పుణ్యమేనని వాదించొచ్చన్న వాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర వినిపించినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఎంట్రీటాక్స్‌ విషయంలో బాబు ఆలోచనలు మరోలా ఉన్నాయంటున్నారు.

ఎంట్రీటాక్స్‌పై తుది నిర్ణయం ఇంకా వెలువడలేదని.. తొందరపడటం మంచిది కాదని.. ఆచితూచి నిర్ణయం తీసుకుంటే మంచిదని.. రెండు రోజులు ఆలస్యమైనా.. తప్పు చేసినట్లుగా కనిపించకుండా వ్యవహరించటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. రెండు కళ్ల సిద్ధాంతంలో భాగంగా.. రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా లబ్థి పొందాలన్న దూరదృష్టితో బాబు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు. బాబు రెండు కళ్ల సిద్ధాంతమేమో కానీ.  చివరకు పన్ను విధించే విషయంలో బాబు ఆచితూచి వ్యవహరించటం లేదని.. భయపడుతున్నారన్న విమర్శ కూడా వినిపిస్తోంది.



Tags:    

Similar News