ఆయన కోసం ఈయనకు తాయిలం

Update: 2015-10-28 07:34 GMT
విపక్ష వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాలోనే ఆ పార్టీని దెబ్బకొట్టడానికి వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఇందుకోసం ఎలాంటి ఆటంకం ఎదురుకాకుండా ఏర్పాట్లు చేసుకుంటోంది. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే... ఇంతవరకు అక్కడ తనకు ప్రత్యర్థిగా ఉన్న ఆదినారాయణ రెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అడ్డం పడుతున్నారు. కానీ, ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి తీసుకోవడం రాజకీయంగా లాభిస్తుందన్న ఉద్దేశంతో ఎలాగైనా ఆయన్ను తీసుకోవాలని భావిస్తూ రామసుబ్బారెడ్డిని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఇంతవరకు ఫలించలేదు. తాజాగా చంద్రబాబు ఆయనకు మంచి పదవి ఇచ్చేందుకు ఓకే చెప్పారని... దాంతో రామసుబ్బారెడ్డి మెత్తబడ్డారని తెలుస్తోంది.

రామసుబ్బారెడ్డిని ఏపీ ఆర్టీసీ ఛైర్మన్ ను చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో రామసుబ్బారెడ్డి మెత్తబడ్డారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జమ్మల మడుగులో ఆదినారాయణరెడ్డి - రామసుబ్బారెడ్డిలు ప్రధాన ప్రత్యర్థులు. 1994, 1999లో రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచిన రామసుబ్బారెడ్డి ఆ తరువాత వరుసగా 2004 - 2009 - 2014 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి చేతిలో ఓడిపోయారు. 2009 వరకు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆదినారాయణరెడ్డి 2014లో వైసీపీ తరఫున గెలిచారు. అయితే, ఆ తరువాత ఆయన జగన్ తో విభేదిస్తూ టీడీపీ వైపు చూస్తున్నారు. ఆయనకు టీడీపీ ఓకే చెప్పిన స్థానిక అభ్యర్థి, అక్కడి టీడీపీ ఇంఛార్జిగా ఉన్న రామసుబ్బారెడ్డి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. మరోవైపు జగన్ కూడా మైసూరా రెడ్డి ద్వారా ఆదినారాయణను బుజ్జగించేందుకు ప్రయత్నించారు.అయితే... ఆ ప్రయత్నాలుసఫలం కాలేదు.  తాజాగా రామసుబ్బారెడ్డిని ఒప్పించి ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడానికి టీడీపీలో రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అసలు ఆర్టీసీ ఛైర్మన్ రేసులో కానీ, ఇంకే పదవికి కానీ పరిశీలనలో లేని రామసుబ్బారెడ్డి కి అనూహ్యంగా పదవి దక్కబోతోంది. మొత్తానికి తన రాజకీయ ప్రత్యర్థి కారణంగా పదవి దక్కుతున్నట్లయింది.


Tags:    

Similar News