చంద్రబాబు.. రెండు నాల్కల ధోరణి!

Update: 2017-11-09 23:30 GMT
‘‘ఈసారి ప్రభుత్వానికి ప్రతిపక్షం కూడా మనమే. ప్రతిపక్ష పాత్రను కూడా మనం పోషించాల్సిందే. ప్రజా సమస్యలను ప్రస్తావించే బాధ్యత తీసుకోకుండా.. ప్రతిపక్షం పారిపోయింది.. కాబట్టి ప్రజల సమస్యలను మనమే సభలో ప్రస్తావించాలి...’’ ఇవీ నిన్నటిదాకా చంద్రబాబునాయుడు అసెంబ్లీ నిర్వహణ గురించి తన పార్టీ ఎమ్మెల్యేలతో చెబుతూ వచ్చిన మాటలు. అచ్చంగా ఈసారి తాము కూడా సభలో సమస్యలు లేవనెత్తవచ్చునేమో.. అని తెదేపా ఎమ్మెల్యేలు మురిసిపోయారు. అసలే ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో పల్లెల్లో తిరిగినప్పుడు వారికి ఎదురైన చేదు అనుభవాలు అనేకం ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో... ఆ సమస్యలను ప్రభుత్వానికి చెప్పేద్దాం అని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు తన మాటల్లోని అంతరార్థాన్ని.. సరిగ్గా అసెంబ్లీ మొదలయ్యేందుకు ఒక్కరోజు ముందు బయటపెట్టారు. సభలో అర్థవంతంగా పాజిటివ్ ఆలోచనతో ప్రజా సమస్యలపై చర్చ చేద్దాం అని ఆయన అంటున్నారు. అంటే.. ప్రజా సమస్యలు చెప్పాలి గానీ.. ప్రజలంతా ఆ సమస్యలను చూసుకుని మురిసిపోతున్నట్లుగా చెప్పాలా? అని పార్టీ నాయకులే విస్తుపోతున్నారు. మరోవైపు.. అన్యాపదేశం తన సొంత ఎమ్మెల్యేలకు సభలో వ్యవహరించాల్సిన శైలిపై  ఆయన ఇస్తున్న డొంకతిరుగుడు డైరక్షన్ అని, ఇది ఆయన రెండు నాల్కల ధోరణికి నిదర్శనం అని పలువురు భావిస్తున్నారు.

తమ పార్టీకి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోనంత వరకు తాము సభలో అడుగుపెట్టబోయేది లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీనే బహిష్కరించింది. ఆ రకంగా ప్రతిపక్షం తమను ఇరుకున పెట్టే ప్రశ్నలే అడిగే పరిస్థితి లేని శాసనసభ సమావేశాలు జరగడం కంటె.. ఏ పాలకపక్షానికి అయినా మరో ఆనందం ఏముంటుంది.

అయితే చంద్రబాబునాయుడు సుదీర్ఘ అనుభవంతో లౌక్యం ఎరిగిన నాయకుడు గనుక.. ఆ ఆనందాన్ని బయటపడనివ్వకుండా.. ప్రజల సమస్యలు ప్రస్తావించే విషయంలో ముందుండాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ బాద్యత విస్మరించిందంటూ వారి మీద బురద చల్లుతున్నారు. సింగపూర్ లాగా.. ప్రతిపక్షంపాత్ర పెద్దగా ఉండని ప్రభుత్వ పక్షంగా అన్ని పనులు మనమే చేయాలంటూ తమ సభ్యులకు ఆయన చెబుతున్నారు. మరి వారు నిజంగానే.. తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలను ఏకరవు పెడితే.. విని తట్టుకోగలిగే గుండె దిటవు, అసెంబ్లీ రికార్డుల్లోకి స్వపక్షీయులే తమ వైఫల్యాలను ఎక్కిస్తే.. సహించే ఓర్పు చంద్రబాబుకు ఉన్నాయా అనేది ప్రజల అనుమానంగా ఉంది.

Tags:    

Similar News