కొత్త భ‌యాన్ని బ‌య‌ట‌పెట్టిన బాబు!

Update: 2018-04-27 04:39 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న కొత్త భ‌యాన్ని వెల్ల‌డించారు. క్యాలెండ‌ర్ లో ఒక‌టో తేదీ వ‌స్తుందంటే చాలు త‌న‌కు భ‌య‌మేస్తుంద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఏటీఎంల‌లో న‌గ‌దు కొర‌త అంత‌కంత‌కూ ఎక్కువైపోతున్న వేళ‌.. త‌న నివాసంలో రాష్ట్ర స్థాయి బ్యాంక‌ర్ల‌తో మీటింగ్ పెట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో నెల‌కొన్న న‌గ‌దు కొర‌త‌పై అధికారులు ఏం చేస్తున్నారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఒక‌టో తేదీ వ‌స్తుందంటే చాలు.. ఒక్క ఫించ‌న్ల కోస‌మే రూ.450 కోట్లు అవ‌స‌ర‌మ‌వుతోంద‌ని.. రాష్ట్రంలో న‌గ‌దు కొర‌త‌కు కార‌ణాలు ఏమిటంటూ బ్యాంకు అధికారుల్ని ప్ర‌శ్నించారు. ఏ బ్యాంకు అయినా ఇబ్బందుల్లో ఉంటే డిపాజిట‌ర్ల డ‌బ్బు వాడుకుంటామ‌న్న సంకేతాల్ని ప్ర‌జ‌ల్లోకి పంపార‌ని.. అందువ‌ల్లే స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ట్లుగా బాబు వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ కుప్ప‌కూల‌టం ప్ర‌జ‌ల్లో బ్యాంకుల మీద న‌మ్మ‌కం త‌గ్గేలా చేసింద‌న్న ఆయ‌న‌..  బ్యాంకుల మీద ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న భ‌యాల్ని తొల‌గించాల్సిన బాధ్య‌త స‌ద‌రు బ్యాంకుల‌దేన‌ని చెప్పారు. బ్యాంకుల తీరుతో ప్ర‌జ‌ల్లో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఉందంటున్న బాబు.. ఏటీఎంలో న‌గ‌దు కొర‌త‌పై బ్యాంకింగ్ అధికారుల‌కు ప్ర‌శ్న‌లు వేశారు. ఈ సంద‌ర్భంగా స్పందించిన బ్యాంకు అధికారులు ఏపీలో 85 శాతం మేర ఏటీఎంల్లో డ‌బ్బులు ఉన్న‌ట్లు చెప్పారు.

బ్యాంకుల్లో డిపాజిట్లు నాలుగో వంతుకు ప‌డిపోయింద‌ని.. ప్ర‌జ‌లు తీసుకుంటున్న డ‌బ్బును చాలావ‌ర‌కూ ఖ‌ర్చు చేయ‌టం లేద‌ని.. విత్ డ్రా చేసిన మొత్తాన్ని స‌ర్క్యులేష‌న్లోకి తేక‌పోవ‌టంతో న‌గ‌దు కొర‌త అంత‌కంత‌కూ పెరుగుతోంద‌న్నారు. మ‌రో రెండు.. మూడు రోజుల్లో రూ.500 కోట్ల మొత్తం ఆర్ బీఐ ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా ఏపీకి రానుంద‌ని.. దాంతో న‌గ‌దు కొర‌త కొంత‌మేర త‌గ్గుతుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

రూ.2వేల నోట్లను తొలుత ప్రింట్ చేయ‌టం.. చిల్ల‌ర నోట్ల చికాకుల్ని త‌గ్గించేందుకు రూ.500 నోట్ల‌ను ప్రింటింగ్ చేయ‌టంతో రూ.2వేల నోట్ల కొర‌త వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే రూ.2వేల నోట్లు అస్స‌లు క‌నిపించ‌టం లేద‌న్న మాట సమావేశంలో వ‌చ్చింది. మ‌రి.. బాబు కొత్త భ‌యం ఎంత‌మేర‌కు బ్యాంక‌ర్లు తీరుస్తారో చూడాలి.
Tags:    

Similar News