జూన్ 8 కాదు బాబూ.. మే 23!

Update: 2019-04-19 04:33 GMT
'జూన్ 8 వరకూ ముఖ్యమంత్రిని నేనే..' అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తను సమీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వస్తున్న అభ్యంతరాల మీద బాబు ఇలా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా బాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి.

గత ఎన్నికల అనంతరం తను ప్రమాణస్వీకారం చేసిన తేదీని బట్టి చంద్రబాబు నాయుడు జూన్ 8 వరకూ తనే ముఖ్యమంత్రి అని చెప్పుకున్నట్టుగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి అనేది ఐదేళ్ల బాండ్ గ్యారెంటీ ఏమీ ఉన్నది కాదు.

ఈ సారి ఎన్నికల ఫలితాలు మే 23 న రాబోతూ ఉన్నాయి. ఆ రోజు ఫలితాలను బట్టి చంద్రబాబు నాయుడు స్పందించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే మే 23న ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా.. జూన్ 8 వరకూ అని చెప్పుకోవడానికి ఉండదు.

సాధారణంగా ఎన్నికల ఫలితాల రోజున తమ పార్టీ ఓటమి ఖరారు కాగానే ముఖ్యమంత్రి హోదాలోని వారు గవర్నర్ ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తూ ఉంటారు. అంతే కానీ.. తమ ఐదేళ్ల లెక్కలను చెప్పరు. అయితే చంద్రబాబు  మాత్రం ఐదేళ్ల లెక్కలను చెబుతూ ఉన్నారు.

ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే మాత్రం చంద్రబాబుకు తిరుగు ఉండదు. ఫలితాల రోజున దర్జాగా గవర్నర్ ను కలిసి రాజీనామా ఇచ్చి, మళ్లీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయమని అంటారు.

ఏ లెక్కన చూసినా.. అసలు కథ తేలేది మే 23నే. ఆ రోజు తొలి రెండు  గంటల్లోనే ఫలితాలపై కొంత క్లారిటీ - సాయంత్రానికి పూర్తి స్పష్టత వస్తుంది. కాబట్టి జూన్ ఎనిమిదిని పక్కన పెట్టి.. మే  23 ను చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలని పరిశీలకులు అంటున్నారు!


Tags:    

Similar News