చంద్రబాబుకు పవన్ భయం పట్టుకుందా?

Update: 2017-11-11 15:30 GMT
రాజకీయ ఎత్తుగడలు వేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కోసారి చాలా ముందుంటారు. తాజాగా ఆయన అలాంటి స్టెప్పే వేశారు. ఏపీ రాజకీయాల్లో కొత్త శక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి టీడీపీతో కలిసి పనిచేస్తారో లేదో ఇంకా స్పష్టత రాని తరుణంలో... ఆయన ఒంటరి పోరుకే మొగ్గు చూపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు చురుగ్గా అడుగులేస్తున్నారు. పవన్ తాను స్వయంగా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తారని దాదాపుగా ఖరారు కావడంతో ఆయన ప్రభావాన్ని తట్టుకోవడానికి చర్యలు మొదలుపెట్టారు. అనంతపురంలో ప్రధాన సామాజికవర్గ నేతలెవరూ పవన్ వైపు చూడకుండా పదువులిచ్చి సంతృప్తి పరుస్తున్నారు. శాసనసభ - మండలి చీఫ్ విప్ పదవుల నియామకమే అందుకు ఉదాహరణ.
    
ఏపీ అసెంబ్లీ చీఫ్ విప్ గా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని.. శాసనమండలి చీఫ్ విప్ గా పయ్యావుల కేశవ్ ను ఆయన నియమించారు. ఇద్దరు నేతలదీ అనంతపురం జిల్లాయే. ఈ పదవులకు తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో ఆయన రెండు పదవులనూ ఒకే జిల్లాకు ఇవ్వడం చిన్న విషయం కాదు. ఒకేసారి ఒకే జిల్లాకు చంద్రబాబు రెండు కీలక పదవులు ఇచ్చారంటే అందుకు కారణం పవన్ ఆ జిల్లాను ఎంచుకోవడం తప్ప ఇంకేమీ కాదని అర్థమవుతోంది.
    
నిజానికి పవన్ గత ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేశారు. ఒకరకంగా ఆయన వైసీపీ - టీడీపీ మధ్య ఉత్కంఠ పోరు ఉన్నప్పుడు తాను టీడీపీకి మద్దతిచ్చి చంద్రబాబును ఒడ్డునపడేశారని చెప్తారు. ఆ తరువాత పవన్ - టీడీపీల మధ్య కొంత దూరం పెరిగింది. మళ్లీ ఎన్నికల నాటికి కలుస్తారో లేదో ఇంకా తేలలేదు. పైగా పవన్ నియోజకవర్గ కమిటీలు - సభల పేరుతో స్పీడు పెంచుతున్నారు. తాను అనంతపురం నుంచి పోటీ చేస్తానన్న సంకేతాలు పార్టీ కీలక నేతల ద్వారా ఇప్పించారు.
    
దీంతో ఈసారి పవన్ ది ఒంటరి పోరేనని టీడీపీ భావిస్తోంది. అంతేకాకుండా ఆయన అనంతపురం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావంతో చుట్టుపట్ల జిల్లాల్లోనూ టీడీపీ ఓట్లు చీలిపోతాయన్న అంచనాలున్నాయి. ఆ పరిస్థితి రాకుండా గట్టిగా పనిచేసేందుకు నేతలకు పదవుల తాయిలమిచ్చి సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు. అందులో భాగమే అనంతపురానికి ఒకే సారి రెండు పదవులు రావడం అని తెలుస్తోంది.
Tags:    

Similar News