షా దాడిపై బాబు సీరియ‌స్..ఎందుకంటే?

Update: 2018-05-12 06:52 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు కొత్త త‌ల‌నొప్పి మొద‌లైంది. బాబు నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కామెంట్ చేసిన వారానికే.. పోలీసు అధికారుల్ని పిలిపించుకొని మ‌రీ ఓటుకు నోటు కేసు ద‌ర్యాప్తు ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చింద‌న్న రివ్యూతో పాటు.. ఆ విష‌యాన్ని ప్రెస్ నోట్ పెట్టి మ‌రీ సీఎంవో నుంచి మీడియాకు రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

కేసీఆర్ ఆఫీసు నుంచి వ‌చ్చిన ప్రెస్ నోట్‌ లో ఓటుకు నోటు కేసు వ్య‌వ‌హారం ఉండ‌టం చాలామందిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఓటుకు నోటు కేసు త‌ర్వాతి ప‌రిణామాలు ఎలా ఉంటాయ‌న్న దానిపై కిందా మీదా ప‌డుతున్న బాబుకు.. తాజాగా అలిపిరి వ‌ద్ద బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా కారుపై దాడి చేసిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. బాబుకు కొత్త త‌ల‌నొప్పిని తెచ్చి పెట్టిన‌ట్లైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌త్యేక హోదా సాధ‌న పేరుతో వ‌రుస నిర‌స‌న‌లు నిర్వ‌హిస్తున్న బాబుపై కేంద్రం గుర్రుగా ఉంది. మొన్న‌టివ‌ర‌కూ స్నేహితుడిగా ఉన్న త‌మ‌పైనే బాబు పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌మ‌పై రాళ్ల దాడికి దిగ‌టం ఏమిటంటూ మండిప‌డుతున్నారు. నిర‌స‌న తెలియ‌జేయ‌టం త‌ప్పేం కాద‌ని.. కానీ రాళ్ల‌తో దాడి స‌రైన చ‌ర్య కాద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

త‌మ జాతీయ అధ్యక్షుడి వాహ‌నంపై దాడి జ‌ర‌గ‌టంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇది త‌మ ప‌ర‌ప‌తిని దెబ్బ తీసిన చ‌ర్య‌గా వారు భావిస్తున్నారు. ఇందుకు బాబు త‌గిన మూల్యం చెల్లించాల్సిందేనంటూ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న వారు లేక‌పోలేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అలిపిరి ద‌గ్గ‌ర చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై బాబు సీరియ‌స్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ప్ర‌త్యేక హోదా మీద చేస్తున్న నిర‌స‌న‌ల ప్ర‌భావం త‌న మీద త‌ప్పక ఉంటుంద‌న్న భ‌యాందోళ‌న‌లో ఉన్న బాబుకు.. అలిపిరి ఉదంతాన్ని బీజేపీ అధినాయ‌క‌త్వం చాలా సీరియ‌స్ గా తీసుకుంటుంద‌న్న అభిప్రాయంలో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఇప్ప‌టికే రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు క్షీణిస్తున్నాయ‌ని ఓప‌క్క వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న వేళ‌.. ఆ విష‌యాన్ని రుజువు చేసేలా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడి వాహ‌నం మీద‌నే దాడి జ‌ర‌గ‌టాన్ని కేంద్రం సీరియ‌స్ గా తీసుకునే వీలుంద‌ని చెబుతున్నారు. త‌న బ‌లం ఉన్న చోట బాబు త‌న అనుచ‌రుల చేత చేయించిన ప‌నికి క‌న్నుకు క‌న్ను టైపులో ప్ర‌తీకారం తీర్చుకోవాలని అమిత్‌ షా అండ్ కో కానీ డిసైడ్ అయితే త‌మ స‌ర్కారుకు తిప్ప‌లు త‌ప్ప‌వ‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మోడీ ఆగ్ర‌హ‌జ్వాల‌ల తీవ్ర‌త ఎంత‌లా ఉంటుందో అవ‌గాహ‌న ఉన్న చంద్ర‌బాబు.. అమిత్ షా వాహ‌నంపై రాళ్ల దాడితో ప్ర‌మేయం ఉన్న వారిలో పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు ఎవ‌రైనా ఉన్నారా? అన్న‌ది చెక్ చేసుకోవాల‌ని.. ఒక‌వేళ ఉంటే మాత్రం వెనువెంట‌నే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ బాబు ఆదేశాలు జారీ చేసిన తీరు చూస్తే.. షా వాహ‌నం మీద రాళ్ల దాడిపై ఏపీ సీఎం చాలా సీరియ‌స్ గా ఉన్నార‌ని చెబుతున్నారు. సాధార‌ణంగా ఏదైనా ఉద్య‌మం జ‌రుగుతున్న‌ప్పుడు ప్ర‌జ‌లు భావోద్వేగాల‌కు గురై అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తే వారికి చెక్ చెప్పే క‌న్నా.. వెన‌కేసుకు రావ‌టం ఉంటుంది.

తెలంగాణ ఉద్య‌మంలో ఇలాంటివి చాలానే చోటు చేసుకున్నాయి. ఎక్క‌డి దాకానో ఎందుకు అసెంబ్లీలో లోక్ స‌త్తా పార్టీ అధినేత జేపీ మీద భౌతిక‌దాడే జ‌రిగింది. ఆ టైంలో ఇప్పుడు ఇంత‌గా మాట్లాడుతున్న బీజేపీ నేత‌ల్లో ఒక్క‌రు బ‌లంగా ఖండించింది లేదు. దీనికి భిన్నంగా తాజా ప‌రిణామాలు ఉండ‌టం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం లేక‌పోలేదు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌కు రావ‌టం.. త‌న‌పై ఇప్ప‌టికే ఉన్న కేసుల‌కు సంబంధించి లేనిపోని ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌న్న స‌ల‌హా బాబును పాటిస్తున్న‌ట్లు చెబుతున్నారు. కేంద్రంలో శ‌క్తివంతంగా ఉన్న మోడీతో ఎక్కువ‌గా పెట్టుకుంటే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న ఆలోచ‌నే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న ఆదేశాలు జారీ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News