వెయిట్ చేయ‌మంటే..రాజీనామా చేసేశాడుః బాబు

Update: 2017-10-28 11:51 GMT
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి త‌న‌కు గుర్తింపునిచ్చిన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. అమ‌రావ‌తిలో త‌మ‌తో స‌మావేశానికి రావాల్సిందిగా టీటీడీపీ నేత‌ల‌ను బాబు ఆహ్వానించ‌గా..దానికి వ‌చ్చిన రేవంత్ అక్క‌డే ప‌ద‌వికి టాటా చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ భేటీలో ఏం జ‌రిగింద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అమ‌రావ‌తిలో స‌మావేశం ఏర్పాటు చేసిన‌ స‌మ‌యంలోనే త‌న వాద‌న వినేందుకు రేవంత్ సిద్ధ‌మ‌య్యారు. అయితే విలేక‌రుల స‌మావేశం ఉంద‌ని బాబు వెళ్లిపోయారు. దీంతో రేవంత్ నొచ్చుకున్నారని ప్ర‌చారం జ‌రిగింది.

ఈ ప‌రిణామంపై, పార్టీ ప్రాథ‌మిక సభ్యత్వానికి రాజీనామా చేయ‌డంపై పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. విలేక‌రుల స‌మావేశంలోనే చంద్ర‌బాబు ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. `కాసేపు వెయిట్ చెయ్...తరువాత మాట్లాడదాం`` అని రేవంత్ రెడ్డికి చెప్పానని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన తరువాత అక్కడ ఏం జరిగిందన్నది రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే మీడియా సమావేశం పూర్తయిన తరువాత కలుద్దామని, అందర్నీ ఉండమని చెప్పానని బాబు వివ‌ర‌ణ ఇచ్చారు. మీడియా సమావేశం ముగిసిన తరువాత ఆయనతో మాట్లాడతానని ఆయన తెలిపారు. అయితే...చంద్ర‌బాబు మీడియా సమావేశం జరుగుతుండగానే పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి, బయటకి వచ్చేయడం విశేషం.

మ‌రోవైపు త‌న విదేశీ యాత్ర గురించి మీడియాకు బాబు అట్ట‌హాసంగా చెప్తున్న స‌మ‌యంలో...పార్టీకి చెందిన ముఖ్య‌నేత ప‌ద‌వికి గుడ్ బై చెప్పేసిన ప‌రిణామం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ టీడీపీ ముఖ్య‌నేత‌ల‌తో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. విజ‌య‌వాడ‌లోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశంలో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎల్. ర‌మ‌ణ‌, రావుల, మోత్కుప‌ల్లి వంటి ముఖ్య‌నేత‌లు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి రాజీనామా, తెలంగాణ‌లో పార్టీ చేప‌ట్టాల్సిన కార్యక్ర‌మాల‌పై చ‌ర్చిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా...టీడీపీ పార్టీకి రేవంత్ రెడ్డి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇంత‌కు ముందే పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి - ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన రేవంత్ ...తాజాగా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను తెలంగాణ స్వీక‌ర్ కు పంపించారు. న‌వంబ‌ర్ రెండో వారంలో రాహుల్ స‌మ‌క్షంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశం ఉందని ప్ర‌చారం జ‌రుగుతోంది.
Tags:    

Similar News