స‌మీక్ష‌లు కాదు..ముందు మైండ్ సెట్ మారాలి!

Update: 2019-06-11 08:31 GMT
మ‌ళ్లీ మొద‌లెట్టేశాడు మావోడు అంటూ కొంద‌రు తెలుగు త‌మ్ముళ్లు తెగ హైరానా ప‌డిపోతున్నారు. ప‌వ‌ర్ చేతిలో ఉన్న‌ప్పుడు చెప్పే ప్ర‌తి మాట‌ను శ్ర‌ద్ధ‌గా విన్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇవ్వ‌టం మామూలే. కానీ.. చేతిలో ఉన్న అధికారం చేజారిన త‌ర్వాత‌.. అదే ప‌నిగా వినాలంటే ఎంత విసుగు?

గ‌డిచిన ఐదేళ్ల‌లో నిత్యం అదే ప‌నిగా స‌మీక్ష‌ల‌తో గ‌డిపిన బాబు.. తాను చాలా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లుగా ఫీల‌య్యేవారు. నిజానికి ఆయ‌న క‌ష్ట‌ప‌డలేద‌ని చెప్ప‌లేం. కానీ.. తెలివైన అధినేత ఎప్పుడూ హార్డ్ వ‌ర్క్ కంటే స్మార్ట్ వ‌ర్క్ కు పెద్ద‌పీట వేస్తారు. ఈ విష‌యాన్ని బాబు పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని చెప్పాలి.

నిత్యం గంట‌ల కొద్ది స‌మ‌యాన్ని స‌మీక్ష‌ల పేరుతో ఉద‌ర‌గొట్టే బాబు.. ప్ర‌భుత్వ ప‌రంగా తీసుకోవాల్సిన నిర్ణ‌యాల విష‌యంలో అంతులేని జాప్యాన్ని ప్ర‌ద‌ర్శించేవారు. ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత ప‌వ‌ర్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఎంత వేగంగా నామినేటెడ్ ప‌ద‌వులు పంపిణి చేయాల్సి ఉన్నా.. అలాంటిదేమీ చేయ‌కుండా త‌న చుట్టూ తిప్పించుకునేవారు. నెల‌లు త‌ర‌బ‌డి నిర్ణ‌యాలు తీసుకోకుండా ఉండేవారు.

ప‌వ‌ర్ లేన‌ప్పుడు స‌రే.. ప‌వ‌ర్ ఉన్న‌ప్పుడు కూడా చేతిలో ఉన్న వ‌రాల్ని ఇచ్చే విష‌యంలో పినాసిత‌నాన్ని ప్ర‌ద‌ర్శించిన బాబును తెలుగు త‌మ్ముళ్లు తిట్టి పోస్తున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రెండు వారాల వ్య‌వ‌ధిలోనే కుప్ప‌లు కుప్ప‌లుగా నిర్ణ‌యాలు తీసుకొని.. అధికారుల్ని ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తున్నారు. పాల‌న అంటే ఇలా ఉండాలే కానీ.. గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడుతూనే స‌మయాన్ని స‌రిపెట్టేయ‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

దారుణ‌మైన ఓట‌మి త‌ర్వాత కూడా స‌మీక్ష‌ల మోజును వ‌ద‌ల‌ని బాబు.. దాని కార‌ణంగా త‌న‌కు జ‌రుగుతున్న ప్ర‌యోజ‌నం ఏమైనా ఉందా? అన్న విష‌యాన్ని ఆయ‌న ఒక‌సారి ఆలోచించుకోవాలి. సోమ‌వారం నాటి స‌మావేశాన్నే తీసుకుంటే.. ఎంత‌సేప‌టికి తాము బాగా పాలించామ‌ని..అదిరిపోయేలా ప‌థ‌కాలు అమ‌లు చేశామ‌న్న పొగ‌డ్త‌ల‌తో స‌మ‌యాన్ని ఖ‌ర్చు చేయ‌టం కార‌ణంగా త‌ప్పుల మీద స‌మీక్ష కంటే కూడా.. గొప్ప‌ల మీద‌నే దృష్టి పెట్టిన ప‌రిస్థితి.

ఇలాంటి తీరుతో వాస్త‌వాన్ని వ‌దిలేసి.. భ్ర‌మ‌లోనే ఉండిపోవ‌టం ఖాయం. ఇలాంటి వాటిని ఎన్నినిర్వ‌హించినా దాని వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న నిజాన్ని బాబు గుర్తించ‌నంత కాలం ఆయ‌న్ను.. పార్టీని మార్చ‌టం ఒక ప‌ట్టాన సాధ్యం కాద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News