నాలుగేళ్లు.. ఈ లెక్క‌ల్ని చెప్ప‌లేదెందుకు బాబు?

Update: 2018-04-01 05:11 GMT
చ‌ట్టాప‌ట్టాలేసుకొని నాలుగేళ్ల పాటు తిరిగిన‌ప్పుడు గుర్తుకు రాని విష‌యాల‌న్నీ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఇప్పుడు గుర్తుకు వ‌చ్చేస్తున్నాయి. కేంద్రంలో ఎన్డీయే స‌ర్కారుకు స‌పోర్ట్ చేసి.. ఏపీకి ఏమీ ఇవ్వ‌కున్నా గుడ్డిగా ఫాలో అయిపోయిన బాబు.. ఇప్పుడు మాత్రం గుండెలు బాదేసుకుంటున్నారు. తన‌ను తాను బాధ్య‌త క‌లిగిన నేత‌గా చెప్పుకునే చంద్ర‌బాబు.. కేంద్రం తీసుకునే రాష్ట్ర నిధుల గురించి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు?

నాలుగేళ్లుగా నాన్ స్టాప్ గా ఏపీకి అన్యాయం చేస్తున్నా.. మాట్లాడ‌టానికి సంకోచించిన చంద్ర‌బాబు.. ఇప్పుడు మాత్రం నోరు తెరిచిన ప్ర‌తిసారీ మోడీ అండ్ కోపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. చివ‌ర‌కు వేడుక‌లు.. ఉత్సవాల‌కు వెళ్లినా ఆయ‌న నోటి నుంచి రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయంపైనా.. బీజేపీ చేసిన ద్రోహాన్ని ప్ర‌స్తావిస్తూనే ఉన్నారు.

అదేమంటే.. న‌లుగురు క‌లిస్తే చాలు.. రాష్ట్రానికి జ‌రిగిన న‌ష్టం గురించి మాట్లాడుకోవాల‌న్న చంద్ర‌బాబుకు ఒకే ఒక్క సూటి ప్ర‌శ్న‌. మోడీ తెగ మోసం చేశాడంటూ ప్ర‌తి ఒక్క ఆంధ్రుడు నోరు విప్పాలంటున్న చంద్ర‌బాబు మ‌ర్చిపోతున్న విష‌యం ఒక‌టుంది.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ.. త‌న వెంట రెండు కుండ‌లు తెచ్చి.. అందులో ఒక దాంట్లో నీళ్లు.. మ‌రోదాన్లో మ‌ట్టి తెచ్చిన‌ప్పుడే ఏపీకి ఏమీ చేయ‌డ‌న్న విష‌యంపై ఆంధ్రోళ్ల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. ఉత్స‌వం వేళ‌.. సాయం చేసే స‌త్తా ఉన్నా.. ఆదుకునే స‌మ‌ర్థ‌త ఉన్నా ఉత్త చేతుల‌తో ఊపుకుంటూ వ‌చ్చేసి.. ఊక‌దంపుడు స్పీచ్ ఒక‌టి ఇచ్చేసిన వైనం చూసిన ఆంధ్రోళ్లు మోడీపై క్లారిటీ వ‌చ్చేసింది.

ప్రేమ మైకంలో వాస్త‌వాల్ని గుర్తించే ప‌రిస్థితుల్లో ఉండ‌ర‌న్న నానుడికి త‌గ్గ‌ట్లే.. స్నేహం పేరుతో ఎన్డీయేలో ఉన్న బాబు.. స‌రైన టైం కోసం ఎదురుచూస్తూ.. రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతున్నా పెద‌వి విప్ప‌ని ఆయ‌న‌.. ఈ రోజున సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు టార్గెట్ చేస్తున్న తీరు చూస్తే.. ఈసారి ఎన్నిక‌ల్లో మోడీషాల‌పై అదే ప‌నిగా విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేసి ఓట్లు దండేసుకోవాల‌న్న బాబు త‌ప‌న క‌నిపించ‌క మాన‌దు.

రాష్ట్రానికి భారీ న‌ష్టం జ‌రుగుతుంద‌ని.. కేంద్రానికి రాష్ట్రం క‌ట్టే ప‌న్నుల్లో 42 శాతం మాత్రం తిరిగి ఇచ్చేసి.. మిగిలిన 58 శాతం వాడేసుకుంటుంద‌ని.. న్యాయ‌బ‌ద్ధంగా మ‌నం క‌ట్టాల్సింది క‌ట్టేసిన‌ప్పుడు.. న్యాయంగా రావాల్సింది అంతే న్యాయంగా తీసుకోవాల్సిన అవ‌సరం ఉందని చెబుతున్నారు. ఈ మ‌ధ్య‌న ఇలాంటి లెక్క‌ల్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్. జాతీయ రాజ‌కీయాల్లో కీ రోల్ ప్లే చేయాల‌ని త‌పిస్తున్న కేసీఆర్.. రాష్ట్రాల‌పై కేంద్రం చేస్తున్న దందాపై మాట్లాడుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో కొన్ని మాట‌ల్ని... లెక్క‌ల్ని తీసుకున్న చంద్ర‌బాబు.. వాటిని అదే పనిగా వ‌ల్లె వేస్తున్నారు. ఏపీకి కేంద్రం హ్యాండ్ ఇచ్చింది నిజ‌మే అయినా.. నాలుగేళ్లుగా ఎందుకు వెయిట్ చేశారు? గ‌డ‌వాల్సిన పుణ్య కాల‌మంతా గ‌డిచిపోయిన త‌ర్వాత తీరిగ్గా క‌ళ్లు తెరిచి.. గుండెలు బాదేసుకుంటే లాభం ఏమైనా ఉంటుందా?

ఎంత‌సేప‌టికి ఓట్ల మీద ధ్యాస త‌ప్పించి.. రాష్ట్రానికి మేలు జ‌రిగేలా ప్లాన్ చేయ‌క‌పోవ‌టం చూస్తే.. బాబు అనుభ‌వం ఈపాటిదా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవ‌టం రాష్ట్రాల‌కు మొద‌ట్నించి ఇబ్బంది ఉన్న‌దే.

అయితే.. అలాంటి నిజాల్ని తొక్కి ప‌ట్టేసి.. జ‌నాల‌కు ఎక్కేసేలా.. కేంద్రంపై క‌స్సుమ‌నేలా బాబు చెబుతున్న మాట‌ల్ని కొట్టిపారేయ‌టం లేదు కానీ.. అవ‌న్నీ ఇప్ప‌టికిప్పుడు జ‌ర‌గ‌లేద‌ని.. నాలుగేళ్లుగా జ‌రుగుతున్నాయ‌న్న విష‌యాన్ని గుర్తు పెట్టుకుంటే.. మోడీషాల దొంగాట మాత్ర‌మే కాదు.. వారితో జ‌త‌క‌ట్టి నాలుగేళ్లు ఫ్రెండ్ షిప్ చేసిన చంద్ర‌బాబు దుర్మార్గం సైతం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అదే ప‌నిగా మోడీ స‌ర్కారుపై విరుచుకుప‌డుతున్న చంద్ర‌బాబు అంతిమంగా చెప్పేది ఒక్క‌టే.. ఈసారి ఎన్నిక‌ల్లో నాకు మాత్ర‌మే ఓటు వేయండ‌ని. చూస్తుంటే.. 2019 ఎన్నిక‌ల్లో భావోద్వేగ అంశాల్ని తెర‌పైకి తీసుకురావ‌టానికి వీలుగానే.. మోడీ హ్యాండ్ ఇస్తున్నా బాబు మౌనంగా ఉండిపోయారా? అన్న సందేహానికి ఏపీ ముఖ్య‌మంత్రి కాస్త క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

Tags:    

Similar News