ఆర్కిటెక్టుల్లో ఆగ్రహం.. బాబును బహిష్కరిస్తారా?

Update: 2017-09-18 22:14 GMT
ఆర్కిటెక్చర్ అంటే భవన నిర్మాణ రంగంలో సృజనాత్మకతతో కూడిన ఓ అత్యద్భుతమైన కళ. ప్రత్యేకించి నిర్మాణరంగంలో ఎంతో మమకారం, అభినివేశం, ప్రావీణ్యం ఉంటే తప్ప ఆర్కిటెక్చర్ చేసిన ప్రతి ఒక్కరూ  కూడా గొప్ప ఆర్కిటెక్టులుగా రాణించడం అనేది సాధ్యం కాదు. అలాగే.. సాంకేతిక అంశాలన్నింటికీ తోడు.. అనితర సాధ్యమైన రీతిలో సృజనాత్మకత కూడా వీరికి ఎంతో అవసరం. సాంకేతిక అంశాలతో సృజనాత్మకతను సరైన మేళవింపుతో కలపడమే... ఆర్కిటెక్చర్ గొప్పదనం. ఆర్కిటెక్టు ఒక గదిలో ఒక చోట కిటికీ ప్లాన్ చేశాడంటే.. దానికి చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఒక శాస్త్రబద్ధమైన వ్యవహారం ఉంటుంది. అలాంటిది.. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్కిటెక్టులు కూడా కొన్ని నెలలపాటు పరిశ్రమించి, తమ మేధస్సును మధించి తయారుచేసిన డిజైన్లు చంద్రబాబు ముందు ఎందుకూ పనికిరానివిగా తేలిపోతున్నాయి. ఆయన సింపుల్ గా మళ్లీ తయారు చేయండి అని చెప్పేస్తున్నారు. అంతకంటె ఘోరంగా.. అంతకంటె గొప్ప డిజైన్ల కోసం ఐఏఎస్ అధికార్లను, మంత్రిని సినిమా దర్శకుల వద్దకు పంపిస్తున్నారు. ఎంత హేయమైన పోకడ ఇది. ఆర్కిటెక్టుల ప్రపంచానికి ఎంత దారుణమైన అవమానం ఇది.

అందుకే ఆర్కిటెక్టులు ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వృత్తి నిపుణులను అవమానించే విధంగా ఉన్నాయని.. ఎలాంటి శాస్త్రీయత తెలియని, పట్టించుకోని బొమ్మలతో సెటింగులు వేసుకుని సినిమాలు తీసుకునే వాళ్ల అభిప్రాయాలకు ఉన్న విలువ.. ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసి.. పరిణతి సాధించిన తమ ప్రతిభకు లేకపోవడం అవమానకరం అని వారు మండిపడుతున్నారు.

చంద్రబాబు.. నార్మన్ ఫోస్టర్ ను మళ్లీ డిజైన్లు చేయమని చెప్పడం ద్వారా అక్కడికేదో.. తనకు అంతకంటె గొప్ప టేస్టు ఉన్నట్లుగా చాటుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు గానీ.. ఇలాంటి అవమానాలు భరించడం కంటె.. చంద్రబాబు ప్రభుత్వానికి అవసరమయ్యే పనులకు సహకరించకుండా.. తమ వంతు సేవలు అందించకుండా ఉండాలని అనుకుంటున్నట్లు సమాచారం. కనీసం చంద్రబాబును పట్టించుకోకుండా.. తమ పరువును కాపాడుకున్నట్లు అవుతుందని  ఆర్కిటెక్టులు భావిస్తున్నారట. వారి ఆవేదన కూడా సబబే కదా అని జనం అనుకుంటున్నారు.
Tags:    

Similar News