ఈ ఆరోప‌ణ‌లు మీరు భ‌రించాల్సిందే బాబు!!

Update: 2016-10-22 08:08 GMT
స‌రిగ్గా ఏడాది కింద‌ట‌...అదో అద్భుత‌మైన వేడుక‌. అరుదైన సన్నివేశం.. రాజధానిలేని అవశేష ఆంధ్రప్రదేశ్‌కు దిక్సూచిగా నిలిచిన ప్రపంచ నగరం అమరావతికి అంకురార్పణ జరిగిన మధుర ఘట్టాలు.. దేశ ప్రధాని.. కేంద్రమంత్రులు.. ఏపీ& తెలంగాణ ముఖ్యమంత్రులు.. ఒకరేంటి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరైన వేళ.. ఆంధ్రప్రదేశ్ చరిత్రపుటల్లో చిరస్థాయిగా నిలిచిన అద్భుత ఘడియలు.. నవ్యాంధ్ర రాజధానికి శంకుస్థాపన జరిగి ఏడాది పూర్తయింది.. ఎన్నో బాలారిష్టాలను అధిగమించి ప్రపంచంలోని పంచ నగరాల సరసన నిలపాలనే ప్రయత్నాలకు గత ఏడాది అక్టోబర్ 22న అమరావతికి శంకుస్థాపన జరిగింది. కానీ.. ఇప్ప‌టికీ ఆ ప్ర‌పంచ స్థాయి న‌గ‌రం నిర్మాణంలో ఎదుగు బొదుగు లేక‌పోవ‌డం లేక‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని శంకుస్థాపన జరిగి సరిగ్గా ఏడాది అవుతున్న ఒక్కడుగు ముందుకు పడని నేప‌త్యంలోప్రధానమంత్రి మోడీ ఇచ్చివెళ్లిన మట్టే మిగిలిందని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు.

గతేడాది ఇదేరోజున రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో రాజధాని ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని, అన్ని గ్రామాలనూ స్మార్ట్‌ విలేజ్‌లుగా మార్చి కనీస సదుపాయాలు కల్పిస్తామని, విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని, ఎన్‌టిఆర్‌ క్యాంటీన్లు ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకు భోజన సదుపాయం కల్పిస్తామనీ చెప్పారు. 2016 మార్చి నాటికి రైతులకు ప్లాట్లను ఇచ్చేస్తామన్నారు. అర్హులందరికీ ఇస్తామన్న పింఛన్లు నేటికీ రాలేదు. రాజధాని గ్రామాల్లో ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. దీనికి అవసరమైన స్థలాన్ని రాజధాని ప్లానులో ఎక్కడా చూపించలేదు. ప్లాట్ల పంపిణీ నేటికీ అరకొరగానే సాగుతోంది. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఉపాధి పేరుతో శిక్షణ సంస్థకు ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున రాయితీలు కల్పించారు. కానీ ఉపాధి లేకపోగా ఉన్న పనులూ పోయి యువత నిరుద్యోగులుగా మిగిలింది. మహిళలకు అల్లికలు - కుట్టు పనుల్లో శిక్షణ ఇస్తామని, అందరికీ ఉపాధి హామీ పనులిస్తామని చెప్పారు. పనిదినాలూ లేవు. కుట్టుపనులూ లేవు. నన్ను నమ్మండన్న నరేంద్రమోడీ కేంద్రం నుంచి ఇచ్చింది నేటి వరకూ అక్షరాలా రూ.1,800 కోట్లు మాత్రమే. దీనిలోనూ రూ.1,000 కోట్లు గుంటూరు, విజయవాడ నగరాలకు కేటాయించారు. మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. అదీ ఎప్పటికి వస్తుందో తెలియదు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పనులు ఇంకా మొదలుకాలేదు. ప్రసుత్తం భూమి చదును పనులు జరుగుతున్నాయి. దీన్ని ఆరు అడుగులు ఎత్తు పెంచి నిర్మించాల్సి ఉంది. రైతులకు భూములిచ్చి తొమ్మిది నెలల్లో ప్లాట్లు తిరిగి ఇస్తామని ఇచ్చిన హామీకి గడువు పూర్తయి మరో అర్ధ సంవత్సరం దాటిపోయింది. ప్లాట్ల పంపిణీ జరుగుతూనే ఉంది. డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఇస్తున్న ప్లాట్లు కూడా లాటరీ పద్ధతిలో నిజాయతీగా కాకుండా వారికిష్టం వచ్చినట్లు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాజధానిలో 53,373 మంది వ్యవసాయ కార్మికులుండగా 19,055 మందికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేశారు. రాజధానికి ఇసుక తరలింపు పేరుతో ప్రతిరోజూ వేలాది వాహనాలు గ్రామాల్లో తిరుగుతుండటంతో రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. కృష్ణాయపాలెం, వెంకటపాలెం రోడ్డు నడవడానికి వీల్లేని విధంగా తయారైంది. విజయవాడ-వెలగపూడికి రోడ్డు మినహా మిగిలిన రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. మహిళలకు ఉపాధి లేకపోవడంతో డ్వాక్రా రుణాలు చెల్లించలేక పోవడంతో వారి ఖాతాలన్నీ ఎన్‌పిఏలుగా మారిపోతున్నాయి. అన్ని గ్రామాల్లోనూ ఎన్‌టిఆర్‌ క్యాంటీన్లు పెడతామని హామీనిచ్చారు. ఇప్పటికి సెక్రటేరియట్‌ సమీపంలో ఒకక్యాంటీన్‌ మినహా ఎక్కడా ఏర్పాటు చేయలేదు. రాజధాని ప్రకటన వచ్చిన సమయంలో అన్ని గ్రామాల్లోనూ ఇళ్లులేని కుటుంబాలు 6,426 ఉండగా ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదు. వీటితోపాటు పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అన్ని గ్రామాల్లోనూ భూ కేటాయింపులు జరుపుతామని హామీనిచ్చారు. కేటాయింపులు మందడం సమీపంలో తప్ప మరెక్కడా అవసరానికి తగిన విధంగా కనిపించడం లేదు. శంకుస్థాపనకు ముందు అడిగినవారికల్లా పెన్షన్లు ఇచ్చిన సిఆర్‌డిఏ అధికారులు ప్రస్తుతం అనేక ఆంక్షలు విధించి ఉన్న పెన్షన్లు ఊడబీకుతున్నారు. చివరకు ప్రధాని ఢిల్లీ నుండి తెచ్చిన మట్టినీరు తప్ప రాజధాని ప్రాంతానికి మిగిలిందేమీ లేదనేది అక్క‌డి రైతుల ఆవేద‌న‌. ఈ విష‌యంలో ఎదుర‌వుతున్న విమ‌ర్శ‌ల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బాధ్య‌త వ‌హించాల‌ని స్థానికుల డిమాండ్‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News