విస్తరణ ఓకే..మరి ముహుర్తం ఎప్పుడంటారు?

Update: 2017-02-04 17:30 GMT
ఏపీ మంత్రివర్గ విస్తరణపై గడిచిన కొద్ది కాలంగా చాలానే అంచనాలువినిపిస్తున్నాయి. అయితే.. వాటిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకూ మాట్లాడింది లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మంత్రివర్గంలోకి లోకేశ్ ను తీసుకోనున్నట్లు చంద్రబాబే స్వయంగా చెప్పటంతో ఏపీ అధికారపక్షంలోనూ.. రాజకీయ వర్గాల్లో మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. ఈ సందర్భంగా ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తున్నాయే కానీ.. సమాదానాలు ఎవరూ చెప్పలేని పరిస్థితి.

మంత్రవర్గ విస్తరణ ఖాయమని తేలిపోయినప్పటికీ.. అదెప్పుడు ఉంటుందన్నది పెద్దప్రశ్నగా మారింది. ఈ నెలఖరులో బడ్జెట్ సమావేశాలు షురూ కావటం.. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలవుతున్న నేపథ్యంలో విస్తరణ ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానాలు చెప్పని పరిస్థితి. ఎవరికి వారు.. తమకు నచ్చిన రీతిలో.. తోచిన పద్దతిలో వాదనను వినిపిస్తున్నాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలుగు తమ్ముళ్లు వినిపిస్తున్న ప్రతి వాదనలోనూ లాజిక్ ఉండటం. బడ్జెట్ సమావేశాలకు ముందే విస్తరణ ఉంటుందని చెప్పే వర్గం అందుకు తగిన లాజిక్కులను చెబుతోంది. బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా సాగటం.. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే పరిస్థితుల్లో.. అది పూర్తి అయ్యే వరకూ వెయిట్ చేయటం ఆలస్యమని.. ఇప్పటికే రెండున్నరేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో.. వెనువెంటనే విస్తరణ చేయటం మంచిదన్న మాట వినిపిస్తోంది. అయితే... ఇలాంటి వాదనకు వ్యతిరేకంగా వాదన వినిపిస్తున్న వారి మాట వేరేలా ఉంది.

బడ్జెట్ సమావేశాల ముందు కానీ విస్తరణ పూర్తి చేస్తే.. అవకాశాలు లభించని వారు.. పదవులు పోగొట్టుకున్న వారి అసంతృప్తి పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రభావం పడుతుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ సత్తా చూపాలన్న టార్గెట్ ఇవ్వటం ద్వారా.. నేతలంతా బాగా పని చేస్తారని.. ఇది పార్టీకి లాభం చేకూరుస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

అయితే.. ఈ ఆలోచనలో అర్థం లేదన్న మాటను పలువురు చెబుతున్నారు. ప్రతి విషయానికి వెనుకాముందు ఆలోచించటం ఏ మాత్రం సరికాదని.. అసంతృప్తి ఎప్పుడైనా ఉండేదేనని.. ఎంత కసరత్తు చేసినా.. పదవులు ఆశించి రాని వారు బాధ పడటం.. వేదనకు గురి కావటం కామన్ అని.. ఆ పేరుతో నెల తరబడి విస్తరణను వాయిదా వేయటం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఈ రెండు వాదనల నడుమ విస్తరణ ఎప్పుడు ఉంటుందన్న అసలు విషయాన్ని ఏపీ అధికారపక్ష నేతలు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

ఇదిలా ఉంటే.. విస్తరణ సందర్భంగా ఎంతమందికి పదవులు రానున్నాయి? ఎందమంది పదవులు పోనున్నాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో ఆరుగురిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రెండు పదవుల్ని రిజర్వ్ చేసి ఉంచినా.. నలుగురికి అవకాశం తప్పనిసరిగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు మంత్రివర్గంలోని మంత్రుల్లో కనీసం ముగ్గురికైనా ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ఏతావాతా ఏడుగురికి మంత్రి పదవులకు అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ పార్టీ నుంచి వచ్చిన నేతల్లో కనీసం ఇరువురికి మంత్రి పదవులుదక్కే వీలుందని చెబుతున్నారు. వీరు కాక లోకేశ్ ను మినహాయిస్తే.. ముగ్గురు నుంచి నలుగురి వరకూ కొత్తగా బాబు క్యాబినెట్ లో స్థానం దక్కే వీలుందన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News