చంద్రబాబు కన్ను పడిన ఆ ఏడుగురు ఎవరు?

Update: 2017-02-06 08:11 GMT
ఏపీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడానికి చంద్రబాబు భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్సు రిపోర్టులను ఇప్పటికే తెప్పించుకున్న ఆయన యువ ఎమ్మెల్యేల ప్రొఫైల్స్ - పనితీరు.. అసెంబ్లీలో, బయట కూడా ఎంత దూకుడుగా ఉంటున్నారన్నది పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తున్న విపక్ష నేతల నోటికి అడ్డుకట్ట వేయగలిగే.. సరైన సమాధానాలు ఇవ్వగలిగే నోరున్న నేతలకే మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు తలపోస్తున్నారట.  ఇందుకోసం ఏడుగురితో ఒక జాబితా రెడీ అయిందని తెలుస్తోంది.
    
మరోవైపు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న నేతలు కొందరి తీరుపై సీఎం తీవ్ర అసహనంతో ఉన్నారు. వారిని ఎలాగైనా వదిలించుకోవాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వారి స్థానంలో తొలిసారి ఎన్నికైనా  విపక్షాలపై దూకుడుగా వ్యవహరిస్తున్న యువకులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.
    
గత కొంతకాలంగా రాష్ట్రంలో విపక్షాలు జోరుపెంచాయి. ముఖ్యంగా వీలు చిక్కినప్పుడల్లా హోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. కేంద్రం ఒత్తిడికి చంద్రబాబు తలొగ్గి రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంతవరకు వైకాపా నుంచి మాత్రమే విమర్శలొచ్చాయి. ఇటీవల జనసేన కూడా ప్రతిపక్షస్థాయిలోనే ఆరోపణలు గుప్పిస్తోంది. కేంద్రం మెడలొంచి హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారంటూ విమర్శిస్తోంది. వామ పక్షాలు కూడా జోరుపెంచాయి. అయితే మంత్రులెవరూ వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ప్రయత్నించడం లేదు. ప్రతి చిన్న అంశానికి స్వయంగా చంద్రబాబే వివరణిచ్చుకోవాల్సొస్తోంది. ఒకరిద్దరు మంత్రులు విపక్షాలపై ప్రతిదాడికి దిగుతున్నా ఒక పరిమితికి లోబడే వారి వ్యాఖ్యలుంటున్నాయి. ముఖ్యంగా జనసేన విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు అధికార పార్టీపై జనసేనాని ఆరోపణలు గుప్పిస్తున్నా కేవలం తమను తాము సమర్ధించుకోవడానికి తప్ప అంతకుమించి ప్రతిదాడి చేయడంలేదు. ఈవిషయంలో బీజేపీ నేతలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యపై ఎవరు విమర్శలు చేసినా వెనువెంటనే ప్రతివిమర్శలకు పాల్పడుతున్నారు. వెంకయ్యనాయుడుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఆయన వల్లే రాష్ట్రానికీపాటి ప్రయోజనాలన్నీ చేకూరాయంటూ వెనకేసుకొస్తున్నారు. ఆఖరకు ఆయన కుటుంబ సంస్థ స్వర్ణభారత్‌ ట్రస్ట్‌పై విమర్శలొచ్చిన ప్రతీసారి ట్రస్ట్‌ద్వారా యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి అవకాశాల కనుగుణంగా తీర్చిదిద్దుతున్నారంటూ వివరణిస్తున్నారు. ఈ స్థాయిలో మంత్రులెవరూ విపక్షాల్ని కట్టడి చేసేందుకు ప్రయత్నించడంలేదు. ప్రతిసారి చంద్రబాబే స్వయంగా బరిలో దిగాల్సొస్తోంది. ప్రతిసారి పదే పదే వివరణ లివ్వాల్సొస్తోంది.
    
దీంతో రానున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని విపక్షాలు పెంచే దాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టగల దుందుడుకు వైఖరిగల వారికి పాలనాపరంగా అవకాశాలు కల్పిస్తే విపక్షాల్ని ధీటుగా ఎదుర్కోగలుగుతారని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా ఆయన ప్రయత్నాలు కూడా మొదలెట్టినట్లు తెలిసింది. ఏడుగురితో కూడిన ఓ జాబితాను కూడా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News