రేవంత్ నచ్చక, ఏమీ అనలేక... బాబు మధనం

Update: 2017-10-08 10:37 GMT
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. నిజానికి ఆ పార్టీకి తెలంగాణలో ఏకైక నాయకుడు ఆయనే అన్నట్లుగా వ్యవహారం కనిపిస్తూ ఉంటుంది. పార్టీకి ఉన్న తతిమ్మా నాయకులు ఎప్పుడో ఒకసారి తెరమీదకు వచ్చేవారైతే.. రేవంత్ మాత్రం.. తరచుగా కేసీఆర్ పాలనను ఎండగడుతూ వార్తలో హాట్ వ్యక్తిగా నిలుస్తూ ఉంటారు. తాజాగా రేవంత్ రెడ్డి అంటున్న మాటలు  లేవనెత్తుతున్న చర్చ.. పార్టీకి ఎంతో ఇబ్బందికరంగా చంద్రబాబునాయుడు ఫీలవుతున్నప్పటికీ... రేవంత్ ను ఏమీ అనలేని స్థితిలో ఉన్నారని పలువురు విశ్లేషిస్తున్నారు. రేవంత్ ను ఏమీ అనలేక... అలాగని వదిలేయలేక చంద్రబాబు మధనపడుతున్నారని.. డొంకతిరుగుడుగా హెచ్చరికలు చేస్తున్నారని పలువురు అనుకుంటున్నారు.

విషయం ఏంటంటే.. సింగరేణి ఎన్నికల తర్వాత.. రేవంత్ రెడ్డి.. కొన్ని వివాదాస్పద ప్రకటనలు చేశారు. ఈ ఎన్నికల్లో విపక్షాలకు గౌరవప్రదమైన ఓట్లు శాతం లభించిందని, దీన్ని నిలబెట్టుకోగలిగితే.. కేసీఆర్ సర్కారుకు చెక్ చెప్పడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణలోని విపక్షాలు అన్నీ గనుక.. విబేదాలను పక్కన పెట్టి కలిసి పోరాటం సాగిస్తే కేసీఆర్ ప్రభుత్వ పతనం కష్టమేమీ కాదని కూడా చెప్పారు.

నిజానికి సింగరేణి ఎన్నికల్లో తెలుగుదేశం సాధించింది అంటూ ఏమాత్రం లేదు. ఆ ఎన్నికల్లో పార్టీ పోటీకి కూడా దిగలేదు. విపక్ష కూటమిలో ఒకరుగా మిగిలిపోయి.. వారికి మద్దతు ప్రకటించిందే తప్ప.. తాము సొంతంగా పోటీకి సాహసించలేదు. అయితే ఇప్పుడు విపక్షాలకు చెప్పుకోదగినన్ని ఓట్లు వచ్చిన నేపథ్యంలో అందులో తమ ఘనత కూడా ఉందన్నట్లుగా చాటుకోవడానికి రేవంత్ రెడ్డి తపన పడుతున్నారు. అయితే ఆయన చెబతున్న ‘‘కలసికట్టుగా పోరాడడం’’ వంటి మాటలు ఎలాంటి అర్థాన్ని ఇస్తున్నాయంటే.. కేసీఆర్ సర్కారును ఎదుర్కోవడానికి కాంగ్రెస్ - వామపక్షాలతో తెలుగుదేశం చేతులు కలపాలని అంటున్నట్లుగా ఉన్నాయి. సింగరేణి ఎన్నికల్లో జరిగింది అదే. కాంగ్రెస్ తో జట్టు కట్టడం విధానపరంగా ఇష్టంలేని భాజపా కార్మిక సంఘం విడిగా బరిలోకి దిగి ఓడిపోయింది.

రేవంత్ మాటలు ఈ తరహాలో ఉండడం సహజంగానే పార్టీ అధినేతకు ఇబ్బందులు కలిగిస్తాయి. ఈనేపథ్యంలో ఆదివారం పార్టీ సమావేశం పెట్టిన చంద్రబాబు.. పొత్తుల గురించి ఎవరికి తోచినట్లు వారు మాట్లాడవద్దంటూ ఇండైరక్టుగా రేవంత్ ను ఉద్దేశించి హితవుచెప్పడం విశేషం. పొత్తుల సంగతి.. ఎన్నికల వేళలోనే తేలుతుందని కూడా చంద్రబాబునాయుడు వారికి చెప్పారు. మరి ఆయన రేవంత్ దూకుడును ఎన్నికల దాకా ఎలా కట్టడి చేస్తారో ఏమో?
Tags:    

Similar News