విజ‌య‌వాడ‌పై బాబు ఎందుక‌లా మాట్లాడారు?

Update: 2015-12-26 16:07 GMT
తెలుగుదేశం అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళుతున్నారు. ప‌రిపాల‌న ప‌ర‌మైన ఇబ్బందులు ఎదుర‌వుతున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు త‌న వైఖ‌రి క‌రాఖండిగా ఉంద‌ని చెప్తూ రాజధాని త‌ర‌లింపుపై క్లారిటీ ఇచ్చారు. వివిధ శాఖల కార్యదర్శులు, అధిపతులు, జిల్లా అధికారులతో జనవరి 2 నుంచి మొదలుకాబోయే ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని త‌ర‌లింపుపై త‌న మ‌న‌సులోని మాట‌ను ప్ర‌క‌టించారు.

లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణాలు పూర్తిచేసి మొత్తం సచివాలయాన్ని విజయవాడకు తరలించాలని నిర్ణయించినట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. తాను ఇక్కడ, అధికారులు హైదరాబాద్‌లో ఉంటే పరిపాలన సరిగా సాగదని, సాధ్యమైనంత వేగంగా మొత్తం పరిపాలనా యంత్రాంగాన్ని ఏపీకి తరలించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. కార్యదర్శులు, విభాగాధిపతులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించి గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులకు తగిన మార్గదర్శనం చేసినప్పుడే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగం పుంజుకుంటుందని చంద్ర‌బాబు అభిప్రాయపడ్డారు.

పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, స్వచ్ఛంధ్రప్రదేశ్ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సంపూర్ణ ఫలితాలు సాధించేందుకు ఈ జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. జన్మభూమి-మాఊరు కమిటీలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నామని, వారునిబద్దతతో పనిచేస్తే సత్ఫలితాలు సాధించవచ్చునని అన్నారు. 12.43 లక్షల రేషన్ కార్డులను పరిశీలించి అర్హులైన వారికి అందివ్వాలని ఆదేశించారు. పేదలకు అందుబాటులో అన్ని రకాల వైద్యసేవలు అందించడానికి వీలుగా వైద్య ఆరోగ్యశాఖలో సమూల సంస్కరణలు చేస్తున్నట్టు చంద్ర‌బాబు తెలిపారు.

సంక్రాంతి పండుగకు వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆదేశించారు. ప‌నితీరును ప్ర‌ద‌ర్శించుకోవ‌డంలో ప్రభుత్వ శాఖలన్నీ పోటీపడాలన్నారు. ఈనెల 30నకేబినెట్ స‌మావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎన్ని సమస్యలున్నా సంక్షేమ కార్యక్రమాల్లో రాజీ పడకుండా నిర్ణయాలు తీసుకుని మిగిలిన రాష్ట్రాలకంటే ఎక్కువగానే చేస్తున్నామని తెలిపారు. ఈసారికూడా సంక్రాంతి కానుక ఇస్తున్నట్టు చంద్ర‌బాబు ప్ర‌కటించారు.  నవ్యాంధ్ర నిర్మాణమే మన కర్తవ్యం’ అనే నినాదంతో ప్రజలందర్నీ మళ్లీ ఏకోన్ముఖుల్ని చేయాలని పిలుపునిచ్చారు. సంక్రాంతికి ఊరూరా ఉత్సవాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని చెప్పారు.

మొత్తంగా కొత్త ఏడాదిలో కొత్త కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని చంద్ర‌బాబు క‌రాఖండీగా చెప్పిన‌ట్ల‌యింది.
Tags:    

Similar News