మోడీ ప్ర‌త్య‌ర్థికి మ‌ద్ద‌తిచ్చిన బాబు

Update: 2016-07-17 07:12 GMT
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో ఆస‌క్తిక‌ర‌మైన ఘ‌ట్టాలు చోటుచేసుకున్నాయి. ఇటీవ‌లి కాలంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాలే ల‌క్ష్యంగా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు టార్గెట్ చేయ‌గా...ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సైతం ఈ త‌ర‌హా డిమాండ్‌ ల‌కు మ‌ద్ద‌తివ్వ‌డ‌మే కాకుండా ఆయ‌న సైతం కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా ప‌లు స‌వ‌ర‌ణ‌లు చేశారు.

ఢిల్లీ - అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ తో పాటు ప‌లు రాష్ట్రాల‌కు చెందిన గ‌వ‌ర్న‌ర్ల వైఖ‌రి వివాదాస్ప‌దం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. అంతర్రాష్ట్ర మడలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫెడరల్ ప్రజాస్వామ్యంలో రాష్ట్రాలకు గవర్నర్ వ్యవస్థను కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌రిపాల‌న‌ను ఒకింత ప‌క్క‌న పెట్టే రీతిలో ఉన్న‌ద‌ని పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారంలో గవర్నర్ వ్యవహరించిన తీరుపై సుప్రీం కోర్టు చేసిన తీవ్ర విమర్శల నేపథ్యంలో నితీష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండ‌గా చంద్ర‌బాబు సైతం త‌న ప్ర‌సంగంలో టార్గెట్ గ‌వ‌ర్న‌ర్ అన్న‌ట్లుగా సాగారు.

గవర్నర్లకు ఐదేళ్ల నిర్దిష్ట పదవీ కాల పరిమితి ఉండాలన్న జస్టిస్ ఎంఎం పూంఛి కమిషన్ సిఫార్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ససేమిరా అన్నారు. గవర్నర్లను ప్రజలుగానీ - ప్రజా ప్రతినిధులు గాని ఎన్నుకోరని - వారికి ఐదేళ్ల పదవీ కాలపరిమితిని నిర్దేశించడం అభిలషణీయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై జస్టిస్ ఎంఎం పూంఛి కమిషన్ నిర్మాణాత్మకమైన సిఫారసులు చేసిందని చెబుతూనే కొన్ని సిఫార్సులు తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాజ్యాంగంలోని 61ఎ అధికరణ ప్రకారం గవర్నర్‌ ను అభిశంసించవచ్చన్న సిఫారసు కూడా తమకు అంగీకారయోగ్యం కాదని బాబు న్నారు. అలాగే 355 - 356 అధికరణల కింద రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణ పేరిట కేంద్ర బలగాలను మోహరించేందుకు వీలు కల్పించే సిఫారసును కూడా తాము వ్యతిరేకిస్తున్నామని బాబు తేల్చిచెప్పారు. ముఖ్య‌మంత్రుల స‌మావేశం వేదిక‌గా మోడీ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌తో స‌మానంగా చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News