ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అన్యాయం చేసిందంటూ టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు గొంతెత్తి నిరసిసస్తున్న వైనం మనకు తెలిసిందే. వేదిక ఏదైనా - అంశం ఏదైనా... బాబు నోట మోదీ మోసమే వినిపిస్తోంది తప్పించి మరో మాట వినిపించడం లేదు. గడచిన నాలుగేళ్లుగా మోదీ సర్కారుతో ఆడుతూ పాడుతూ సాగిన చంద్రబాబు... ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేసి ప్రత్యేక హోదా ఉద్యమం అందుకోవడంతో ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు - ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకు ఎక్కడ లేని ఇబ్బంది వచ్చి పడిందనే చెప్పాలి. *బాబుకేం... ఎక్కడో అమరావతిలో కూర్చుని ప్రసంగాలు దంచేస్తారు... ప్రజల్లోకి వెళ్లి దీక్షలు చేసేది తాము కదా... మొన్నటిదాకా మోదీ చేసిన మోసం గుర్తుకు రాలేదా? అని ప్రజలు అడిగితే సమాధానం ఏం చెప్పాలి* అంటూ టీడీపీ శ్రేణులు తన్నుకొస్తున్న ఆగ్రహావేశాలను ఎలాగోలా కంట్రోల్ చేసుకుంటూ బయటకు మాత్రం బాబు మాటను జవదాటమంటూ ప్రకటనలు గుప్పించేస్తున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
ఈ క్రమంలో మూలిగే నక్కపై తాటి కాయ పడ్డ చందంగా... ఇప్పుడు టీడీపీ శ్రేణులకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మోసానికి నిరసనగా చంద్రబాబు... ఈ నెల 20న తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. సీఎం హోదాలోనే చేస్తున్న ఈ దీక్షకు ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లను సిద్ధం చేసే పనిలో బిజీబిజీగా ఉంది. అయినా చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తే... టీడీపీ శ్రేణులకు వచ్చిన ఇబ్బందేమిటనేగా మీ ప్రశ్న? అక్కడికే వస్తున్నాం... తాను విజయవాడలో చల్లని ప్రదేశంలో కూర్చుని దీక్ష చేస్తే... మీరంతా కూడా మీ మీ నియోజకవర్గాల్లో మండుటెండలో అయినా సరే కూర్చుని ఒక్కరోజు నిరాహార దీక్ష చేయాల్సిందేనని పార్టీ శ్రేణులకు బాబు ఆర్డరేశారు మరి. ఈ దిశగా నిన్న బాబు చేసిన ప్రకటన విషయానికి వస్తే... నిన్న అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో భాగంగా తన ఉపవాస దీక్షకు సంబంధించి సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు... తాను విజయవాడలో దీక్ష చేస్తున్నా... రాష్ట్రం మొత్తం దీక్షలతో మారుమోగిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఈ దీక్షలు జరగాల్సిందేనని ఆయన ఆర్డరేశారు.
అంతేకాకుండా ఈ దీక్షల్లో ఎమ్మెల్యేలు - నియోజకవర్గ ఇన్ చార్జీలు - పార్టీ శ్రేణులు అందరూ పాలుపంచుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. అంతేనా... తన కేబినెట్ లో ఉన్న మంత్రలు కూడా ఆ రోజున ఉపవాస దీక్ష చేయాల్సిందేనని కూడా బాబు కండీషన్ పెట్టారు. తన కేబినెట్ లోని మంత్రుల్లో ఒక్కో మంత్రి ఒక్కో జిల్లాలో జరుగుతున్న నిరాహార దీక్షలను పర్యవేక్షిస్తూ ఉపవాసాన్ని కొనసాగించాలని, మిగిలిన తొమ్మిది మంది మంత్రులు విజయవాడలో తనతో పాటు దీక్షలో కూర్చోవాల్సిందేనని చెప్పేశారు. మొత్తంగా తన జన్మదినం రోజున... రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా తాను కడుపు మాడ్చుకుంటే... తనతో పాటు టీడీపీ శ్రేణులు కూడా కడుపు మాడ్చుకోవాల్సిందేనని చంద్రబాబు తేల్చి పారేశారు. అయినా ఎక్కడైనా నేతలు దీక్షలు చేస్తుంటే.. కార్యకర్తలు తమంత తాముగా తమ నేతకు సంఘీభావంగా దీక్షలు కొనసాగిస్తారు గానీ... ఇలా నేతలే కార్యకర్తలను బలవంతంగా దీక్షలకు కూర్చోబెట్టిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. అయితే చంద్రబాబు ఏది చేసినా ప్రత్యేకమే కదా. అందకే తనతో పాటే పార్టీ శ్రేణులను కూడా దీక్షకు కూర్చోవాల్సిందేనని బాబు ఆర్డరేశారన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా బలవంతపు నిరాహార దీక్షలకు బాబు తెర తీశారన్న కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి.