ఆ మాటెత్తితే టీఆర్‌ఎస్‌కు కోపం వస్తుంది!

Update: 2015-04-13 05:49 GMT
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ పర్యటన పెట్టుకొంటే చాలు.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతలకు బీపీ రైజ్‌ అవుతుంది. బహుశా ఇది తొలిసారీ కాదు చివరిసారీ కాదు.. గత ఐదారేళ్ల నుంచి ఇదే పరిస్థితి. చంద్రబాబు తెలంగాణలో పర్యటన అనగానే తెలంగాణరాష్ట్ర సమితికి అదే చర్చనీయాంశం అవుతుంది. బాబుపై దుమ్మెత్తి పోయడం మొదలుపెడతారు గులాబీ పార్టీ నేతలు. వీలైతే విమర్శలతోనే ఆగుతారు.. అలా కాదు అనుకొంటే.. బాబు పర్యటనను ఆడ్డుకొంటామని ప్రకటనలు చేస్తారు. బాబు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టడానికి వీలు లేదని ప్రకటనలు చేస్తారు.. అన్నీ అనుకూలంగా ఉంటే.. నిజంగానే బాబు యాత్రలకు ఆటంకాలు కలిగిస్తారు. రచ్చ రచ్చ చేస్తారు.

    తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్‌ నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమంపై టీఆర్‌ఎస్‌కు పట్టు దొరికింది మొదలు.. చంద్రబాబు నోట ఎప్పుడు తెలంగాణ మాట వినిపించినా తెరాస రచ్చ చేస్తూనే ఉంది. అయితే తెలుగుదేశం అధినేత కూడా ఈ విషయంలో వెనక్కు తగ్గలేదు.

    ఎన్నికల ముందు తెలంగాణలో గట్టిగానే పర్యటనలు చేపట్టాడు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఇక ఎన్నికల తర్వాత కూడా తెలుగుదేశం అధినేత ఎక్కడా వెనక్కుతగ్గడం లేదు.

    భవిష్యత్తులో తెలంగాణలో అధికారం మాదే.. అనే అంటున్న ఆయన అందుకోసం ప్రయత్నాలను అయితే ఇప్పటి నుంచినే మొదలు పెట్టినట్టుగా ఉన్నాడు. అందుకే వరసగా తెలంగాణ ప్రాంతయాత్రలు చేపట్టాడు.

    ఈ నేపథ్యంలో బాబు చైనా నుంచి రాగానే పాలమూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నాడు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు ఎక్కడలేని కోపం వస్తోంది. బాబు ఎవరిని ఉద్ధరించడానికి పాలమూరుకు వస్తున్నాడో చెప్పాలని... తెరాస నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రశ్నలు అర్థం లేనివేమో!
Tags:    

Similar News